Balagam: 'బలగం' యాక్టర్ కన్నుమూత - సంతాపం తెలిపిన డైరెక్టర్ వేణు
GV Babu: బలగం నటుడు జీవీ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల డైరెక్టర్ వేణు సంతాపం తెలియజేశారు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారని అన్నారు.

Balagam Actor GV Babu Passed Away: 'బలగం' నటుడు జీవీ బాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మూవీలో హీరో ప్రియదర్శి చిన్న తాత అంజన్న పాత్రలో తన నటనతో మెప్పించారు.
డైరెక్టర్ వేణు సంతాపం
జీవీ బాబు మృతి పట్ల డైరెక్టర్ వేణు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 'జీవీ బాబు గారు ఇక లేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో ఆయన్ను 'బలగం' సినిమాతో వెండితెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.' అని పేర్కొన్నారు.
జి వి బాబు గారు ఇకలేరు🙏
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 25, 2025
ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు..
చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది🙏🙏
అయన ఆత్మ శాంతించాలి అని కోరుకుంటున్నాను 💐🙏#balagam #artist #stage #plays #natakam pic.twitter.com/fzDHReHt8g
Also Read: అల్లు అర్జున్, అట్లీ మూవీకి డిఫరెంట్ టైటిల్ - అంత మంది హీరోయిన్లా?, అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..
కొంతకాలం క్రితం జీవీ బాబు రెండు కిడ్నీలు దెబ్బతినడం సహా గొంతు ఇన్ఫెక్షన్‌కు గురి కాగా.. ఆయన మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు. వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో హీరో ప్రియదర్శి, వేణు కొంత ఆర్థిక సాయం చేశారు. అప్పటికీ వైద్య ఖర్చులు ఎక్కువ కావడంతో సాయం కోసం ఆయన కుటుంబ సభ్యులు వేడుకున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి జీవీ బాబు తుదిశ్వాస విడిచారు.
రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన 'బలగం' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పల్లెటూరు, అనుబంధాలు ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమా రియల్‌గా దూరమైన ఎన్నో కుటుంబాలను కలిపింది. సినిమాలో ప్రియదర్శికి చిన్న తాతగా అంజన్న పాత్రకు జీవం పోశారు జీవీ బాబు. ఎంతో సహజంగా నటించి తనదైన ముద్ర వేశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కొన్ని రోజుల క్రితం 'బలగం' మూవీ నటుడు మొగిలయ్య కూడా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూశారు.






















