VK Naresh & Vasuki On Beauty: ప్రేక్షకులకు సీనియర్ నరేష్ ఛాలెంజ్... 'బ్యూటీ' ఆర్గానిక్‌గా లేదనిపిస్తే లక్ష ఇస్తా!
Beauty Telugu Movie Release Date: అంకిత్ కొయ్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'బ్యూటీ'. ఇందులో హీరోయిన్ నీలఖి తల్లిదండ్రులుగా సీనియర్ నరేష్, వాసుకి నటించారు. సినిమా గురించి వాళ్ళు చెప్పిన విశేషాలు...

''నాకు కూతురు లేదనే లోటు ఎప్పుడూ ఉండేది. ఆ లోటు తీరిందని చెప్పను కానీ కూతురు ఉంటే ఇంత బాధపడేవాడినా? అని 'బ్యూటీ' చేశాక అనుకున్నా. ఈతరం పిల్లలు ప్రేమ పేరుతో ఏదేదో చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పలు సినిమాల్లో తల్లీ కొడుకుల బంధం చూపించారు. ఇందులో తండ్రీ కుమార్తె మధ్య బంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు'' అని సీనియర్ నరేష్ తెలిపారు. 'బ్యూటీ' చూశాక ప్రతి అమ్మాయికి తండ్రి గుర్తుకు వచ్చి కంట్లో నీళ్లు వస్తాయని ఆయన తెలిపారు. తండ్రి ఇంటికి కాంపౌండ్ వాల్ లాంటి వాడని ఆయన పేర్కొన్నారు.
'ఆయ్', 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' ఫేమ్ అంకిత్ కొయ్య హీరోగా నటించిన తాజా సినిమా 'బ్యూటీ'. ఇందులో నీలఖి హీరోయిన్. ఆమె తల్లిదండ్రులుగా సీనియర్ నరేష్, వాసుకి నటించారు. విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 19న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా నరేష్, వాసుకి సినిమా విశేషాలు పంచుకున్నారు.
సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ మాట్లాడుతూ...''ప్రేక్షకులు ఆర్గానిక్ మూవీస్ కోరుకుంటున్నారు. ఈ మధ్య 'బ్యూటీ' గురించి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 'ఈ సినిమా ఆర్గానిక్‌గా లేదని అనిపిస్తే లక్ష రూపాయలు ఇస్తాను' అని ఛాలెంజ్ చేశా. 'బ్యూటీ' ఇంటర్వెల్ అయ్యేసరికి ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోతారు. ఇక సెకండాఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీ రిలీజ్ వేడుకలో అంత ధైర్యంగా ఎందుకు మాట్లాడావని మారుతిని అడిగా. అప్పుడు ఆయన 'సోల్ ఆఫ్ సినిమా' అన్నారు. ఇప్పుడు మంచి సినిమా, చెడ్డ సినిమా అని కాకుండా తాము పెట్టే డబ్బులకు సంతృప్తి చెందుతున్నామా? లేదా? అనేది ప్రేక్షకులు చూస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులు అందరూ కలిసి చూసే చిత్రమిది'' అని చెప్పారు.
ప్రేమ, పెళ్లి, తల్లిదండ్రులతో పిల్లల అనుబంధం నేపథ్యంలో 'బ్యూటీ' సినిమా తెరకెక్కిందని నరేష్ తెలిపారు. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ... ''ఇప్పుడు పెళ్లి గురించి ఎవరూ ఆలోచించలేదు. పెళ్లి అనేది ఒక బాధ్యత. సహ జీవనంలో ఉంటున్నారు. ఎంజాయ్ చేసి విడిపోతున్నారు. ఈతరం యువతకు మనం ఏమీ చెప్పలేం. స్నేహితులుగా ఉండటం తప్ప. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. ఈ సినిమాలో నటీనటులు అందరూ బాగా చేశారు'' అని చెప్పారు.
'బ్యూటీ' గురించి నటి వాసుకి మాట్లాడుతూ... ''నాకు ఓ కూతురు ఉంది. ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి అమ్మాయి చేసేది మా అమ్మాయి కూడా చేస్తుంది. అందుకే ఈ కథ విన్నప్పుడు ఒక తల్లిగా కనెక్ట్ అయ్యాను. ఈ కథలో తల్లీ కుమార్తెలకు ఉండాల్సిన అవగాహన, బాధ్యతలు చూపించారు. తల్లిదండ్రులుగా మాకు ఎలా ఉందనేది పక్కన పెడితే... పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటో తెలుసుకోవాలని మా అమ్మాయికి సినిమా చూపించా. తనకు నచ్చిందని జెన్యూన్ రివ్యూ ఇచ్చింది. మా అమ్మాయి కూడా బాగా కనెక్ట్ అయింది. తనకు తెలిసింది, తెలియనిది ఈ సినిమాలో ఉందని, తాను జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. దర్శకుడికి ఫోన్ చేసి థాంక్స్ కూడా చెప్పింది... ఇటువంటి మంచి సినిమా తీసినందుకు! ఈతరం పిల్లలను తిట్టి పెంచలేమని, స్నేహుతులుగా పెంచాలని అర్థమైంది. నరేష్ గారి నటన చూస్తే మా నాన్న గారు గుర్తొచ్చారు. మంచి సినిమా ఇది. అందరికీ నచ్చుతుంది'' అని చెప్పారు.
Also Read: రెమ్యూనరేషన్ పెంచిన తేజా సజ్జా... జాంబీ రెడ్డి 2 చేతులు మారడం వెనుక కారణం అదేనా?





















