Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు
పాన్ ఇండియా అనే పదం వినడానికి చాలా ఫన్నీగా ఉందని హీరో సిద్ధార్థ్ అన్నారు.
'కేజీఎఫ్2' సినిమాను పాన్ ఇండియా ఫిల్మ్ అని పిలుస్తుంటే ఫన్నీగా అనిపిస్తుందంటూ హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ హీరో నటించిన 'ఎస్కేప్ లైవ్' అనే సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ ను ప్రమోట్ చేసే క్రమంలో ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు సిద్ధార్థ్. ఈ సమయంలో 'కేజీఎఫ్2' సక్సెస్, పాన్ ఇండియా కాన్సెప్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పాన్ ఇండియా అనే పదం వినడానికి చాలా ఫన్నీగా ఉందని.. 15 ఏళ్ల నుంచి వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నానని.. ఏ భాషలో నటిస్తే ఆ భాషకు డబ్బింగ్ చెప్పుకునేవాడినని అన్నారు. తనవరకు వాటిని ఇండియా సినిమాలని పిలవడమే ఇష్టమని.. పాన్ ఇండియా అంటుంటే తనకు అగౌరవంగా అనిపిస్తుందని అన్నారు. ఈ మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని అనడం లేదని స్పష్టం చేశారు.
బాలీవుడ్ నుంచి ఒక సినిమా విడుదలై హిట్ కొడితే దాన్ని హిందీ సినిమా అనే అంటారని.. అదే ప్రాంతీయ సినిమాల విషయంలో అలా ఎందుకు ఉండదని ప్రశ్నించారు. ప్రాంతీయ చిత్రాలను మంచి ఆదరణ లభించి.. భారీ విజయం సాధిస్తే వీటిని పాన్ ఇండియా అని పిలవడం ఎందుకని..? ఇండియన్ సినిమా అని అనొచ్చు కదా అని ప్రశ్నించారు.
లేదంటే 'కేజీఎఫ్' జర్నీని గౌరవించి కన్నడ సినిమా అని చెప్పొచ్చు అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ను దృష్టిలో ఉంచుకొని ఇండియన్ సినిమా అని పిలవొచ్చని అన్నారు. కాబట్టి పాన్ ఇండియా సినిమా అని కాకుండా ఇండియన్ సినిమా అని చెప్పాలని సూచించారు. పాన్ అంటే ఏమిటో తనకు అర్ధం కావడం లేదని.. ఆ పదం చాలా ఫన్నీగా ఉందని అన్నారు.
View this post on Instagram