Pushpa 2 Song: ‘పుష్ప 2‘ సాంగ్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్, స్పందించిన అల్లు అర్జున్ - నెటిజన్లకు ఫుల్ ఫన్
‘పుష్ప 2‘ నుంచి సాలిడ్ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన లిరికల్ సాంగ్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బన్నీ అదిరిపోయే స్టెప్పులతో అలరించాడు. ఈ సాంగ్ పై డేవిడ్ వార్నర్ తనదైన స్టైల్లో స్పందించారు.

Pushpa 2 Song: దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘పుష్ప 2‘ సినిమా నుంచి లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్..’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంటోంది. ఫుల్ గ్రేస్ తో బన్నీ వేసిన స్టెప్పులు మాస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ పాటలోని చిన్న క్లిప్ ను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘పుష్ప పుష్ప సాంగ్ లో ఈ షూ డ్రాప్ స్టెప్ చేయడం చాలా ఆనందంగా ఉంది” అని రాసుకొచ్చారు. అంతేకాదు, #Pushpa2TheRule, #Pushpa2FirstSingle అనే హ్యాష్ ట్యాగ్స్ పెట్టాడు.
అల్లు అర్జున్ వీడియోపై స్పందించిన డేవిడ్ వార్నర్
ఈ వీడియో క్లిప్ పై పలువురు సినీ అభిమానులు స్పందించారు. పాట బాగుంది. డ్యాన్స్ ఇంకా బాగుంది అంటూ కామెంట్స్ పెట్టారు. ఇక ఈ పోస్టుకు ఆస్ట్రేలియన్ క్రికెటర్, అల్లు అర్జున్ ఫ్యాన్ బాయ్ డేవిడ్ వార్నర్ స్పందించారు. "ఓ డియర్, ఇది ఎంతో బాగుంది. ఇప్పుడు నాకు మీతో కాస్త పని ఉంది" అంటూ రాసుకొచ్చాడు. వార్నర్ కామెంట్ కు అల్లు అర్జున్ స్పందించాడు. "ఈ స్టెప్ చాలా ఈజీ. మనం కలిసినప్పుడు నేను మీకు నేర్పిస్తాను" అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ సినిమాలపై స్పెషల్ ఫోకస్
నిజానికి అల్లు అర్జున్ సినిమాలపై డేవిడ్ వార్నర్ కు స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఆయన పాటలకు డ్యాన్సులు వేయడం, అదిరిపోయే డైలాగులు చెప్పడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ‘పుష్ప‘ సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్ డైలాగులకు లిప్ సింగ్ చేస్తూ రూపొందించిన వీడియోలు నెటిజన్లను బాగా అలరించాయి. తనొక్కడే కాదు, ఆయన పిల్లలతో కలిసి వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్’ అనే డైలాగ్ తో పాటు ‘తగ్గేదే లే‘ అనే డైలాగ్ చెప్పి వారెవ్వా అనిపించారు. ‘పుష్ప‘ సినిమాలోని ‘శ్రీవల్లి‘ పాటకు ఎన్నో సందర్భాల్లో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు వార్నర్. సోషల్ మీడియాలో రీల్స్ పెట్టడంతో పాటు ఏకంగా ఉప్పల్ స్టేడియంలోని పిచ్ మీదే డ్యాన్స్ చేశాడు. ఆయన స్టెప్పులు చూసి క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేశారు. అభిమానులు కేకలు చూసి వార్నర్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక ‘పుష్ప 2‘ పాటకు సైతం త్వరలోనే వార్నర్ స్టెప్పులు వేసి అలరించే అవకాశం ఉంది.
View this post on Instagram
ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ‘పుష్ప’
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప‘ సినిమా 2021లో విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ కథాంశంతో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫహద్ ఫాసిల్, ధనుంజయ, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇక ‘పుష్ప 2‘ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Read Also: బాబీ డియోల్... బాలీవుడ్‌లో పవన్ సినిమాకు ప్లస్సే - 'యానిమల్'కు మించి ఉంటుందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

