Sekhar Basha: ఎలిమినేషన్ వెనకున్న కారణం ఇదే - సీక్రెట్ బయట పెట్టేసిన శేఖర్ బాషా
రెండవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవిక్ట్ అయిన శేఖర్ బాషా తాజాగా తాను ఎలిమినేట్ కావడానికి గల కారణం ఏంటో బయట పెట్టి షాక్ ఇచ్చారు. మరి ఆయన ఎలిమినేషన్ వెనకున్న కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండవ వారం సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో బేబక్క హౌస్ నుంచి బయటకు వెళ్ళగా రెండవ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. శేఖర్ బాషా కన్నా వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్ హౌస్ లో ఉండి, ఆయన ఎలిమినేట్ అవ్వడాన్నిఅభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బయటకు వచ్చాక ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు అభిమానులు. మరోవైపు అసలు శేఖర్ బాషా ఎలిమినేట్ కావడానికి గల కారణం ఏంటి? అని విశ్లేషిస్తున్నారు బిగ్ బాస్ ప్రియులు. ఈ నేపథ్యంలోనే తాజాగా శేఖర్ బాషా తాను ఎందుకు ఎలిమినేట్ అయ్యాను అనే విషయాన్ని బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చారు.
శేఖర్ బాషా ఎలిమినేషన్ కు కారణం ఇదే
అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు గానీ అన్లిమిటెడ్ గొడవలు అనిపించింది ఈ రెండు వారాల బిగ్ బాస్ 8 షో. అయితే హౌస్ లో కాస్తో కూస్తో కామెడీ ద్వారా ఎంటర్టైన్ చేసేది మాత్రం శేఖర్ బాషానే. పైగా ఇంకా హౌస్ లో ఉన్న కొంత మందితో పోల్చుకుంటే శేఖర్ బాషా అన్ని రకాలుగా పర్లేదు అనిపిస్తారు. ఓటింగ్ పరంగా కూడా ఇదే విషయం స్పష్టమైంది. కానీ ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న శేఖర్ బాషాను బిగ్ బాస్ 8 నుంచి ఎవిక్ట్ చేసి, రెండవ వారమే బయటకు పంపించడంతో ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. అయితే మరోవైపు శేఖర్ బాషానే కావాలని బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు అంటూ పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి శనివారం ఎపిసోడ్ లో శేఖర్ బాషాకు కొడుకు పుట్టాడని నాగార్జున గుడ్ న్యూస్ చెప్పారు. అంతకు మూడు రోజుల క్రితమే ఆయనకు కొడుకు పుట్టగా, వీకెండ్ ఎపిసోడ్ లో తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమం అంటూ నాగార్జున స్వీట్ న్యూస్ చెప్పారు. ఈ విషయం తెలిశాక శేఖర్ బాషా స్వయంగా తానే బయటకు వెళ్లిపోవాలని అనుకున్నాడని తెలుస్తోంది. తన భార్య, కొడుకుని చూడాలని.. ఇలాంటి ముఖ్యమైన టైంలో వాళ్ల దగ్గర ఉండాలని కోరుకున్న శేఖర్ తనే వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే బిగ్ బాస్ శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యేట్టుగా ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతుంది.
ఎలిమినేషన్ పై నోరు విప్పిన శేఖర్ బాషా
ఇక ఈ వార్తలపై శేఖర్ బాషా తాజాగా రియాక్ట్ అయ్యారు. శేఖర్ బాషా మాట్లాడుతూ "బిగ్ బాస్ చరిత్రలో ఇదే ఫస్ట్ హ్యాపీ ఎలిమినేషన్. నేనే కావాలని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాను. నా కొడుకును చూడడం కోసమే బిగ్ బాస్ ను అడిగి మరీ బయటకు వచ్చాను.. అంతే కాకుండా నాకు ఫుడ్ విషయంలో కూడా కాస్త ప్రాబ్లంగా అనిపించింది. హౌస్ లో నాకు అందరూ బాగా సపోర్ట్ ఇచ్చారు. కానీ నేను ఇంకా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తాను అని నమ్మి, నన్ను సపోర్ట్ చేసిన అందరికీ ఈ సందర్భంగా క్షమాపణలు చెప్తున్నాను" అంటూ శేఖర్ బాషా తన ఎలిమినేషన్ విషయంలో ఏం జరిగింది అనే విషయాన్ని బయటపెట్టి అభిమానులకు షాక్ ఇచ్చారు.