'ఇండియన్-2' అప్డేట్ ఇచ్చిన శంకర్.. మరి 'గేమ్ చేంజర్' సంగతేంటి?
కమల్ హాసన్ - డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఇండియన్-2'. ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ను తాజాగా మేకర్స్ అందించారు.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విజిలెంట్ యాక్షన్ మూవీ 'ఇండియన్-2'. ఇది 1996లో వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్. ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, బొమ్మరిల్లు సిద్ధార్థ్, బాబీ సింహా, సముద్రఖని, గుల్సాన్ గ్రోవర్, యోగ్ రాజ్ సింగ్, వెన్నెల కిషోర్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, ఇతర స్పెషల్ పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో కీలక అప్డేట్ ను మేకర్స్ అందించారు.
కమల్ హాసన్ 'ఇండియన్ 2' సినిమాకు సంబంధించిన డబ్బింగ్ సెషన్ ప్రారంభించినట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. డబ్బింగ్ జరుగుతోంది అంటూ ఈ సందర్భంగా ఓ వీడియోని షేర్ చేసారు. అందులో కమల్, శంకర్ లు కారు దిగి డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్లడం, ఇద్దరూ ముచ్చటించుకోవడం మనం చూడొచ్చు. దీన్ని బట్టి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నట్లు అర్థమవుతోంది. కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు.
A glimpse of dubbing 🎙️ session from INDIAN-2 🇮🇳 ft. Ulaganayagan @ikamalhaasan 🤗 & Director @shankarshanmugh 🎬
— Lyca Productions (@LycaProductions) October 9, 2023
Dubbing in Progress ███░░#Indian2 🇮🇳 @anirudhofficial @dop_ravivarman @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3 pic.twitter.com/kGlMKbWcC1
అప్పుడెప్పుడో మొదలైన 'ఇండియన్-2' సినిమా ఈపాటికే కంప్లీట్ అవ్వాల్సింది. వివిధ కారణాలతో షూటింగ్ ఆగిపోవడం.. దర్శక నిర్మాతల మధ్య వివాదాలు చెలరేగడం, కేసులు చుట్టుముట్టడంతో డిలే అవుతూ వచ్చింది. అయితే అన్నీ అడ్డంకులు తొలగిపోయి సమస్య ఓ కొలిక్కి రావడంతో ఈ చిత్రాన్ని తిరిగి సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఓవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారు. దీంతో కమల్ హాసన్ అభిమానులు హ్యాపీగా ఉన్నారు కానీ, మెగా ఫ్యాన్స్ మాత్రం సంతోషంగా లేరు.
'ఇండియన్ 2' లేట్ అవుతుండటంతో శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'గేమ్ చేంజర్' అనే పాన్ ఇండియా మూవీని పట్టాలెక్కించి సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ కమల్ హాసన్ సినిమాని ట్రాక్ ఎక్కించడంతో దర్శకుడు రెండు చిత్రాల పనులను ప్యారలల్ గా చేయాల్సి వచ్చింది. ఫలితంగా చెర్రీ చిత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. నిర్మాత దిల్ రాజు సైతం ఈ సినిమా గురించి ఏదైనా శంకర్ నే అడగాలని చెబుతున్నారు. దీనికి తోడు ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం, ఎప్పటికప్పుడు కంటెంట్ లీక్ అవుతుండటం మెగా అభిమానులను ఆందోళకు గురి చేస్తోంది.
'ఇండియన్ 2' చిత్రంలో సేనాపతి పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నారు. భారతీయ సైన్యంలో పనిచేసిన నిజాయితీపరుడైన సేనాపతి.. అవినీతి అధికారులకు, లంచాలు తీసుకునే బ్యూరోక్రాట్లకు ఎలా గుణపాఠం చెప్పాడనేది 'భారతీయుడు' సినిమాలో చూపించారు. ఈ భారతీయుడికి చావే లేదు అంటూ దాదాపు 26 ఏళ్ళ తర్వాత సేనాపతి మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తున్నాడు. మరి ఈసారి అవినీతి చేసేవారిని ఏరి పారెయ్యడానికి సేనాపతి ఏం చేస్తాడో చూడాలి.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ గైంట్ మూవీస్ బ్యానర్స్ పై సుభాస్కరన్ & ఉదయనిధి స్టాలిన్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ఇండియన్ 2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. రత్నవేలు - రవి వర్మన్ లు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
Also Read: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లో కింగ్ నాగ్ ధరించిన షర్ట్ రేట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial