మరో మల్టీస్టారర్ సినిమాతో వస్తున్న అల్లరి నరేష్ - ఈసారి నాగార్జునతో?
నాగార్జునతో అల్లరి నరేష్ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. అల్లరి నరేష్ తో చర్చలు జరుపుతున్న టీం త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందని టాక్.
టాలీవుడ్‌లో మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్‌ని షేర్ చేసుకోగా.. ‘వాల్తేరు వీరయ్య’లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజా రవితేజ కలిసి నటించారు. అలానే విశ్వక్ సేన్ హీరోగా చేసిన ‘ఓరి దేవుడా’ సినిమాలో విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్ చేశారు. ఇలా సీనియర్ హీరోలు సైతం ఇతర హీరోలతో తెరని పంచుకునేందుకు రెడీ అంటున్నారు. త్వరలోనే మరో మల్టీస్టారర్ రాబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఆ హీరోలు ఎవరో కాదు అక్కినేని నాగార్జున, అల్లరి నరేష్ అని తెలుస్తోంది.
అల్లరి నరేష్.. ఈ పేరు తెలియని సీని ప్రేక్షకులు ఉండరు. ‘అల్లరి’ సినిమాతోనే... టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు నవ్వులు తెప్పించాడు. ప్రస్తుతం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ వైవిధ్యభరితమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల ‘నాంది’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత.. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ‘ఉగ్రం’. ఈ చిత్రం డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్ లో రూపొందగా.. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా టీజర్ ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రం లాంచ్ వేడుకకు అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ వేడుకలో అల్లరి నరేష్ తన తదుపరి సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
నాగార్జున సినిమాలో అల్లరి నరేష్ కీలకపాత్రలో నటించనున్నట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రచారం పై స్పందించారు. అక్కినేని నాగార్జున ఇటీవలే ది ‘ఘోస్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నాగ్.. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ కాబోతుంది. ప్రస్తుతం ప్రసన్న కుమార్ స్ట్కిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలకపాత్రలో నటించున్నారు అని తెలియగానే అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమాలో ఒక పాత్ర కోసం మేకర్స్ తనను సంప్రదించారని, కానీ ఇంక సినిమాకు సంతకం చేయలేదని తెలిపారు నరేష్. స్ట్ర్కిప్ట్ విన్నానని.. కథ నచ్చడంతో చర్చలు జరుపుతున్నానని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ పై సంతకం చేస్తే అధికారికి ప్రకటన వస్తుందని తెలియజేశారు నరేష్. అల్లరి నరేష్ గతంలోనూ కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశాడు. శర్వానంద్ నటించిన ‘గమ్యం’ సినిమాలో అతను చేసిన గాలి శీను పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. అలానే రవితేజ లీడ్ రోల్ పోషించిన ‘శంభో శివ శంభో’లో కూడా అల్లరి నరేష్ ఓ అమాయకపు క్యారెక్టర్ చేశాడు. ఇక 2019లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీలో అల్లరి నరేష్‌కి మంచి పాత్ర దక్కింది. ఈ మూవీలో కామెడీతో పాటు నరేష్ సెంటిమెంట్‌ని కూడా పండించాడు. ఇప్పుడు నాగార్జున తో స్క్రీన్ పంచుకోనున్నారు.