Rajinikanth Biopic: తెర మీదకు సూపర్ స్టార్ బయోపిక్ - రజనీకాంత్ పాత్రలో నటించే హీరో ఎవరంటే?
Rajinikanth Biopic: రజనీకాంత్ బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. బస్ కండక్టర్ నుంచి తిరుగులేని 'సూపర్ స్టార్'గా ఎదిగిన ఆయన స్ఫూర్తిదాయక జీవితాన్ని తెర మీదకు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Rajinikanth Biopic: తలైవర్ రజనీకాంత్ జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ రంగంలో అడుగుపెట్టి, తిరుగులేని 'సూపర్ స్టార్ 'గా ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. అలాంటి దిగ్గజ నటుడి బయోపిక్ కి రంగం సిద్ధమవుతోందని నేషనల్ మీడియా కోడై కూస్తోంది. బాలీవుడ్ మావెరిక్ ప్రొడ్యూసర్ సాజిద్ నదియాడ్ వాలా భారీ ఎత్తున రజనీ బయోపిక్‌ను రూపొందించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు చెన్నైలో కలుసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
సాజిద్ నడియాడ్‌వాలా సౌత్ హీరో రజనీకాంత్ కి వీరాభిమాని అని చాలా కొద్దిమందికే తెలుసు. బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన తన అభిమాన నటుడి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని వెండి తెర మీదకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. దీని కోసమే రజనీని కలిసి బయోపిక్ హక్కుల కోసం అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. సాజిద్ వ్యక్తిగతంగా ఈ స్క్రిప్ట్‌ని పర్యవేక్షించడమే కాదు, భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. స్క్రిప్ట్ వర్క్ పూర్తైన తర్వాత నటీనటులను ఎంపిక చేసి, 2025లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు టాక్ నడుస్తోంది.
సూపర్ స్టార్ బయోపిక్ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ, రజనీకాంత్ జీవితాన్ని స్క్రీన్ మీద చూపించడం అనేది మంచి ఆలోచనే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన లైఫ్ లో సినిమాకి కావాల్సినంత డ్రామా చాలానే ఉంది. ఒక సాధారణ బస్ కండక్టర్ అయిన శివాజీ రావ్ గైక్వాడ్.. ప్రాణ స్నేహితుడి సలహా విని జాబ్ మానేసి చెన్నైకి రావడం, యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ తో ఫిల్మ్ స్కూల్‌లో జాయిన్ అవ్వడం, సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు చేయడం, దర్శకుడు బాలచందర్ తో పరిచయం, హీరో కమల్ హాసన్ స్నేహం, లతతో ప్రేమ వివాహం, తనదైన స్టయిల్‌తో మేనరిజంతో దేశ విదేశాల్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకోవడం, నటుడిగానే కాకుండా తన సేవా కార్యక్రమాలతో మంచి మనసుని చాటుకోవడం, 73 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం, రాజకీయ పార్టీ పెట్టాలనుకొని వెనక్కి తగ్గడం.. ఇలా ఆయన జీవితంలో అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అందుకే ఆయన జీవితాన్ని సాజిద్ నడియాడ్‌వాలా సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
కాకపోతే ఇక్కడ రజనీకాంత్ పాత్రను సమర్ధవంతంగా పోషించే నటుడు ఎవరు? ఆయన జీవితాన్ని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించే డైరెక్టర్ ఎవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. తలైవర్ స్టయిల్‌ని, మ్యానరిజాన్ని గ్రేస్ ని మ్యాచ్ చెయ్యడం అంత ఆషామాషీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది సినిమా ఫలితంపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే సూపర్ స్టార్ బయోపిక్ లో భాగమయ్యే దర్శక హీరోలు ఎవరో తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికైతే రజనీ బయోపిక్‌లో తమిళ హీరో ధనుష్ నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్న ధనుష్ అయితేనే, రజనీకాంత్ పాత్రకి న్యాయం చేయగలరని అంటున్నారు. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.
ఇదిలా ఉంటే రజనీకాంత్ ప్రస్తుతం 'జై భీమ్' ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో `వేట్టయాన్` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `కూలీ` అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి విడుదలైన ఫస్ట్ లుక్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Also Read: పాపం, ఈ హీరోయిన్స్‌కు హిట్స్ అంటే తెలియదు