Sai Durga Tej: నన్ను హీరోగా మలిచింది ఆయనే... పవర్ స్టార్‌పై సాయి దుర్గ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ గురించి హీరో సాయి దుర్గ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏండ్లు అయిన సందర్భంగా పవర్ స్టార్ ను కలిసిన సాయి, ఆయన తనను ఎలా తీర్చిదిద్దారో చెప్పుకొచ్చారు.
Sai Durga Tej About Pawan Kalyan: సుప్రీం స్టార్ సాయి దుర్గ తేజ్ తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన మేన మామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మామ ఆశీస్సులు పొంది సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం జనసేన యూట్యూబ్ చానెల్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ తో పాటు ముగ్గురు మామల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నన్ను తీర్చి దిద్దింది పవన్ కల్యాణ్
చిన్నప్పటి నుంచి తాను పవర్ స్టార్ గైడెన్స్ లోనే పెరిగినట్లు సాయి దుర్గ తేజ్ వెల్లడించారు. “నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా పవన్ కల్యాణ్ దగ్గరే పెరిగాను. మా అమ్మ ఎక్కడికి వెళ్లినా నన్ను కల్యాణ్ మావయ్య దగ్గరే ఉంచి వెళ్లేది. చిన్నప్పటి నుంచి ఆయనే నన్ను తీర్చి దిద్దారు. ఓటమి పాలైనంత మాత్రాన దిగులు పడాల్సిన అవసరం లేదన్నారు. లోపం లేకుండా ప్రయత్నం చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తామని ప్రోత్సహించారు. ఆయన చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంది. కల్యాణ్ గారు నాకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చారు. యాక్టింగ్ ఎవరి దగ్గర తీసుకోవాలో సూచించారు. డ్యాన్స్ ఎలా నేర్చుకోవాలి? మార్షల్ ఆర్ట్స్ ఎలా నేర్చుకోవాలి? అనే విషయాలను చెప్పారు. ఆయనకు చిన్నప్పుడు గైడెన్స్ మిస్ అయ్యింది. నాకు మిస్ కాకుండా చూశారు. బ్రో సినిమా సమయంలో ఆయనతో ఏకంగా 25 రోజుల పాటు గడిపే అవకాశం దొరికింది. నేను కల్యాణ్ బాబుతో సినిమా చేశా అని గర్వంగా ఫీలవుతున్నాను. నాకు ఆ అదృష్టం కల్పించిన పవన్ మావయ్యకు కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చారు.
ఇష్టమైన శాఖలు, కచ్చితంగా మేలు కలుగుతుంది!
డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ తీసుకున్న శాఖలు ఆయనకు ఎంతో ఇష్టమైనవని చెప్పారు. వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారని చెప్పారు. ఆయన సినిమాల్లో చాలా వరకు పల్లెటూరి బ్యాగ్రౌండ్ తో తెరకెక్కినవేనని, ఆయన నిర్వర్తించే శాఖలు కూడా పల్లెటూరితో సంబంధం ఉన్నవే ఎక్కువ అన్నారు.
ముగ్గురు మామల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ముగ్గురు మావయ్యల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని సాయి తేజ్ చెప్పుకొచ్చారు. “పెద్ద మావయ్య నుంచి ఏదైనా అనుకుంటే ఎలా నెరవేర్చుకోవాలో నేర్చుకున్నాను. కల్యాణ్ బాబు దగ్గర కమిట్మెంట్ గురించి తెలుసుకున్నాను. ఏ పని చేసినా కమిట్మెంట్ అనేది ఉండాలని నేర్చుకున్నాను. నాగబాబు గారి నుంచి నవ్వుతూ ఎలా ఉండాలో నేర్చుకున్నాను. ఏ సమస్య వచ్చినా నవ్వుతూ ఎదుర్కోవాలనేది అయన నుంచి తెలుసుకున్నాను” అని చెప్పారు.
చైల్డ్ అబ్యూజ్ చేసే వారిని కఠినంగా శిక్షించాలి!
“సోషల్ మీడియాలో చిన్న పిల్లల మీద జోకులు వేయడం దారుణం. అమ్మాయిలు ఉన్న వాళ్లకు ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. చైల్డ్ అబ్యూజ్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసే వాళ్లను చూసి చూడనట్లు వదిలేయకూడదు” అన్నారు సాయి తేజ్. ప్రస్తుతం తాను ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. తెలుగు ప్రజలు గర్వంగా ఫీలయ్యే సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. బైకులు నడిపే వాళ్లు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. కార్లు నడిపే వాళ్లు సీటు బెల్టు పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేశారు.
Read Also: ‘అన్‌స్టాపబుల్’లో అల్లు అర్జున్ పిల్లలు.. తెలుగు పద్యం చెప్పిన అర్హ - తగ్గేదేలేదన్న అయాన్!