Bro The Avatar: పవన్ - సాయి తేజ్ - ఇంతకీ ఇద్దరిలో దేవుడెవరు 'బ్రో'?
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా 'బ్రో'. ఇప్పటికే టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుండగా.. మామా అల్లుళ్ళ పాత్రలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్రో'. పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. మెగా మేనమామ-మేనల్లుడు మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో లేటెస్టుగా వచ్చిన సాయి తేజ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. అదే సమయంలో సినిమాలో వీరిద్దరి పాత్రలకు సంబంధించి పలు సందేహాలను లేవనెత్తాయి.
'బ్రో' సినిమాలో పవన్ ఒక దేవుడిగా కనిపించనున్నారు. మోషన్ పోస్టర్ లో "కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్ చారణం.. కాలః జన్మనాజాయతే.." అనే శ్లోకంతో దీనిపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక సాయి ధరమ్ తేజ్ ఈ మూవీలో మార్క్ అలియాస్ మార్కండేయులు అనే పాత్రలో కనువిందు చేయనున్నారని తాజాగా ప్రకటించారు. మోషన్ పోస్టర్ లో గోడ గడియారాన్ని చూపిస్తూ ఆయన పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో తేజ్ ఒక భక్తుడిగా కనిపిస్తాడని అనుకుంటుండగా, తెల్లని దుస్తుల్లో ఒక దేవదూతగా ప్రెజెంట్ చేసారు.
పురాణాల ప్రకారం, మార్కండేయుడు ఒక ఋషి. శివుని యొక్క గొప్ప భక్తుడు. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మార్కండేయుడు, భక్తితో సాక్షాత్తు ఆ పరమ శివుడినే ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు. కాలాన్ని ఎదిరించి మృత్యుంజయుడు అవుతాడు, తద్వారా తను అనుకున్నది సాధిస్తాడు. ఇప్పుడు 'బ్రో' లో సాయి ధరమ్ తేజ్ పాత్ర పేరు మార్కండేయులు అని పెట్టడాన్ని బట్టి, సినిమాలో అతను మృత్యువుని జయించి, తన కోరికలను నెరవేర్చుకుంటాడనిపిస్తోంది.
'బ్రో' అనేది 'వినోదయ సీతం' అనే తమిళ్ చిత్రానికి అధికారిక రీమేక్ అనే సంగతి తెలిసిందే. దేవుడు - భక్తుడి మధ్య ఆసక్తికరమైన కథాంశంతో సముద్రఖని ఈ సినిమాజని రూపొందించారు. ఇందులో సముద్ర ఖని - తంబి రామస్వామి ప్రధాన పాత్రల్లో నటించారు. కానీ ఇక్కడ బ్రో విషయానికొస్తే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా త్రివిక్రమ్ పలు మార్పులు చేర్పులు చేసారు. ఒరిజినల్ సినిమా నుంచి మెయిన్ ప్లాట్ ని మాత్రమే తీసుకున్నారనే టాక్ ఉంది.
ఇందులో పవన్ ను మోడరన్ గాడ్ గా చాలా స్టైలిష్ గా చూపించనున్నారు. అతను టైమ్ ఆఫ్ గాడ్ పాత్రను పోషిస్తున్నప్పటికీ, BRO మోషన్ పోస్టర్ లో శివుడి గురించి ప్రస్తావించడాన్ని మనం గమనించవచ్చు. మరోవైపు సాయి తేజ్ పాత్రను మాత్రం మాతృకకు కాస్త భిన్నంగా తీర్చిదిద్దుతున్నారని టాక్. మార్కండేయులు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
Also Read : శరత్ బాబు అంత్యక్రియలకు కమల్ హాసన్ ఎందుకు రాలేదంటే?
కాగా, 'బ్రో' చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్, సముద్ర ఖని, రోహిణి, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నర్రా శ్రీను, అలీ రెజా ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
'బ్రో' సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Also: ఇంటిమేట్ సీన్స్ తో సమంత షాక్ ఇవ్వబోతోందా..?