Allu Arjun: అల్లు అర్జున్ మీద పోలీస్ కంప్లైంట్... ఫ్యాన్స్‌ను ఆర్మీ అంటే ఎలా?
Pushpa 2: 'పుష్ప 2' ప్రచార కార్యక్రమాలలో తన అభిమానులను ఆర్మీ అని అల్లు అర్జున్ పదేపదే పేర్కొనడం పట్ల కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మీద ట్విన్ సిటీలలో ఒకటైన సికింద్రాబాద్ ఏరియాలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులకు కొంత మంది ఫిర్యాదు చేశారు. హీరో మీద కంప్లైంట్ ఇవ్వవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ ఫిర్యాదులో వాళ్ళు ఏమని పేర్కొన్నారు? అంటే వివరాల్లోకి వెళితే...
ఆర్మీ అంటే ఎలా? ఆ మాట వాడొద్దు!
డిసెంబర్ 5వ తారీఖున 'పుష్ప 2' విడుదల నేపథ్యంలో దేశంలోని వివిధ నగరాలు తిరుగుతూ సినిమాకు ప్రచారం చేస్తున్నారు అల్లు అర్జున్. తాను వెళ్ళిన ప్రతి చోట తన అభిమానుల గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. అభిమానులను అల్లు ఆర్మీ అని పేర్కొంటున్నారు. ఆ విధంగా పిలవడం పట్ల కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడి సేవ చేసే వారిని మనం ఆర్మీ అంటామని, అటువంటి ఆర్మీ అనే పదానికి గౌరవం లేకుండా అల్లు అర్జున్ ప్రవర్తిస్తున్నారని, ఆయన ఎటువంటి నియమ నిబంధనలు పాటించడం లేదని, అందువలన ఆయనపై చర్యలు తీసుకోవాలని గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోనికి వచ్చే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సీఐను కలసి కంప్లైంట్ చేశారు.
Also Read: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?
అల్లు అర్జున్ వేదికల మీద తనకు ఆర్మీ ఉందని చెబుతున్నారని, తన అభిమానులను ఆయన ఆర్మీగా పేర్కొంటున్నారని, ఇది దేశ ఆర్మీ యొక్క జాతీయ సమగ్రత - జాతీయ భద్రతను అవమానించడం అని గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ సంస్థ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభిమానులను ఆర్మీ అనడం సరి కాదని చెబుతున్నారు. కావాలంటే అభిమానులను డై హార్ట్ ఫ్యాన్స్ అని లేదా మరొకటి అని పేర్కొనాలని సలహా ఇస్తున్నారు. మరి దీనిపై అల్లు అర్జున్ టీం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Also Read: దేవకీ నందన వాసుదేవ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడు అశోక్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలు ఏంటి?
అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అని పేర్కొనడం పట్ల బయట వ్యక్తులు కాదు... సినిమా ఇండస్ట్రీలో ఇతర హీరోల అభిమానులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా మెగా అభిమానులలో కొందరు ఆయన తీరును తప్పుపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అండతో హీరోగా ఎదిగిన అల్లు అర్జున్, పలు సందర్భాలలో మెగా ఫ్యాన్స్ లేకపోతే తాను లేను అన్నట్లు చెప్పారని ఇప్పుడు హీరోగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత తన అభిమానుల వల్ల తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసిన మెగా ఫాన్స్ ఉన్నారు. మరి సినిమాకు మెగా అభిమానుల నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తుందో చూడాలి.