Amardeep: భోలేను కడుపులో గుద్దిన అమర్‌దీప్ - శివాజీని వదలని బ్యాడ్ బాయ్, అశ్వినీ ఏడుపు
కెప్టెన్సీ టాస్కులో అమర్ దీప్ రెచ్చిపోయాడు. దొరికినవారిని దొరికినట్లు తోసేస్తూ.. గుద్దేస్తూ టాస్కులో దూసుకెళ్లాడు. భోలే, అశ్వినీ, శివాజీకి అమర్ దెబ్బలు గట్టిగానే తగిలాయ్.
‘బిగ్ బాస్’ సీజన్ 7లో కెప్టెన్సీ టాస్క్ హౌస్‌మేట్స్ మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. ‘బీన్ బ్యాగ్స్’ టాస్క్‌లో అమర్ ఆవేశంగా ఆడాడు. తన బలానికి పనిచెప్పాడు. ఒకొక్కరినీ టార్గెట్ చేసుకుంటూ.. ఆటలో చివరి వరకు నిలిచాడు. అయితే, గౌతమ్ కొడుతున్నాడు అంటూ అశ్వినీ, భోలే ఆరోపించారు. ప్రియాంక కూడా నీ చేతులు బలంగా తగులుతున్నాయని అమర్‌కు చెప్పింది. చివరికి శివాజీని కూడా వదల్లేదు. ఆయనకు ఉన్న బీన్ బ్యాగ్‌ను బలంగా లాగేసరికి.. చేతి గాయం రేగింది. దీంతో ఆట నుంచి తప్పుకోక తప్పలేదు.
అసలు ఏం జరిగిందంటే..
కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌మేట్స్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. గుచ్చడాలు, మిరపకాయ దండలకు బదులుగా ‘బీన్ బ్యాగ్’లు ఇచ్చాడు. అందరికీ షాకిచ్చాడు. ఆ బ్యాగ్‌లపై కెప్టెన్సీ కంటెండర్లుగా ఉన్న గౌతమ్, శోభా శెట్టి, టేస్టీ తేజా, రతిక రోజ్, యావర్, అర్జున్‌ల ఫొటోలు ఉన్నాయి. వాటిలో వారికి నచ్చిన కంటెండర్ బీన్ బ్యాగ్‌ను ‘గర్జించే పులులు’ టీమ్ ధరించి.. అది ఖాళీ కాకుండా కాపాడాలని చెప్పాడు బిగ్ బాస్. దీంతో శివాజీ - అర్జున్ బ్యాగ్‌ను, అమర్ - శోభాశెట్టి, ప్రియాంక - టేస్టీ తేజా, అశ్వినీ - గౌతమ్, భోలే - రతిక బ్యాగ్‌లను ధరించి ఆడారు. అయితే, ‘వీర సింహాలు’ టీమ్‌కు చెందిన యావర్ చివరి క్షణంలో కంటెండర్‌షిప్ నుంచి బయటకు వచ్చేశాడు. తాను అందులో ఆడనని పేర్కొన్నాడు. దీంతో ఐదుగురు మాత్రమే ఆడారు. ఈ ఆటకు ముందు.. అస్సలు కెప్టెన్సీ పొందని రతిక, శోభాశెట్టి, తేజా తరఫునే ఆడాలని గర్జించే పులుల టీమ్ అంతా నిర్ణయించుకున్నారు. గౌతమ్, అర్జున్ తరఫున ఎవరూ ఆడకూడని అనుకున్నారు. అయితే, గౌతమ్ రిక్వెస్ట్ చేయడంతో అతడి తరఫున ఆడతానని అశ్వినీ ముందుకొచ్చింది. దీంతో తాను అర్జున్ తరపున ఆడతానని శివాజీ సిద్ధమయ్యాడు.
అమర్ కొట్టాడంటూ భోలే, అశ్వినీ ఫిర్యాదు
ఆట మొదలు కాగానే రతిక బీన్ బ్యాగ్‌ను ధరించిన భోలేను.. గౌతమ్ బ్యాగ్‌ను ధరించిన అశ్వినీని టార్గెట్ చేసుకున్నాడు అమర్ దీప్. అశ్వినీ తన బ్యాగ్‌ను కాపాడుకొనే క్రమంలో అమర్‌దీప్ మీదకు చెయ్యి విసిరినట్లు కనిపించింది. ఆ తర్వాత అమర్ కూడా అదే చేశాడు. ఇది గమనించిన సంచాలకుడు పల్లవి ప్రశాంత్.. ఇద్దరు కొట్టుకుంటున్నారని, మళ్లీ అలా జరిగితే గేమ్ నుంచి బయటకు పంపేస్తానని హెచ్చరించాడు. అశ్వినీ బయటకు వెళ్లిపోయిన తర్వాత భోలేను టార్గెట్ చేసుకున్నాడు అమర్. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య గట్టిగానే ఫైట్ జరిగింది. అయితే, అమర్ తనని పొట్టలో కొట్టాడని భోలే ఆరోపించాడు. భోలే తనను కూడా కొట్టాడని.. కావాలంటే దెబ్బలు చూపిస్తానని అమర్ అన్నాడు. భోలే కూడా బయటకు వెళ్లిపోయిన తర్వాత.. శివాజీ బ్యాగ్‌లోని బీన్స్ లాగేందుకు ప్రయత్నించాడు అమర్. దీంతో శివాజీ చెయ్యి కదిలింది. వెంటనే ఆయన్ని మెడికల్ టెస్ట్ కోసం పంపించారు. ఆ తర్వాత ఆయన ఆడే పరిస్థితిలో లేడాని, అర్జున్‌ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించాలని బిగ్ బాస్ వెల్లడించాడు. దీంతో ప్రియాంక, అమర్ చివర్లో ఫైట్ చేసుకున్నారు. చివరికి.. అమర్ టాస్కులో గెలిచి శోభాను కెప్టెన్ చేశాడు. అయితే, ప్రియాంక చాలా గట్టి పోటీ ఇచ్చింది అమర్‌కు.
నా చెప్పుతో నేను కొట్టుకుంటా..
శివాజీ ఆడినంత సేపు యెల్లో లైన్ బయటే ఉన్నారని, లైన్ లోపలికి వచ్చి ఆడలేదని అమర్ ఆరోపించాడు. అయితే, ప్రశాంత్ మాత్రం అశ్వినీ, అమర్ కొట్టుకుంటున్న విషయాన్ని పదే పదే ప్రస్తావించాడు. ‘‘శివాజీకి చెయ్యి బాగోలేదు. పైగా, ఆయన లైనులోకి వచ్చేందుకు మీరు చోటు ఇవ్వలేదు’’ అని వెనకేసుకుని వచ్చాడు ప్రశాంత్. ‘‘శివాజీ బయటే తిరిగాడని చెప్పడానికి కెమేరాలు ఉన్నాయి. ఒక వేళ అది నిజం కాకపోతే.. నా చెప్పుతో నేనే కొట్టుకుంటా’’ అని తెలిపాడు. మరోవైపు.. గౌతమ్ తరపున ఆడినందుకు అశ్వినీని తప్పుబట్టాడు యావర్. గౌతమ్ అల్రెడీగా కెప్టెన్‌గా ఉన్నప్పుడు అతడి తరపున ఎందుకు ఆడావని ప్రశ్నించాడు. గౌతమ్ తనని అడిగాడని, అందుకే తాను ఆడాల్సి వచ్చిందని అశ్వినీ చెప్పింది. అయితే, ఆటలో అందరూ ఫస్ట్ తననే టార్గెట్ చేసుకున్నారని భోలేతో చెప్పుకుంటూ అశ్వినీ ఏడ్చేసింది.
Also Read: కొట్టుకున్న అమర్, అశ్వినీ.. శోభాను కెప్టెన్ చేసిన బ్యాడ్ బాయ్?