Ashish Mhatre On Adipurush: ఆ సినిమా ఓ అద్భుతం, 90 సెకన్ల టీజర్‌తో అంచనా వేసేస్తారా? - ‘ఆదిపురుష్’ ఎడిటర్ ఆశిష్
‘ఆదిపురుష్’ టీజర్ విషయంలో సర్వత్రా విమర్శలు రావడంపై ఆ సినిమా ఎడిటర్ ఆశిష్ మహత్రే తాజాగా స్పందించారు. 90 సెకెన్ల టీజర్ చూసి సినిమా మొత్తాన్ని అంచనా వేయలేరని వెల్లడించారు.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, క్యూట్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ తెరకెక్కించిన ఈ మూవీ టీజర్ భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఊహించని రీతిలో ఈ టీజర్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ నడించింది. సినిమా విడుదలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రతికూల స్పందనపై దర్శకుడు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సినిమాలో పలు మార్పులు చేర్పుల కోసం రిలీజ్ ను వాయిదా వేశారు. ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
టీజర్ చూసి సినిమాను అంచనా వేయలేరు
తాజాగా ఈ అంశం గురించి 'ఆదిపురుష్' ఎడిటర్ ఆశిష్ మహత్రే స్పందించారు. 90 సెకన్ల టీజర్ చూసి సినిమాను అంచనా వేయలేమని చెప్పారు. సినిమా అనేది టీజర్‌ను మించినదని గుర్తుంచుకోవాలన్నారు. 'ధారవి బ్యాంక్', 'గాంధీ టాక్స్' తో పాటు కొన్ని మరాఠీ సినిమాలకు ఎడిటర్ గా పని చేసిన ఆయన, ఇప్పుడు 'ఆదిపురుష్' ప్రాజెక్ట్ కు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. టీజర్ విడుదల తర్వాత టీమ్ ఎదుర్కొన్నవిమర్శలు, సినిమా విధానం, ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారు? అనే విషయాల గురించి మాట్లాడారు.
కథలో ఎలాంటి వివాదాస్పద అంశాలకు చోటు లేదు
"టీజర్ విడుదలైనప్పుడు టీమ్ మొత్తం షాక్‌లోకి వెళ్లిపోయింది. ఎందుకంటే, మేము ఇలాంటి రివ్యూలను ఎప్పుడూ ఊహించలేదు. కానీ, దర్శకుడు ఓం రౌత్ ఫోకస్ చాలా స్పష్టంగా ఉంది. ఈ సినిమా గురించి మాకు వివరించినప్పుడు, ఆయన ఏమి కోరుకుంటున్నారో చాలా స్పష్టంగా చెప్పారు. కథలో ప్రజల మనోభావాలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి అంశాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. యువతకు నచ్చేలా ఈ సినిమాను రూపొందించారు" అని ఆశిష్ వెల్లడించాడు.
3D వెర్షన్ చూసి పొరపాటును సరిదిద్దుకున్నారు
"మేము చెప్పాలనుకున్నది ప్రేక్షకులకు చేరుకోవడంలో విఫలమై ఉండవచ్చు. మేం రూపొందించిన కథను ప్రేక్షకులు ఊహించలేదు.ఎందుకంటే, రాముడు, సీత పాత్రలను కొత్త లుక్ లో చూడలేకపోయారు. పాత రూపంలోనే 'ఆదిపురుష్' సినిమాలోనూ ఉంటారు అని భావించారు. మెజారిటీ ప్రజలు టీజర్ 3D వెర్షన్‌ను చూడలేదు. టీజర్‌ను 3D లో చూసినప్పుడు, వారు తమ అభిప్రాయాలను తప్పకుంటా మార్చుకుంటారు. చాలా మంది మార్చుకున్నారు కూడా. 3D వెర్షన్‌ని చూసిన తర్వాత వారి మాటలను వెనక్కి తీసుకున్నారు కూడా” అని వివరించారు.
ఈ సినిమాలో ఊహకు అందని పాత్రలను చూస్తారు
టీజర్ తర్వాత నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో VFX విషయంలో చాలా మార్పులు చేసినట్లు ఆశిష్ మహత్రే తెలిపారు. "విఎఫ్‌ఎక్స్ ఫిల్మ్ లో పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో నిర్ణయించబడే అనేక అంశాలు ఉన్నాయి. ఇందుకోసం విభిన్న లే అవుట్‌లు, యానిమేషన్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇలా సినిమా రూపొందించడం అంత ఈజీ కాదు. చాలా సమయం తీసుకుంటుంది” అని వివరించారు. అయితే, ఈ సినిమాలో పెద్దగా మార్పులు చేయలేదని చెప్పారు. ‘‘విమర్శల తర్వాత సినిమాలో ఎలాంటి మార్పులు చేయలేదు, ముందే అనుకున్న సినిమా చేశాం. ఏదైనా ప్రత్యేక సన్నివేశానికి డిమాండ్ వచ్చినప్పుడు కొన్ని మార్పులు చేశాం. కానీ, సినిమాలో పెద్దగా మార్పులు లేవు. ఈ సినిమాలో ఊహకు అందని పాత్రలను చూస్తారు, ప్రతి పాత్రతోనూ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది” అని అన్నారు.
Read Also: అమెరికాలో మరోసారి ‘RRR‘ తుఫాన్, మార్చిలో 200 థియేటర్లలో రీరిలీజ్