Chiranjeevi: టాలీవుడ్‌లో ‘మెగా’ సందడి.. వరుస చిత్రాలతో చిరు ప్రభంజనం.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
చిరంజీవి వరుసగా నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవన్నీ 2022లో ఒకదాని తర్వాత ఒకటి విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి మంచి ఊపు మీద ఉన్నారు. వరుస చిత్రాలతో తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా తర్వాత సుమారు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి.. ‘ఖైదీ నెంబరు 150’ చిత్రంతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చిరు మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన విరామం లేకుండా పనిచేస్తున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 66 ఏళ్ల వయస్సులోనూ చిరు.. ఏమాత్రం గ్రేస్ తగ్గకుండా కుర్ర హీరోలతో పోటీ పడటం గ్రేట్ అనే చెప్పుకోవాలి.
విడుదలకు సిద్ధమవుతున్నా ఆచార్య: చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇందులో చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ కూడా నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగానే ఉన్నాయి. కాజల్ అగర్వాల్ ఈచిత్రంతో మరోసారి చిరంజీవితో జతకట్టనుంది. సోషియో-పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. పూజా హెగ్డే, సోనుసోద్, వెన్నెల కిశోర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సందడి చేయనుంది.
గాడ్ ఫాదర్‌గా ‘లూసిఫర్’: చిరంజీవి నటిస్తున్న 153వ చిత్రం ఇది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. మలయాళంలో ‘లూసిఫర్’ చిత్రానికి నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్‌ఫాదర్’గా రీమేక్ చేస్తున్నారు. అయితే, ఒరిజనల్ వెర్షన్ కంటే.. ఇది మరికొన్ని మాస్ హంగులతో రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ పోషించిన డాన్ పాత్రలో నటించేందుకు సల్మాన్ ఖాన్ ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చాడు.
చిరంజీవి-బాబీ చిత్రం: చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు బాబీ.. 154 చిత్రం పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ‘పూనకాలు లోడింగ్..’ అంటూ అభిమానుల్లో అంచనాలు పెంచేశాడు. ఇందులో చిరంజీవి ‘ముఠామేస్త్రి’ సినిమా గెటప్ తరహాలో మాస్ అవతారంలో కనిపించారు. లుంగీ పైకి ఎక్కిపెట్టి.. స్టైల్‌గా సిగరెట్ తాగడం ఈ పోస్టర్‌లో కనిపించింది. చిరు మరో చేతితో పడవ యాంకర్‌ను పుట్టుకుని ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘లవ కుశ’, వెంకటేష్ చిత్రం ‘వెంకీ మామా’లకు దర్శకత్వం వహించిన బాబీ.. చిరును కొత్తగా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
‘వెదలం’ రీమేక్.. ‘భోళాశంకర్’: చిరంజీవి నటిస్తున్న మరో రీమేక్ చిత్రం ‘భోళాశంకర్’. చిరు 155వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో అజీత్ కుమార్ నటించిన ‘వెదలం’ సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు. ఇందులో అజీత్ గుండులో కనిపిస్తాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా అదే స్టైల్‌లో కనిపించనున్నట్లు టాక్. యాక్షన్-డ్రామాగా తెరకెక్కి ఈ చిత్రాన్ని కోల్‌కతాలో చిత్రీకరించనున్నట్లు తెలిసింది.
మారుతీతో ‘156’?: చిరంజీవి తన 156 చిత్రానికి కూడా కథ వింటున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించున్నట్లు తెలిసింది. అయితే, ఈ చిత్రం గురించి ఇంకా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. ఈ చిత్రాలన్నీ షూటింగులు పూర్తి చేసుకుని.. 2022-2023 నాటికి క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే.. మున్ముందు మెగా అభిమానులకు పూనకాలే.
Also Read: బస్సు ఫుట్‌బోర్డుపై.. నయన్, సమంత, విజయ్ సేతుపతి ప్రయాణం, వీడియో వైరల్