అలాంటి పాత్ర కూడా చేస్తా, ఈ సినిమాకు రిఫర్ చేసింది ఆయనే: అనసూయ భరద్వాజ్
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కిన 'పెదాకాపు' సెప్టెంబర్ 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమాలో నటించిన అనసూయ భరద్వాజ్ విలేకరుల సమావేశంలో పలు విశేషాలు పంచుకుంది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా వెండితెరకు పరిచయం అవుతూ తెరకెక్కిన తాజా చిత్రం 'పెదకాపు1'. 'అఖండ' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మిర్యాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నుంచి ఇప్పటికే ట్రైలర్ విడుదలై సినిమాపై అంచనాలను పెంచింది. సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అనసూయ భరద్వాజ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
ముందుగా పెదకాపులో మీ పాత్ర ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు బదులిస్తూ.. "సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాను. సినిమా చూసిన తర్వాత నా పాత్ర ఇంకా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది. ఇందులో నా పేరు కూడా కొత్తగా అనిపించింది. సినిమా రిలీజ్ తర్వాత అందరూ ఆ పేరుతోనే పిలుస్తారని నమ్మకముంది. సినిమాలో నా పాత్ర చాలా బలంగా వైవిధ్యంగా ఉంటుంది. ‘పెదాకాపు’ చాలా రా ఫిలిం. నా పాత్రలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి" అని తెలిపింది. ‘‘DOP చోటా కె నాయుడు ఈ సినిమాలో మిమ్మల్ని రిఫర్ చేశారని న్యూస్ వచ్చింది. నిజమేనా?’’ అని అడిగితే.. "అవును, సందీప్ కిషన్ 'మైఖేల్' సినిమాలో చేశాను. ఆ సినిమా చూసి చోట ఫోన్ చేశారు. ‘‘నీకు ఒక ఫోన్ వస్తుంది. ఆ పాత్ర చేయమని చెప్పను? కానీ కన్సిడర్ చెయ్ అని చెప్పారు. శ్రీకాంత్ ఈ కథ చెప్పిన తర్వాత తప్పకుండా ఇలాంటి మంచి సినిమాలో భాగం కావాలని అనుకున్నాను" అని అన్నారు.
ఆ తర్వాత సినిమాలో డైరెక్టర్ శ్రీకాంత్ నటించడం పై మాట్లాడుతూ.. "నిజంగా ఇది బిగ్ సర్ప్రైజ్. కథ విన్నప్పుడు శ్రీకాంత్ నటిస్తున్నారని నాకు తెలియదు. సాధారణంగా ప్రతి డైరెక్టర్ లో ఒక నటుడు ఉంటాడు. ఇలా చేయాలని మొదట చేసి చూపించేది వాళ్లే కదా. సినిమాలో శ్రీకాంత్ చాలా ఈజ్ తో ఆ పాత్ర చేశారు. ప్రేక్షకులు చాలా సర్ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో పాత్రని చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రతి పాత్రకు ఒక మేకోవర్ ఉంది. ఈ సినిమా చాలా మంచి అనుభవం అని" తెలిపింది. హీరో విరాట్ కర్ణతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అని అడిగితే.." విరాట్ కర్ణ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. షూటింగ్లో చాలా దెబ్బలు కూడా తగిలాయి. అతనిది మంచి మనస్తత్వం. ట్రైలర్ చూసిన చాలా మంది తనని ప్రభాస్ తో పోల్చారు. విరాట్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటాడని నమ్మకం ఉంది" అని పేర్కొన్నారు.
"నాకు ఇష్టమైన నిర్మాణ సంస్థలలో ద్వారక క్రియేషన్స్ ఒకటి. మిర్యాల రవీందర్ రెడ్డి ఎక్కడ రాజీపడకుండా మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ సినిమాని భారీగా నిర్మించారు. ఇందులో నేను చేసిన పాత్ర కోసం మిగతా భాషల నుంచి కూడా కొందరిని అనుకున్నారు. అలాంటి బలమైన పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాననే తృప్తి నాకుంది" అని అన్నారు. ఫ్యూచర్ లో ఎలాంటి పాత్రలు చేయాలని భావిస్తున్నారు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. "అన్ని రకాల పాత్రలు చేస్తాను. అమ్మమ్మ పాత్ర కూడా చేస్తాను. అయితే ఆ పాత్ర చూసిన తర్వాత అమ్మమ్మ గురించి మాట్లాడుకునేలా ఉండాలి. అలా ఉంటే కచ్చితంగా చేస్తానని" చెప్పుకొచ్చారు అనసూయ భరద్వాజ్.
Also Read :'పాపం పసివాడు' వెబ్ సీరిస్ సాంగ్ రిలీజ్ - ఆహాలో స్ట్రీమింగ్, ఎప్పుడంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial