'బలగం' నటుడు కన్నుమూత - దర్శకుడు వేణు ఎమోషనల్
'బలగం' సినిమాలో సర్పంచ్ పాత్రలో నటించిన నటుడు కీసర నర్సింగ్గం తాజాగా కన్నుమూశారు. ఈ విషయాన్ని దర్శకుడు వేణు తన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఆయనకు సంతాపాన్ని ప్రకటించారు.
టాలీవుడ్ లో ఓ కమెడియన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన వేణు రీసెంట్గా 'బలగం' సినిమాతో దర్శకుడిగా మారి మొదటి ప్రయత్నంలోనే భారీ సక్సెస్ అందుకున్నాడు. అప్పటివరకు నటుడిగా, కమెడియన్గా మెప్పించిన వేణు లోని మరో కోణాన్ని చూపించిన సినిమా 'బలగం'. ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా 100 పురస్కారాలను అందుకుంది ఈ చిత్రం. ఇక తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కుటుంబ విలువలను తెలియజేసేలా తెరకెక్కిన ఈ సినిమాతో ఎంతో మంది సహజ నటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు వేణు. అలాంటి సహజ నటుల్లో ఒకరైన నటుడు నర్సింగం ఈరోజు మరణించారు.
'బలగం' సినిమాలో సర్పంచ్ పాత్రలో నటించిన పెద్దాయన కీసరి నర్సింగం ఈరోజు కన్నుమూశారు. ఈ విషయాన్ని దర్శకుడు వేణు తన ట్విట్టర్ మాధ్యమం ద్వారా తెలుపుతూ ఆయనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు." మీ చివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుడిని మీరు చూసుకొని, మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓం శాంతి. బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగ్గం బాపునే కలిశాను. ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు నాకోసం" అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు వేణు. అలాగే నర్సింగం తో తీసుకున్న ఫోటోలు కూడా తన ట్వీట్ లో పంచుకున్నారు.
నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి 🙏
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) September 5, 2023
మీచివరి రోజుల్లో బలగం సినిమా ద్వారా మీలోని నటుణ్ని మీరు చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓంశాంతి🙏
బలగం కథ కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు మొదటగా నర్సింగం బాపునే కలిసాను.ఆరోజు కళ్ళు, గుడాలు తెప్పించాడు నాకోసం..🙏 pic.twitter.com/smDHR8ULyU
ఇక కీసరి నర్సింగం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు నెల క్రితం వేణు నర్సింగం ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. 'బలగం' సినిమా 100కు పైగా అంతర్జాతీయ పురస్కారాలు సాధించడంతో హైదరాబాద్లో జూలైలో ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు 'బలగం' సినిమాలో పనిచేసిన అందరికీ జ్ఞాపికలు అందజేశారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ ఈవెంట్ కు నర్సింగం రాలేకపోయారు. దీంతో ఈవెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత వేణుతో పాటు మరికొంతమంది వెళ్లి నర్సింగం ను కలిశారు.
అంతేకాకుండా ఆయన కోసం కేటాయించిన జ్ఞాపికను తీసుకొద్దామనిఅనుకొని, ఆ జ్ఞాపికను తీసుకురావడం మరిచిపోయామని బాధపడ్డారు. ఇక ఈరోజు నర్సింగం అనారోగ్య కారణాలతో కన్ను మూయడంతో ఈ విషయాన్ని వేణు తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పంచుకుని ఎమోషనల్ అవుతూ ఆయన మరణం పట్ల తన సంతాపాన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే చిన్న సినిమాలను, కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడంలో నిర్మాత దిల్ రాజు ఎప్పుడూ ముందే ఉంటారు. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో 'దిల్ రాజు ప్రొడక్షన్స్' అనే కొత్త నిర్మాణ సంస్థను ఆయన ప్రారంభించారు.
ఆ నిర్మాణ సంస్థ బాధ్యతలను హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డికి అప్పగించారు. ఇక ఈ నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన తొలిచిత్రమే 'బలగం'. కుటుంబ బంధాలు, బంధుత్వాల గురించి మనసును హత్తుకునే విధంగా దర్శకుడు వేణు ఈ సినిమాని తెరకెక్కించారు. చిన్న సినిమాగా విడుదలైన 'బలగం' ఎవరూ ఊహించనంత భారీ విజయాన్ని అందుకుంది. సినిమాలో ప్రతి ఒక్క ఎమోషన్ కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణలోని పలు గ్రామాల్లో ఏకంగా తెరలు కట్టి మరీ ఈ సినిమాను ప్రదర్శించారు. అంతెందుకు ఈ సినిమా చూసి విడిపోయిన ఎన్నో కుటుంబాలు కలిసిపోయాయి. అంతలా ప్రజలపై ప్రభావాన్ని చూపించింది ఈ సినిమా.
Also Read : 'థాంక్యూ ఫర్ కమింగ్' ట్రైలర్ రిలీజ్ - బోల్డ్ లుక్‌తో ఆకట్టుకుంటున్న భూమి పెడ్నేకర్!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial