Bathukamma Song Bollywood : వెంకీ సలహాతో బాలీవుడ్ సినిమాలో బతుకమ్మ పాట - బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఆట
Bathukamma Song - Salman Khan Movie : తెలంగాణ పండక్కి బాలీవుడ్ సినిమాలో చోటు దక్కింది. మన సంస్కృతిలో భాగమైన సంబరాన్ని సల్మాన్ ఖాన్ వెండితెరపై చూపించబోతున్నారు.
బతుకమ్మ పండుగ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. తెలంగాణ సంస్కృతిలో అదొక భాగం. అయితే, ఉత్తరాది ప్రేక్షకులలో 'బతుకమ్మ' గురించి ఎంత మందికి తెలుసు? అంటే... ఇన్ని రోజులూ చెప్పడం కష్టమే. కొందరికి తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఎందుకు? అంటే... సల్మాన్ ఖాన్ సినిమాలో బతుకమ్మ పాట ఉంది కాబట్టి!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' (Kisi Ka Bhai Kisi Ki Jaan Movie). ఇందులో పూజా హెగ్డే కథానాయిక. విక్టరీ వెంకటేష్ ఓ ప్రత్యేక పాత్ర చేశారు. పూజాకి అన్నయ్యగా ఆయన కనిపిస్తారు. ఏప్రిల్ 21న థియేటర్లలోకి సినిమా రానుంది. ఈ సినిమాలో బతుకమ్మ విశిష్టతను తెలిపేలా సాంగ్ రూపొందించారు.
బతుకమ్మ పాటకు బుట్ట బొమ్మ ఆట!
'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాలో 'బతుకమ్మ' పాటను ఈ రోజు విడుదల చేశారు. 'కె.జి.యఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించగా... తెలుగు లిరిక్స్ హరిణి ఇవటూరి, కిన్నల్ రాజ్ రాశారు. హిందీ లిరిక్స్ షబ్బీర్ అహ్మద్, రవి బస్రూర్ రాశారు.
'బతుకమ్మ' వీడియో సాంగులో బుట్టబొమ్మ పూజా హెగ్డే డ్యాన్స్ ఆకట్టుకునేలా ఉంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చక్కగా చేశారు. బతుకమ్మ పాట చూస్తే... అందులో భూమిక కూడా కనిపిస్తారు. వెంకటేష్ భార్య పాత్రలో ఆమె నటించారు. రోహాణి హట్టంగడి కూడా ఉన్నారు. సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డేను హైదరాబాదీ అమ్మాయిగా చూపిస్తున్నారు.
వెంకీ సలహాతో...
సినిమాలోని ఓ సందర్భంలో 'బతుకమ్మ...' పాట పెడితే బావుంటుందని విక్టరీ వెంకటేష్ సలహా ఇచ్చారట. ఆ ఐడియా నచ్చిన సల్మాన్ ఖాన్... పాట పెట్టమని దర్శక, నిర్మాతలకు చెప్పారట. ఈ పాటను తెలంగాణలో మహిళలకు అంకితం ఇస్తున్నట్లు సమాచారం. సుమారు 200 మంది డ్యాన్సర్లు, సినిమాలోని ప్రధాన తారాగణం మీద పాటను తెరకెక్కించారు.
ఓ పాటలో రామ్ చరణ్ కూడా!
'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాలో మరో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే... ఓ పాటలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డేతో రామ్ చరణ్ స్టెప్పులు వేశారు. ఆ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. చాలా రోజుల క్రితమే ఆ పాటను పిక్చరైజ్ చేశారు.
Also Read : బాలీవుడ్‌కు కాజల్ భారీ పంచ్ - సౌత్‌తో కంపేర్ చేస్తూ గాలి తీసేసిందిగా!
View this post on Instagram
సల్మాన్ ఖాన్, మెగా ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధం ఉంది. చిరంజీవి కోసమే 'గాడ్ ఫాదర్' సినిమాలో సల్మాన్ స్పెషల్ రోల్ చేశారు. పతాక సన్నివేశాల్లో చిరు, సల్మాన్ సీన్లు హైలైట్ అయ్యాయి! ఆ సినిమాకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సల్మాన్ చేశారు. హిందీలో రామ్ చరణ్ 'జంజీర్' చేసినప్పుడు ఆయన మద్దతు ఇచ్చారు. సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వస్తే తప్పకుండా మెగాస్టార్ ఇంటికి రాకుండా వెళ్ళారు. ఒకవేళ రావడం కుదరకపోతే కనీసం ఫోనుల్లో అయినా పలకరించుకుంటారు. ఆ అనుబంధం కారణంగా సల్మాన్ సినిమాలోని సాంగులో రామ్ చరణ్ స్పెషల్ రోల్ చేశారు. అదీ సంగతి!
Also Read : విడాకులకు నాగ చైతన్యే కారణమా? సమంత మాటలకు అర్థం ఏమిటి?