Soundarya Rajinikanth : భార్య వదిలేసిన మూవీకి ధనుష్ దర్శకత్వం - ‘DD3’ వెనుక అంత కథ ఉందా?
DD3: ధనుష్ తన దర్శకత్వంలో ప్రకటించిన మూడో ప్రాజెక్ట్ 'నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోవమ్' మూవీని మొదట సౌందర్య రజనీకాంత్ డైరెక్ట్ చేయాలనుకున్నారట.
Dhanush's Nilavuku En Mel Ennadi Kobam : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కేవలం హీరోగానే కాకుండా సింగర్ గా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నాడు. ఇప్పటికే దర్శకుడిగా రెండు సినిమాలను తెరకెక్కించాడు. ఇక తాజాగా తన దర్శకత్వంలో మూడో సినిమాను అధికారికంగా ప్రకటించాడు. 'DD3' అనే వర్కింగ్ టైటిల్ తో రెండు రోజుల క్రితం ఓ పోస్టర్ రిలీజ్ చేసిన ధనుష్ తాజాగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. ధనుష్ తెరకెక్కిస్తున్న మూడో చిత్రానికి 'నిలవుక్కు ఎన్ మెల్ ఎన్నాడి కోవం' (జాబిల్లికి నాపై కోపం ఎందుకు) అనే టైటిల్ ఖరారు చేశారు. 'ఏ యూజువల్ లవ్ స్టోరీ' అనేది ఉప శీర్షిక.
సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మాథ్యూ థామస్, ప్రియా ప్రకాష్ వారియర్, అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యువత చుట్టూ తిరిగే ఈ సరికొత్త ప్రేమ కథకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. అదేంటంటే, నిజానికి ఈ ప్రాజెక్ట్ ని సౌందర్య రజనీకాంత్ డైరెక్ట్ చేయాల్సిందట. కొన్నాళ్ల క్రితం ధనుష్, సౌందర్య 'విఐపి2' సినిమా చేయడానికి ముందు ఇద్దరూ ఈ ప్రాజెక్టు కోసం పనిచేయాలని అనుకున్నారు. ధనుష్ కొన్నాళ్లుగా ఈ సినిమా తీయాలని ప్రయత్నిస్తున్నాడు.
కొన్నేళ్ల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ రాసుకున్నాడు. అలాగే సౌందర్య రజనీకాంత్ ని దర్శకత్వం వహించమని కోరాడు. అయితే ధనుష్ ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేసిన అనంతరం సౌందర్య పాత ఇంటర్వ్యూ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "నేను మొదట్లో 'నిలవుక్కు ఎన్ మెల్ ఎన్నాడి కోవం' స్క్రిప్ట్ పై వర్క్ చేశాను. ఈ సినిమా కోసం సోషల్ మీడియాలో కాస్ట్ కాల్ కూడా పెట్టాను. ధనుష్ రాసిన మంచి స్క్రిప్ట్ ఇది. అయితే ఈ స్క్రిప్ట్ కోసం నాకు సరైన నటీనటులు దొరకలేదు. అదే సమయంలో ఇతర ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. దాంతోపాటు 'విఐపి 2' టాపిక్ కూడా వచ్చింది. దాంతో ఆ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయలేకపోయాను" అని చెప్పుకొచ్చింది.
ఇక ధనుష్ విషయానికొస్తే.. హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో వస్తోన్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, టాలీవుడ్ యంగ్ హరో సందీప్ కిషన్ నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్‌ఆర్‌ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2024 జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Also Read : సముద్రం మధ్యలో షూటింగ్ - ‘తండేల్’ టీమ్ సాహసం