సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!
హీరోయిన్ సాయి పల్లవిపై చాలా కాలంగా తనకు క్రష్ ఉందని బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య తెలిపారు. ఆమె నంబర్ కూడా తన దగ్గర ఉందన్న నటుడు.. ఛాన్స్ వస్తే ఆమెతో కలిసి నటించాలని ఆశ పడుతున్నాడు.
'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, 'ఫిదా' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తన సహజమైన నటనతో, ఎనెర్జిటిక్ డ్యాన్సులతో తొలి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేసింది. గ్లామర్ షోకు ఆమడ దూరంలో ఉంటూ, కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే సాయి పల్లవి మీద క్రష్ ఉన్నట్లు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య తాజాగా వ్యాఖ్యానించారు.
గుల్షన్ దేవయ్య హిందీలో 'హంట్' ‘బదాయి దో' 'బ్లర్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల విడుదలైన '8 AM మెట్రో' మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటుడు మాట్లాడుతూ, తనకు సౌత్ హీరోయిన్ సాయి పల్లవిపై క్రష్ ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు తన దగ్గర ఆమె నంబర్ కూడా ఉందని, కానీ ఫోన్ చేసే ధైర్యం చేయలేకపోయానని అన్నారు.
గుల్షన్ దేవయ్య మాట్లాడుతూ.. "సాయి పల్లవి పై నాకు క్రష్ ఉంది. ఇది కొంతకాలంగా కొనసాగుతోంది. నా దగ్గర ఆమె ఫోన్ నంబర్ కూడా ఉంది. కానీ కాల్ చేసేంత సాహసం చేయలేదు. నాకు తెలిసి ఆమె అద్భుతమైన నటి, డ్యాన్సర్. ఇది క్రష్ మాత్రమే అని నేను అనుకుంటున్నాను. అంతకు మించి ఏమీ లేదు. కొన్నిసార్లు ఆమె పట్ల ఇన్‌ఫాచ్యువేషన్ కు లోనయ్యాను" అని అన్నారు.
"సాయి పల్లవి చాలా మంచి నటి. జీవితంలో ఒక్కసారైనా ఆమెతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని అనుకుంటున్నాను. అప్పుడు నా సంతోషానికి అవధులు ఉండవు. మిగిలిన వాటి గురించి నాకు తెలియదు. మనం చేసేదేముంది? ఏదైనా జరగాలనుంటే జరుగుతుంది, లేదంటే జరగదు. అయితే మంచి యాక్టర్ తో నటించే అవకాశం వస్తే బాగుంటుంది. అందులో తప్పేమీ లేదు కదా. కనీసం ఆ చాన్స్ దక్కితే మంచిదే'' అని గుల్షన్ దేవయ్య అన్నారు.
గుల్షన్ గతంలో గ్రీస్ కు చెందిన నటి కల్లిర్రోయ్ టిజియా ఫెటాని పెళ్లి చేసుకున్నాడు. 2012లో వివాహం చేసుకున్న ఈ జంట 2020లో విడిపోయారు. అప్పటి నుంచీ నటుడు సింగిల్ గా ఉన్నాడు. ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన గుల్షన్.. ''మంచి విషయాలను భద్రంగా దాచుకుని, రిలేషన్ ను కంటిన్యూ చేస్తుండటంలో నా మాజీ భార్యకి నేను ఈక్వల్ క్రెడిట్ ఇస్తాను. సొసైటీకి మనం ఆదర్శంగా ఉండాలని నేను అనుకోలేదు. ప్రజలు ఇది కష్టం అనుకుంటారు కానీ, అది నిజం కాదు. మేము మా కోసం సమయం ఇచ్చుకున్నాం. దేనికీ తొందర పడలేదు. ఆమె ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్. తనకు నేను ఏదైనా చెప్పగలను. నేను డేటింగ్ కి వెళ్తే కూడా తనకు చెప్తాను'' అని చెప్పుకొచ్చాడు.
గుల్షన్ ప్రస్తుతం 'లవ్ అఫైర్' సినిమాతో పాటుగా 'ఉలాజ్' అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు. అలానే గన్స్ & గులాబ్స్ అనే టీవీ సిరీస్ లో నటిస్తున్నారు. ఇక గతేడాది 'విరాట పర్వం' 'గార్గి' చిత్రాల్లో కనిపించిన సాయి పల్లవి.. తెలుగు ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయలేదు. ఇప్పుడు ఆమె కమల్ హాసన్ నిర్మాణంలో శివ కార్తికేయన్ తో కలిసి ఓ తమిళ్ మూవీలో నటిస్తోంది.