Adipurush Movie : ఎట్టకేలకు సారీ చెప్పిన 'ఆదిపురుష్' రైటర్ - సెటైర్లు వేస్తున్న నెటిజనులు
Adipurush Writer Manoj Muntashir : 'ఆదిపురుష్' విడుదల తర్వాత సినిమాపై, ఆ సినిమాలో డైలాగులపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర రచయిత మనోజ్ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు.
'ఆదిపురుష్' విడుదలైన తర్వాత... పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వీరాభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి ఆట నుంచి సినిమాపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సినిమాలో డైలాగుల పట్ల సాధారణ ప్రేక్షకులు, ముఖ్యంగా భక్తులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు గాయపరిచేలా సినిమా తెరకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత తమ చర్యలను సమర్ధించుకున్న 'ఆదిపురుష్' చిత్ర రచయిత మనోజ్ ముంతాషిర్, ఎట్టకేలకు క్షమాపణలు కోరారు.
చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నా!
''ఆదిపురుష్' సినిమా ప్రజల మనోభావాలను దెబ్బ తీసిందని అంగీకరిస్తున్నాను. మా వల్ల ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి మరీ బేషరతుగా క్షమాపణలు కోరుతున్నాను. ఆ హనుమంతుడు (భగవంతుడు బజరంగబలి) మన అందరినీ ఐక్యంగా ఉంచి... మన దేశానికి, సనాతన ధర్మానికి సేవ చేసే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను'' అని మనోజ్ ముంతాషిర్ ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు.
మనోజ్ ముంతాషిర్ క్షమాపణలు చెప్పినా సరే... ప్రేక్షక లోకం, ముఖ్యంగా భక్త జనం సంతృప్తి చెందలేదు. క్షమాపణలు చెప్పడానికి చాలా ఆలస్యమైందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరొక నెటిజన్ అయితే చాలా త్వరగా క్షమాణాలు చెప్పారంటూ సెటైర్లు వేశారు. మనోజ్ వ్యవహారశైలి, విడుదల తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల చాలా మంది విమర్శలు చేశారు.
मैं स्वीकार करता हूँ कि फ़िल्म आदिपुरुष से जन भावनायें आहत हुईं हैं.
— Manoj Muntashir Shukla (@manojmuntashir) July 8, 2023
अपने सभी भाइयों-बहनों, बड़ों, पूज्य साधु-संतों और श्री राम के भक्तों से, मैं हाथ जोड़ कर, बिना शर्त क्षमा माँगता हूँ.
भगवान बजरंग बली हम सब पर कृपा करें, हमें एक और अटूट रहकर अपने पवित्र सनातन और महान देश की…
ఆ డైలాగులు తొలగించారు!
'ఆదిపురుష్'లో సంభాషణలు పలు విమర్శలకు కారణం అయ్యాయి. 'కాలేది నీ బాబుదే' అంటూ హనుమంతుని పాత్రకు డైలాగులు రాయడం ఏమిటి? అని కొందరు ప్రశ్నించారు. డైలాగుల్లో ఉపయోగించిన భాషపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ప్రేక్షకుల మనోభావాలను గౌరవించి ఆ డైలాగులు తొలగిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
Also Read : మనల్ని ఆపే మగాడు ఎవడు 'బ్రో' - పవన్ సినిమాలో ఫస్ట్ పాట
ఇటీవల 'ఆదిపురుష్' చిత్ర బృందానికి అలహాబాద్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ నెల 27న దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్, రైటర్ మనోజ్ ముంతాషిర్ (Manoj Muntashir)లను కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ సినిమా ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందో? లేదో? చెప్పాలని ఐదుగురు సభ్యులతో కూడిన `బృందాన్ని నియమించింది. ఆ బృందం నుంచి సమీక్ష కోరింది.
రావణుడి విషయంలో తీవ్ర విమర్శలు!
'ఆదిపురుష్'లో లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆయనది రావణ బ్రహ్మ పాత్ర. ఆయన లుక్ విషయంలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే, మాంసం ముట్టినట్టు, తన పెంపుడు జంతువుకు తినిపిస్తున్నట్టు వచ్చిన సన్నివేశాలపై హిందువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలను కించపరిచారని చెబుతున్నారు.
Also Read : తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టే కొడుకు వైఎస్ జగన్ - అదే 'యాత్ర 2'
'ఆదిపురుష్' చిత్రీకరణ ప్రారంభించిన తర్వాత 'రాధే శ్యామ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా విడుదల సమయంలో శ్రీరాముడి పాత్ర గురించి అడగ్గా... ''నాలుగు రోజులు షూటింగ్ చేసిన తర్వాత ఓం రౌత్ (Om Raut)ని పిలిచి 'నేను చేయొచ్చా?' అని అడిగా. వేరే సినిమాల విషయంలో తప్పులు చేసినా పర్వాలేదు. కానీ, రాఘవ్ (ఆదిపురుష్) విషయంలో తప్పులు చేయకూడదు. 'డోంట్ వర్రీ. నేను ఉన్నాను. మనం చేస్తున్నాం' అని చెప్పాడు'' అని ప్రభాస్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో ముందు చెప్పినా దర్శకుడు పట్టించుకోలేదని, ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించారని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.