Aunty: ‘ఆంటీ’ అని పిలిస్తే కేసు పెట్టొచ్చా? ఆ పిలుపు నేరమా? న్యాయ నిపుణులు ఏం చెబుతున్నారు
ఆంటీ.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఆంటీ అని పిలిస్తే నిజంగానే కేసు వేయొచ్చా? న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు.
ప్రముఖ యాంకర్, నటి అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ తారా స్థాయికి చేరుతోంది. కొందరు తనని ఆంటీ అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనసూయ వరుస ట్వీట్లతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన గురించి, తన ఫ్యామిలీ గురించి తిడుతున్న వాళ్ళపై కేసు పెడతానని అనసూయ వార్నింగ్ కూడా ఇచ్చారు. అనసూయ చెప్పినట్లే.. ఆ ట్వీట్లు దారుణంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులను కూడా అందులోకి లాగి తిట్డడం చాలా తప్పు. అలాంటి వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తాయి. అది కూడా వేదింపుల కిందకే వస్తాయి. కాబట్టి, ఆన్‌లైన్ ట్రోలింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను దూషించడం, మనోభావాలను కించపరచడం, అవమానించడం వంటివి మిమ్మల్ని జైలుపాలు చేయొచ్చు. కాబట్టి, అలాంటి వాటికి దూరంగా ఉండండి.
ఆంటీ అని పిలవడం నేరమా?: ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘Aunty’ వర్డ్ బాగా ట్రెండవ్వుతోంది. నిజంగానే ఆంటీ అన్నందుకు కేసు పెట్టొచ్చా? అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ ద్వారా కొందరు న్యాయ నిపుణులు గతంలో దీనిపై ఏం చెప్పారో తెలుసుకొనే ప్రయత్నం చేశాం. వారిలో కొందరు ‘ఆంటీ’ అని పిలవడం నేరం కాదని చెప్పారు. కానీ, ఆంటీ అంటూ టీజ్ చేయడం మాత్రం, బాధితురాలి మనోవేదనకు గురయ్యేలా పదే పదే ఇబ్బంది పెట్టడం, ఉద్దేశ పూర్వకంగా ఆమెను ఆందోళనకు గురిచేయడం వేదింపులుగా పరిగణిస్తూ చర్యలు తీసుకొనే అవకాశాలు ఉంటాయని తెలిసింది.
కానీ, ఈ కేసు ఎంతవరకు నిలుస్తుందా అనేది మాత్రం సందేహమే. ఎందుకంటే ఆంటీ అనేది మంచి పదమే. పిన్ని లేదా అత్తా అనే అర్థం వస్తుంది. అయితే, ఇటీవల దాన్ని ఏజ్ షేమింగ్‌గా భావిస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలు తక్కువ వయస్సు ఉన్నవారిని కూడా ఆంటీ, అంకుల్ అని పిలుస్తున్నారు. వాటిని సీరియస్‌గా తీసుకోకుండా.. పెడచెవిని పెట్టడమే మంచిదని, వర్రీ కాకూడదని మానసిక నిపుణులు కూడా చెబుతున్నారు.
‘ఆంటీ’ అని పిలవడం నేరమా అనే ప్రశ్నపై న్యూఢిల్లీలో TERI స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్, ఎల్ఎల్ఎం ఎన్విరాన్మెంట్ లా గ్రాడ్యుయేట్ ఆయష్ ప్రశార్ స్పందిస్తూ.. ‘‘ఆంటీ అని పిలవడం అవమానకరంగా భావించినప్పటికీ భారతీయ న్యాయ వ్యవస్థలో ఇది నేరంగా పరిగణించడం వీలు కాదు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 499 ప్రకారం శిక్షార్హమైన పరువు నష్టానికి అత్యంత సమీపమైనది ఉన్నప్పటికీ మినహాయింపులోకి వెళ్తుంది. దీన్ని పరువు నష్టంగా క్లెయిమ్ చెయ్యడం కుదరదు. డిఫమేషన్ కేసు వెయ్యాలంటే ఇతరుల ముందు మీ గురించి చెడుగా మాట్లాడటం లేదా కథనాలు ప్రచురించడం వల్ల ప్రతిష్టకి భంగం వాటిల్లినప్పుడే ఈ కేసు పెట్టడం కుదురుతుంది. ఆంటీ అని పిలిచి భావోద్వేగాలు దెబ్బ తీసినందుకుగాను ఎవరిపైనా కేసు వెయ్యడం కుదరదు. ఎందుకంటే అది నేరం కాదు. సివిల్ తప్పు కూడా కాదు. ఆస్తి తగదాలను మాత్రమే సివిల్ తప్పులుగా పరిగణిస్తారు’’ అని అన్నారు.
ఇలాంటి కేసులు వెయ్యడం వల్ల కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు గాని రివర్స్ లో మీకే నాయస్థానం మొట్టికాయలు వేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇప్పటికే న్యాయస్థానాల్లో హత్య, అత్యాచారం వంటి కొన్ని వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి తీర్పులు ఇచ్చే సరికే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అటువంటి బిజీ టైంలో ఇటువంటి నిరుపయోగమైన పిటిషన్స్ వేసి తలనొప్పులు తీసుకొస్తే నాయస్థానం ఆగ్రహిస్తుంది. భారతీయ న్యాయ వ్యవస్తే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి పనికిమాలిన విషయాలను న్యాయస్థానాలు పట్టించుకోవు. అందుకని మీ మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఆంటీ అని పిలిచినందుకు ఎవరిపైనా కేసు వెయ్యడానికి వీల్లేదన్నమాట.
'లైగర్' విడుదల రోజున అనసూయ చేసిన ట్వీట్ తర్వాత ఆమెను తిడుతూ ట్వీట్లు చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. కొందరు ఆమె కుటుంబ సభ్యులను ఈ వివాదంలోకి లాగుతున్నారు. తన కుటుంబ జోలికి వస్తే కటకటాల వెనక్కి పంపిస్తానని అనసూయ పేర్కొన్నారు. ''ఛీ ఛీ!! అసలు ఎంత చెత్త బాబోయ్... క్లీన్ చేసి చేసి విసుగు వస్తుంది'' అని మరో ట్వీట్ చేశారు. ఆ తర్వాత ''నన్ను ఆంటీ అనడంతో పాటు ఏజ్ షేమింగ్ చేయడం, తిట్టడం చేస్తున్న ప్రతి అకౌంట్ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. అలాగే, నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తున్న వాళ్ళవి కూడా! నేను కేసులు పెడతా. సరైన కారణం లేకుండా నాతో పెట్టుకున్నందుకు ఆ తర్వాత మీరు బాధపడతారు. ఇదే నా ఫైనల్ వార్నింగ్'' అని అనసూయ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్
Also Read : 'కళాపురం' రివ్యూ : అందరూ కళాకారులే - సినిమా ఎలా ఉందంటే?