Gautham Karthik Movie : ఏప్రిల్ 7న '1947 ఆగస్టు 16' - మురుగదాస్ నిర్మించిన సినిమా
1947 August 16 Movie : తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మించిన సినిమా '1947 ఆగస్టు 16'. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) తెలుగు ప్రేక్షకులకూ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన 'స్టాలిన్' సినిమాకు, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తెలుగు, తమిళ ద్విభాషా సినిమా 'స్పైడర్'కు ఆయన దర్శకత్వం వహించారు. అన్నట్టు... 'ఠాగూర్' సినిమా కథ కూడా ఆయనదే. తమిళంలో ఆయన తీసిన 'రమణ'కు అది తెలుగు రీమేక్.
AR Murugadoss Productions : ఏఆర్ మురుగదాస్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు... ఆయనలో ఓ నిర్మాత కూడా ఉన్నారు. ప్రతిభావంతులైన యువకుల దర్శకత్వంలో మాంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలతో చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన తాజా సినిమా '1947 ఆగస్టు 16'.
'1947 ఆగస్టు 16'లో గౌతమ్ కార్తీక్ కథానాయకుడు. ఈయన 'అభినందన' ఫేమ్, తమిళ హీరో కార్తీక్ కుమారుడు. గౌతమ్ కార్తీక్ (Gautham Karthik) తో గతంలో 'రంగూన్' అని ఏఆర్ మురుగదాస్ ఒక సినిమా నిర్మించారు. '1947 ఆగస్టు 16' రెండో సినిమా. వేసవి ప్రారంభంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు ఈ రోజు అనౌన్స్ చేశారు.
ఏప్రిల్ 7న '1947 ఆగస్టు 16'
1947 August 16 Movie Release Date : ఏప్రిల్ 7న '1947 ఆగస్టు 16' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు గౌతమ్ కార్తీక్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ''ధైర్యం, ప్రేమ, ఆశ నిండిన కాలానికి... వెనక్కి ప్రయాణించడానికి రెడీ అవ్వండి. ప్రపంచ వ్యాప్తంగా మా సినిమాను ఏప్రిల్ 7న విడుదల చేస్తాం'' అని ఆయన పోస్ట్ చేశారు.
Also Read : ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ను అవమానించిన బాలకృష్ణ?
View this post on Instagram
భారత దేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్య్రం వచ్చింది. ఆ మర్నాడు ఏం జరిగిందనే కథతో '1947 ఆగస్టు 16' తెరకెక్కించినట్టు ఉన్నారు. ఫస్ట్ లుక్ చూస్తే... స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన యువకుడిలా గౌతమ్ కార్తీక్ ఉన్నారు. పీరియడ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా గురించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఓం ప్రకాష్ భట్, నర్సిరామ్ చౌదరితో కలిసి ఏఆర్ మురుగదాస్ నిర్మించిన ఈ సినిమాకు ఎన్.ఎస్. పొన్ కుమార్ దర్శకుడు.
ఇప్పుడు ఖాళీగా మురుగదాస్!
'స్పైడర్' సినిమా ముందు వరకు తెలుగులో ఏఆర్ మురుగదాస్ అంటే ఒక క్రేజ్ ఉండేది. ఎప్పుడు అయితే మహేష్ బాబు సినిమా ఫ్లాప్ అయ్యిందో, ఆ తర్వాత తెలుగులో ఆయన క్రేజ్ తగ్గింది. అదే సమయంలో తమిళ స్టార్ విజయ్ హీరోగా తీసిన 'సర్కార్' తమిళనాడులో భారీ వసూళ్లు సాధించింది. తెలుగులో 'తుపాకీ' తరహాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ తీసిన 'దర్బార్' అయితే ప్రేక్షకులను మెప్పించడంలో వెనుక బడింది. ఆ మూడు సినిమాల తర్వాత ఆయన్ను ఇమేజ్ కొంచెం డ్యామేజ్ అయ్యింది.
Also Read : తారక రత్నను ఎవరూ అర్థం చేసుకోలేదు - అలేఖ్యా రెడ్డి టార్గెట్ ఎవరు? ఎందుకీ సెన్సేషనల్ కామెంట్స్?
దర్శకుడిగా ఏఆర్ మురుగదాస్ నుంచి సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. 'దర్బార్' తర్వాత తమిళంలో కూడా ఆయన సినిమా తీయలేదు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన 'రాంగి'కి కథ మాత్రమే అందించారు. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసిన ఆయన శివ కార్తికేయన్ హీరోగా సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్.