Bollywood: బాలీవుడ్ హీరోలకు ‘సినిమా’ కష్టాలు - రెమ్యునరేషన్ తగ్గించుకుంటేనే ఛాన్సులు, సౌత్ ఎఫెక్ట్ మమూలుగా లేదు
కరోనా ప్రభావం, సౌత్ సినిమాల డామినేషన్ బాలీవుడ్ హీరోలకు తలనొప్పిగా మారింది. బాలీవుడ్ సినిమాలు అనుకున్న స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోవడంతో పారితోషికం తగ్గించుకోవాల్సి వస్తోంది.
కరోనా దెబ్బకు సినిమా పరిశ్రమ అతలాకుతలం
భారత్ లో కరోనా ప్రభావం అన్ని రంగాల మాదిరిగానే సినిమా పరిశ్రమ పైనా తీవ్రంగా పడింది. చాలా రోజుల పాటు సినిమా షూటింగులు నిలిచిపోయాయి. విడుదలకు రెడీ అయిన సినిమాలు ఆగిపోయి, నిర్మాతలు ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఉపాధిలేక సినీ కార్మికులు ఎన్నో అవస్థలు పడ్డారు. థియేటర్ల బంద్, సినిమాల షూటింగ్‌లపై ఆంక్షలు విధించడంతో చాలా మందికి కోట్లలో నష్టం వాటిల్లింది. కరోనా దెబ్బకు సినిమా పరిశ్రమ అల్లకల్లోలం అయ్యిందని చెప్పుకోవచ్చు.
సౌత్ ఫర్వాలేదు, నార్త్ లోనే అసలు సమస్య!
కరోనా లాక్ డౌన్ తర్వాత మళ్లీ సినిమా పరిశ్రమ గాడిలో పడేందుకు తీవ్రం కష్టపడాల్సి వచ్చింది. ఇప్పటికీ కరోనాకు ముందు మాదిరిగా ఇండస్ట్రీ కోలుకోలేదని చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. కానీ, ఉత్తరాది సినిమా పరిశ్రమ ఇప్పటికీ కోలుకోలేకపోతున్నది. చిన్న సినిమాలే కాదు, స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయిన సందర్భాలున్నాయి. ఆయా సినిమాల ఓపెనింగ్స్ అత్యంత దారుణంగా ఉన్నాయి. దక్షిణాది హీరోలతో పోల్చితే బాలీవుడ్ హీరోల పరిస్థితి ఘోరం అని చెప్పుకోవచ్చు. వసూళ్లను సాధించడంలో బాలీవుడ్ సినిమాలు చాలా వరకు బొక్కబోర్లా పడ్డాయి.
డబ్బింగ్ సౌత్ సినిమాలే బెస్ట్!
మరింత దారుణం అయిన విషయం ఏంటంటే, డబ్బింగ్ సౌత్ ఇండియన్ సినిమాలు స్ట్రెయిట్ హిందీ చిత్రాల కంటే హిందీలో మెరుగ్గా ప్రజాదరణ పొందుతున్నాయి. ఇటీవల విడుదలైన తెలుగు సినిమా ‘కార్తికేయ-2’, అక్షయ్ కుమార్ నటించిన స్ట్రెయిట్ హిందీ సినిమా ‘రక్షా బంధన్’, అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ‘థాంక్ గాడ్’ కంటే అద్భుతమైన వసూళ్లు చేపట్టింది. ఈ రెండు హిందీ సినిమాలు కూడా వసూళ్లు రాబట్టలేక వెలవెలబోయాయి. దీనికి తోడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెంట్ కొనసాగుతోంది. ఈ క్యాంపెయిన్ దెబ్బకు బడా బడా హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్నాయి. అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఇందుకు నిదర్శంగా చెప్పుకోవచ్చు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అట్టహాసంగా విడుదలైనా, జనాలు లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి నెలకొంది. ఈ సినిమా నష్టాల దెబ్బకు అమీర్ ఖాన్ కొద్ది కాలం నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న బాలీవుడ్ హీరోలు
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు.. రకరకాల కారణాలతో బాలీవుడ్ హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్షయ్ కుమార్, హృత్తిక్ రోషన్ లాంటి హీరోల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. బాలీవుడ్ మళ్లీ గాడిలో పడే వరకు పారితోషికాలు తగ్గించుకోక తప్పదనే టాక్ వినిపిస్తోంది.
Read Also: అందం, అభినయమే కాదు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ నయనతార, 39వ వసంతంలోకి లేడీ సూపర్ స్టార్!