Oscar Committee : ఆస్కార్ కమిటీలో ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి - మళ్ళీ కాలర్ ఎగరేసేలా చేసిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్ర బృందానికి మరో అరుదైన గౌరవం దక్కింది. హీరోలతో పాటు సంగీత దర్శకుడు, ప్రొడక్షన్ డిజైనర్, ఛాయాగ్రాహకుడికి ఆస్కార్ కమిటీలో చోటు దక్కింది.
ప్రతిష్టాత్మక ఆస్కార్ (Oscar) అవార్డులు ప్రదానం చేసే 'ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' (The Academy Of Motion Picture Arts And Sciences) 398 మందికి కొత్తగా ఆస్కార్ కమిటీలో సభ్యత్వం కల్పించింది. భారతీయ సినిమా ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలకు గర్వకారణమైన అంశం ఏమిటి? అంటే... అందులో 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం నుంచి ఆరుగురు ఉన్నారు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా...
కీరవాణి, సెంథిల్, బోస్, సిరిల్!
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలోని 'నాటు నాటు...' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకుని చరిత్ర సృష్టించిన సంగతి మనకు తెలుసు. ఆ పాటలో స్టెప్పులు వేసిన, ప్రేక్షకులను అలరించిన హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)తో పాటు సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు కె. సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్... ఈ ఆరుగురికి ఆస్కార్ కమిటీలో చోటు కల్పించింది.
సంగీతం విభాగంలో కీరవాణి, చంద్రబోస్... ఛాయాగ్రాహకుల విభాగంలో సెంథిల్... ప్రొడక్షన్ డిజైనర్ సెక్షన్లో సిరిల్... యాక్టర్స్ విభాగంలో చరణ్, ఎన్టీఆర్ ఉన్నారు. ఆస్కార్ అందుకున్న తొలి తెలుగు పాటగా, ఆ మాటకు వస్తే భారతీయ సినిమా పాటగా 'నాటు నాటు' నిలిచింది. దాంతో అభిమానులు, భారతీయ ప్రేక్షకులు కాలర్ ఎగరేశారు. ఇప్పుడు ఆస్కార్ కమిటీలో 'ఆర్ఆర్ఆర్' బృందానికి చోటు దక్కడంతో మరోసారి కాలర్ ఎగరేస్తున్నారు.
ఆస్కార్ కమిటీలో మణిరత్నం కూడా!
శ్రీలంక సివిల్ వార్ నేపథ్యంలో తెరకెక్కించిన 'కణ్ణాతిల్ ముత్తమిట్టాల్' (తెలుగులో 'అమృత'గా విడుదలైంది), తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎంజీ రామచంద్రన్, ఎం కరుణానిధి, జయలలిత జీవితాల స్ఫూర్తితో తెరకెక్కించిన 'ఇరువర్' (తెలుగులో 'ఇద్దరు'గా విడుదలైంది) సినిమాలకు గాను ప్రముఖ దర్శకుడు మణిరత్నానికి (Mani Ratnam) కూడా ఆస్కార్ కమిటీ ఆహ్వానం పలికింది. ఆస్కార్ అవార్డులకు ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో నామినేట్ అయిన 'ఆల్ దట్ బ్రీత్స్' దర్శకుడు షౌనక్ సేన్ సైతం ఆహ్వానం అందుకున్నారు.
రాజమౌళికి కూడా చోటు లభించి ఉంటే?
'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం నుంచి ఆరుగురికి ఆస్కార్ కమిటీ నుంచి ఆహ్వానాలు రావడంతో తెలుగు ప్రేక్షకులు, సినిమా ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే... ఒక్క విషయంలో మాత్రం చిన్న అసంతృప్తి ఉంది. 'ఆర్ఆర్ఆర్'కు కర్త, కర్మ, క్రియ... ఆ సినిమా కెప్టెన్, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళికి కూడా ఆస్కార్ కమిటీ నుంచి ఆహ్వానం అందితే బావుండేదని అభిప్రాయ పడుతున్నారు. రాజమౌళికి ఆహ్వానం రాకపోయినా సరే... ఆరుగురికి రావడం వెనుక ఆయన కృషిని మరువకూడదని చెబుతున్నారు.
Also Read : 'సామజవరగమన' రివ్యూ : కామెడీతో కొట్టిన శ్రీ విష్ణు... సినిమా ఎలా ఉందంటే?
ఆస్కార్ కమిటీ @ 10000 ప్లస్!
ప్రస్తుతం ఆస్కార్ కమిటీలో పది వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. కొత్తగా ఆహ్వానాలు అందుకున్న వారందరూ చేరితే ఆ సంఖ్య 10,817కి చేరుతుంది. అందులో ఓటింగ్ వేసే హక్కు 9,375 మందికి మాత్రమే ఉంటుంది. వచ్చే ఏడాది 96వ ఆస్కార్ అవార్డు వేడుక మార్చి 10న నిర్వహించనున్నారు.
Also Read : ట్విట్టర్ అంకుల్స్‌కు ఇచ్చిపడేసిన తమన్నా - పెళ్ళికి ముందు శృంగారంపై షాకింగ్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial