7G Brindavan Colony: రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న క్లాసిక్ లవ్ స్టోరీ ‘7జీ బృందావన్ కాలనీ’ - ఎప్పుడంటే?
సీక్వెల్ రాబోతుంది అన్న విషయం ఫ్యాన్స్‌ను సంతోషపెట్టగా.. ఇప్పుడు ఏకంగా ‘7జీ బృందావన్ కాలనీ’నే రి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఒకప్పుడు మనకు నచ్చిన ఫేవరెట్ సినిమాలను మళ్లీ మళ్లీ చూడాలంటే టీవీలో వచ్చేవరకు ఎదురుచూడాల్సి ఉండేది. కానీ ఓటీటీ వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా మారిపోయాయి. కొత్త సినిమాలు సైతం మన ఇంట్లోకే వచ్చేస్తున్నాయి. అలాగే పాత సినిమాలను, మనకు నచ్చిన సినిమాలను కూడా మళ్లీ మళ్లీ చూసే అవకాశం వచ్చింది. కానీ ఎంతైనా ఒకప్పుడు చూసిన పాత సినిమాలను ఇప్పుడు థియేటర్లలో ఈలలు, గోలలు మధ్య చూస్తే ఆ కిక్కే వేరు. అందుకే టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ సాగుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలకు సంబంధించిన ఎన్నో సినిమాలు రి రిలీజ్ అయ్యి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాయి. ఇప్పుడు ఒక క్లాసిక్ లవ్ స్టోరీ కూడా రీ రిలీజ్‌కు సిద్ధమవుతుందని టాక్ బయటికొచ్చింది.
2004లో సెల్వరాఘవన్ తెరకెక్కించిన ‘7జీ బృందావన్ కాలనీ’ చిత్రం అప్పట్లో ఒక సెన్సేషన్‌నే సృష్టించింది, క్లాసిక్ లవ్ స్టోరీగా మిగిలిపోయింది. ఈ కాంప్లికేటెడ్ ప్రేమకథలో ప్రతీ ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉన్నాయి. అందుకే ప్రేక్షకుల దగ్గర నుంచి సినిమాకు అశేష ఆధరణ లభించింది. ‘7జీ బృందావన్ కాలనీ’లో హీరోగా నటించిన రవికృష్ణకు ఇది డెబ్యూ చిత్రం అయితే.. హీరోయిన్‌గా చేసిన సోనియా అగర్వాల్‌కు మాత్రం తన కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాగా మారిపోయింది. సెల్వరాఘవన్ టేకింగ్ అంటే ఎలా ఉంటుందో ఈ చిత్రంతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు ఈ టాలెంట్ ఉన్న దర్శకుడు. ఇప్పటికే ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది అన్న విషయం ఫ్యాన్స్‌ను సంతోషపెట్టగా.. ఇప్పుడు ఏకంగా ‘7జీ బృందావన్ కాలనీ’నే రి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
క్లాసిక్ లవ్ స్టోరీకి హంగులు..
‘7జీ బృందావన్ కాలనీ’ సీక్వెల్ కేవలం రూమర్స్ కాదని, నిజంగానే ప్లానింగ్ జరుగుతుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుండగా.. ఇప్పుడు ఏకంగా మరికొన్ని హంగులు అద్దుకొని రీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తమిళంలో కాకుండా కేవలం తెలుగులో మాత్రమే ఈ రీ రిలీజ్ సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. 4కే రీస్టోరేషన్, డాల్బీ ఆట్మోస్ పనులు ఇప్పటికే మొదలయిపోయాయని తెలుస్తోంది.
మ్యూజిక్కే ప్రాణం..
ఏదైనా చిత్రం క్లాసిక్‌గా మారాలంటే దాని మ్యూజిక్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే ‘7జీ బృందావన్ కాలనీ’కి కూడా సంగీతమే ప్రాణం. ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ‘7జీ బృందావన్’ కాలనీని మరో ఎత్తుకు తీసుకెళ్లింది. ఇప్పటికీ ఈ పాటలను, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను ఆరాధించేవారు, అభిమానించేవారు ఉన్నారు. ఇప్పటికే థియేటర్లలో విడుదలయిన ఎన్నో రీ రిలీజ్ సినిమాలు మొదటిసారి విడుదలైనప్పుడు కంటే ఎక్కువ కలెక్షన్లను కొల్లగొట్టాయి. ‘7జీ బృందావన్ కాలనీ’ కూడా కచ్చితంగా ఆ కేటగిరిలో చేరుతుందని మూవీ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే, ఈ మూవీకి త్వరలోనే సీక్వెల్ కూడా రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీని మరోసారి చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపే అవకాశం ఉంది.
Also Read: దీపికా పెద్ద సూపర్ స్టార్, ఆమె అంటే నాకు చాలా ఇష్టం: ప్రభాస్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial