Bigg Boss Telugu 7: ఈవారం ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ అనూహ్య నిర్ణయం!
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఈ వారం ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 7లో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్సే మిగిలారు. అయితే ఫైనల్స్‌కు టైమ్ దగ్గర పడుతుండగా.. ఇప్పటినుండి జరిగే ఎలిమినేషన్స్ చాలా కీలకంగా మారనున్నాయి. ఇప్పటివరకు జరిగే ఎలిమినేషన్స్‌లో ఏదో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా భావించారు. కానీ అనూహ్యంగా ఈవారం ఎలిమినేషన్ గురించి ఒక కొత్త రూమర్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈవారం జరిగిన ఎవిక్షన్ ఫ్రీ పాస్.. అందరి దృష్టిని ఆకర్షించినా.. తిరిగి అది బిగ్ బాస్ దగ్గరకే వచ్చింది. దీంతో ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది.
ఎలిమినేషన్ లేదు..!
ఈవారమంతా కష్టపడి, టాస్కులు ఆడి.. యావర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను గెలుచుకున్నాడు. కానీ తన ఆటలో కొన్ని తప్పులు ఉన్నాయని నాగార్జున.. వీడియో చూపించగానే ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను వెనక్కి ఇచ్చేస్తానని అన్నాడు. నాగార్జున కూడా దానికి ఒప్పుకొని పాస్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో ఈవారం ఎలిమినేషన్ ఎలా జరుగుతుంది అనే విషయంపై ఆసక్తి పెరిగింది. శోభా శెట్టి, రతిక.. ఈ ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్‌పై ప్రేక్షకుల్లో నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా ఈవారం అసలు ఎలిమినేషనే లేదంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
డేంజర్ జోన్‌లో రతిక..
ఈవారం శివాజీ, పల్లవి ప్రశాంత్ తప్పా మిగతా 8మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లోనే ఉన్నారు. నామినేషన్స్ రోజు రతిక.. సీజన్ మొదట్లో ఎలా ఉండేదో అలా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో రతిక తన గేమ్ ప్లాన్‌ను మార్చుకుందని, ఈవారం ఆట అదరగొడుతుందని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ అలా జరగలేదు. నామినేషన్స్ ముగిసిన తర్వాత రోజు నుండి మళ్లీ హౌజ్‌లో తన పాత్ర తగ్గిపోయింది. టాప్ 10 ర్యాంకింగ్ టాస్క్‌లో పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేసినట్టు మాట్లాడడం, పాత విషయాలు తవ్వడం అనేది రతికకు మళ్లీ నెగిటివ్‌గా మారాయి. దీంతో చాలావరకు బిగ్ బాస్ ప్రేక్షకులు.. రతికకు ఇంకా అవకాశాలు ఇవ్వడం వ్యర్థమని భావించడం మొదలుపెట్టారు. దీంతో తన ఓటింగ్ శాతం కూడా తగ్గిపోయి డేంజర్ జోన్‌లో ఉందని వార్తలు వినిపించాయి.
శోభా కూడా సేఫ్..
రతికతో పాటు శోభా శెట్టి కూడా డేంజర్ జోన్‌లోనే ఉందని సమాచారం. అనవసరంగా ఇతర కంటెస్టెంట్స్‌తో గొడవలు పెట్టుకోవడం, ఎవరు ఏం చెప్పినా వినకుండా అరుస్తూ వాదించడం.. ఇవన్నీ చూసి ప్రేక్షకులకు శోభా విషయంలో అసహనం ఏర్పడింది. అసలైతే నాలుగు వారాల ముందే శోభా ఎలిమినేట్ అయిపోతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇతర కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోతున్నా.. శోభా మాత్రం చివరి నిమిషంలో ఏదో ఒక విధంగా సేవ్ అయిపోతోంది. ఈవారం అయినా తను ఎలిమినేట్ అయితే బాగుంటుందని శోభా హేటర్స్ భావించారు. కానీ అనూహ్యంగా ఈవారం ఎలిమినేషనే రద్దయ్యింది. దీంతో వచ్చే నాలుగు వారాల్లో ఏదో ఒక వారం కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.