Chandra Haas: పెద్ద మనసు చాటుకున్న నటుడు ప్రభాకర్, యంగ్ హీరో చంద్రహాస్- వరద బాధితులకు నిత్యావసర సరకులు
Actor Chandrahaas | నటుడు పభాకర్, ఆయన కొడుకు, యంగ్ హీరో చంద్రహాస్ తాజాగా ఖమ్మం వరద బాధితులకు తమవంతు సాయం అందించారు. నిత్యవరసర సరకులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళాన్ని కూడా ఇచ్చారు.
వరద బాధితులకు అండగా ప్రభాకర్, చంద్రహాస్
బుల్లితెర నటుడు, నిర్మాత, సీనియర్ యాక్టర్ అయిన ప్రభాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతంలో సీరియల్స్ తో పాటు సినిమాలలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరవయ్యారు. త్వరలోనే తన కొడుకు చంద్రహాస్ ని హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఇక తాజాగా ఈ తండ్రి కొడుకులు కలిసి ఖమ్మంలో వరద బాధితులకు తమ వంతు సాయం అందించారు. 100 కుటుంబాలకు బియ్యం, నూనె, కందిపప్పు, దుప్పట్లు వంటి నిత్యావసర సామాగ్రిని అందించడంతో పాటు అక్కడి పరిస్థితిని సమీక్షించారు. అలాగే బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 వేల చొప్పున విరాళంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ మాట్లాడుతూ "నాకున్న దాంట్లో 100 కుటుంబాలకు సాయం చేయగలిగాను. నాకైతే లక్ష కుటుంబాలకు కూడా ఇవ్వాలని ఉంది. కానీ ఇప్పటికైతే ఇంతే చేయగలుగుతున్నాను. ఫ్యూచర్లో దేవుడు నాకా శక్తినిస్తే ఇంతకంటే ఎక్కువే చేస్తాను" అని చెప్పారు. ఇక ప్రభాకర్ మాట్లాడుతూ "స్వయంగా వచ్చి వాళ్ళను పరామర్శించి, ధైర్యం చెప్పి మా వంతు సహాయం అందించడం సంతోషంగా ఉంది. మా సొంత ఊర్లో ఇలాంటిది జరగడం దారుణం. ఎంతోమంది సాయం చేస్తున్నారు. ఇప్పుడు మేము చేసిన సాయం తక్కువే అనిపిస్తుంది. అది వాళ్లకు కేవలం 10 రోజులే వస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తే బాగుంటుంది" అని కోరారు. జనాలకు డైరెక్ట్ గా సాయం అందడంతో పాటు సాటిస్ఫ్యాక్షన్ కూడా ఉంటుందనే ఉద్దేశంతో స్వయంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభాకర్.
అక్టోబర్ లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న చంద్రహాస్
కాగా చంద్రహాస్ హీరోగా "రామ్ నగర్" బన్నీ అనే సినిమాను తీశారు. అయితే మొదటి మూవీ రిలీజ్ కాకముందే చంద్రహాస్ తీవ్రమైన నెగెటివిటీని, ట్రోలింగ్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకా ఇండస్ట్రీలోకి కాలు పెట్టకముందే ఆటిట్యూడ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న చంద్రహాస్ హీరోగా నటిస్తున్న మూవీ ఈ "రామ్ నగర్ బన్నీ". శ్రీనివాస్ మహత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 4న రిలీజ్ కాబోతోంది. అందుకే వరద బాధితులకు సాయం అంటూ తండ్రీకొడుకులు డ్యామేజ్ కంట్రోల్ పనులు మొదలు పెట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. కానీ కొంతమంది మాత్రం ప్రభాకర్, చంద్రహాస్ లను మెచ్చుకుంటున్నారు.