CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
మూడు సంవత్సరాల తర్వాత సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టోర్నీ జరగనుంది.
దేశంలోని అన్ని సినీ పరిశ్రమలకు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్ తరహాలో ఆడే ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్)’ గురించి అందరికీ తెలిసిందే. 2011 నుంచి 2019 వరకు మొత్తంగా ఎనిమిది సీజన్ల పాటు ఈ టోర్నీ కొనసాగింది. ఈ తొమ్మిది సంవత్సరాల్లో కేవలం 2018లో మాత్రమే సీసీఎల్ జరగలేదు.
అయితే కరోనా వైరస్ కారణంగా 2019 తర్వాత ఈ టోర్నీ జరగనే లేదు. ఇప్పుడు 2023లో తిరిగి ఈ టోర్నీని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 19/వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. లక్నో, జైపూర్, బెంగళూరు, త్రివేండ్రం, జోధ్‌పూర్, హైదరాబాద్‌ల్లో టోర్నమెంట్ జరగనుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌లకు హైదరాబాద్ వేదిక కానుంది.
ఈ టోర్నమెంట్‌లో టాలీవుడ్‌కు చెందిన తెలుగు వారియర్స్ జట్టుకు అద్భుతమైన రికార్డు ఉంది. ఏకంగా మూడు సార్లు టోర్నమెంట్ విన్నర్‌గా నిలిచింది. అన్ని జట్లలోనూ ఇదే అత్యధికం. 2015, 2016, 2017 సీజన్లలో వరుసగా మూడు సార్లు తెలుగు వారియర్స్ విజేతగా నిలిచింది. 2013లో రన్నరప్‌గా నిలవగా, 2011, 2012లో సెమీస్‌కు చేరుకున్నారు. 2014, 2019లో మాత్రం గ్రూప్ దశలోనే వెనుదిరిగారు.
సీసీఎల్ అధికారిక వెబ్ సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం తెలుగు వారియర్స్‌కు అఖిల్ అక్కినేని కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఫ్రాంచైజీకి సచిన్ జోషి యజమాని కాగా, విక్టరీ వెంకటేష్ మెంటార్‌గా ఉన్నారు. జట్టులో సచిన్ జోషి, అశ్విన్ బాబు, సాయి ధరమ్ తేజ్, ఆదర్శ్, నంద కిషోర్, నిఖిల్, సామ్రాట్, తారకరత్న, తరుణ్, విశ్వ, ప్రిన్స్, సుశాంత్, ఖయ్యూమ్, హరీష్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ సీజన్‌లో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయేమో చూడాలి.
తెలుగు టైటాన్స్ తన మొదటి మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 19వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 25వ తేదీన చెన్నై రైనోస్‌తో, మార్చి 4వ తేదీన బెంగాల్ టైగర్స్‌తో, మార్చి 12వ తేదీన పంజాబ్ డీ షేర్‌తో జరగనుంది. ఒకవేళ సెమీస్, ఫైనల్స్‌కు చేరుకుంటే మార్చి 18వ తేదీ, మార్చి 19వ తేదీల్లో కూడా ఆడాల్సి వస్తుంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram