Bappi Lahiri: సంగీత దర్శకుడిగా, గాయకుడిగా తెలుగులో బప్పీ లహరి తొలి సినిమా - చివరి సినిమా వివరాలు
ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి ఈ రోజు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయనకు తెలుగు సినిమాలతో మంచి అనుబంధం ఉంది. తెలుగులో సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఆయన తొలి, చివరి సినిమా వివరాలు...
బప్పీ లహరి (Bappi Lahiri) అంటే బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే... ఆయన తెలుగు సినిమాలు కూడా చేశారు. తెలుగు సినిమాలకు హిట్ సాంగ్స్ అందించారు. ఇంతకీ, ఆయన్ను తెలుగుకు పరిచయం చేసింది ఎవరో తెలుసా? సూపర్ స్టార్ కృష్ణ. అవును... కృష్ణే బప్పీ లహరిని తెలుగుకు తీసుకొచ్చారు.
సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన, స్వయంగా నిర్మించిన సినిమా 'సింహాసనం' (Bappi Lahiri First Telugu Movie as Music Composer). సంగీత దర్శకుడిగా బప్పీ లహరికి తెలుగులో అదే తొలి సినిమా. అందులోని 'ఆకాశంలో ఒక తార...' పాట ఇప్పటికీ ఏదో ఒక చోట వినిపిస్తూ ఉంటుంది. 'సింహాసనం' సినిమాను తెలుగుతో పాటు హిందీలో 'సింఘాసన్' పేరుతో తీశారు కృష్ణ. అప్పటికే హిందీలో బప్పీ లహరి ఫేమస్. 'డిస్కో రాజా' సాంగ్స్ ఒక ఊపు ఊపేశాయి. ఆయన అయితే సినిమాకు ప్లస్ అవుతుందని తీసుకున్నారు. నిజంగానే ప్లస్ అయ్యారు.
'సింహాసనం' తర్వాత కృష్ణ నటించిన 'తేనే మనసులు', 'శంఖారావం' సినిమాలకూ బప్పీ లహరి సంగీతం అందించారు. చిరంజీవి 'స్టేట్ రౌడీ', 'గ్యాంగ్ లీడర్', 'రౌడీ అల్లుడు', బాలకృష్ణ 'రౌడీ ఇన్స్పెక్టర్', 'నిప్పు రవ్వ', మోహన్ బాబు 'రౌడీ గారి పెళ్ళాం', 'పుణ్యభూమి నా దేశం' సినిమాలకు సంగీతం అందించారు. 'నిప్పు రవ్వ' నేపథ్య సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. 'పాండవులు పాండవులు తుమ్మెద'లో 'చూశాలే... చూశాలే...' పాటకు బప్పీ లహరి సంగీతం అందించారు.
సంగీత దర్శకుడిగా తెలుగులో బప్పీ లహరి చివరి సినిమా అంటే 'పాండవులు పాండవులు తుమ్మెద' అని చెప్పుకోవాలి. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ 'డిస్కో రాజా'లో 'రమ్ పమ్ రమ్...' పాటను (Bappi Lahiri Last Telugu Song As A Singer) ఆలపించారు. గాయకుడిగా ఆయన చివరి తెలుగు పాట అదే. రవితేజ కూడా ఆ పాటలో కొన్ని లైన్స్ పాడారు. ఆ మధ్య బప్పీ లహరి సంగీతంలో చదలవాడ శ్రీనివాసరావు ఓ సినిమా చేయనున్నట్టు దర్శకుడు జి. రవికుమార్ ప్రకటించారు. అయితే... ఆ సినిమా ప్రారంభం కాలేదు. మ్యూజిక్ సిట్టింగ్స్ చేశారో? లేదో? మరి!
Also Read: బప్పి లహిరి మెడలో అంత బంగారమెందుకు? వాటి బరువు, ధర ఎంతో తెలుసా?
Also Read: ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి కన్నుమూత, ఏడాది నుంచి వీల్ చైర్‌లోనే
Veteran singer and composer Bappi Lahiri passed away, CritiCare Hospital in Mumbai has confirmed
— ANI (@ANI) February 16, 2022
(File pic) pic.twitter.com/HYVnMrhbrb