The Raja Saab vs Idli Kadai: ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీ రిలీజ్ డేట్ ను టార్గెట్ చేసిన ధనుష్ - ఎందుకో తెలుసా?
Idli Kadai: ధనుష్ హీరోగా నటిస్తున్న 'ఇడ్లీ కడై' అనే తమిళ మూవీ ఏప్రిల్ 10 న రిలీజ్ కాబోతోంది. అదే రోజు 'ది రాజా సాబ్' రిలీజ్ కూడా ఉండడం గమనార్హం.
Idli Kadai Release Date: ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ బాహుబలి ఎవరు అంటే చిన్న పిల్లలతో సహా టక్కుమని చెప్పేస్తారు ప్రభాస్ అని. ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు ఆ దరిదాపుల్లో ఎలాంటి సినిమాను రిలీజ్ చేయడానికి ధైర్యం చేయరు. ఎంత పెద్ద స్టార్స్ అయినా సరే ఏ ఇండస్ట్రీలోనూ ప్రభాస్ సినిమా వస్తున్న టైంకి వేరే పెద్ద హీరోల సినిమాల రిలీజ్ లు పెట్టుకోరు. కాదు కూడదు అని రిలీజ్ చేస్తే నష్టాలు తప్పవు అన్న విషయం వాళ్లకి బాగా తెలుసు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇప్పటికే 'డంకీ' అనే సినిమాను రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా తమిళ హీరో ధనుష్ మాత్రం తన కొత్త మూవీని ప్రభాస్ కు పోటీగా బాక్స్ ఆఫీసు బరిలోకి దింపడానికి రెడీ అయ్యాడు.
సలార్, కల్కి 2898 ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్న ప్రభాస్ ఫస్ట్ టైం చేస్తున్న హర్రర్ కామెడీ మూవీ 'ది రాజా సాబ్'. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తయింది కూడా. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్టు చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. పైగా షెడ్యూల్ కు తగ్గట్టుగా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కాబట్టి ఈ రిలీజ్ డేట్ లో మార్పు ఉండకపోవచ్చు. అయితే తాజాగా ధనుష్ 'ఇడ్లీ కడై' అనే సినిమాను ఇదే డేట్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు.
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా 'ఇడ్లీ కడై'. ఈ సినిమాను కూడా కరెక్ట్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తాం అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ధనుష్ మూవీ అంటే తెలుగుతో పాటు సౌత్ మొత్తంలోనూ రిలీజ్ అవుతుంది. కానీ తెలుగులో ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి 'ఇడ్లీ కడై' మూవీపై జనాలు పెద్దగా ఆసక్తిని చూపించే అవకాశం లేదు. అయితే తమిళ థియేటర్లలో కలెక్షన్ల దగ్గర 'ది రాజా సాబ్'కి 'ఇడ్లీ కడై' మూవీ వల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. అయితే ధనుష్ ఇదే తేదీన తన సినిమాను రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అంటే ప్రత్యేక సందర్భం ఉంది.
మన తెలుగు వాళ్లకు ఉగాది ఎలాగో తమిళ వాళ్లకు ఏప్రిల్ లో వచ్చే న్యూ ఇయర్ కూడా అలాంటిదే. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న తమిళనాడులో న్యూ ఇయర్ జరుపుకుంటారు. పైగా దానికి లాంగ్ వీకెండ్ కూడా కలిసి రాబోతోంది. అందుకే ధనుష్ ఏప్రిల్ 10ని టార్గెట్ చేశారు. మొత్తానికి 'ది రాజా సాబ్'తో పాటు ధనుష్ మూవీ కూడా రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గే అవకాశాలు లేవన్నది స్పష్టంగా అర్థం అవుతుంది. కానీ ఈ రెండు సినిమాల్లో విన్నర్ ఎవరు అనేది మాత్రం చూడాల్సిందే.
Read Also : Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!