Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం
మైసూర్ లోని ఓ మ్యూజియంలో తాజాగా ‘బాహుబలి’ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై నిర్మాత శోభు యార్లగడ్డ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో సంచలన విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోనూ కనీవినీ ఎరుగని సక్సెస్ అందుకుంది. భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా బ్యానర్ లో నిర్మాత శోభు యార్లగడ్డ నిర్మించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది.
మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ‘బాహుబలి’ మైనపు విగ్రహం ఏర్పాటు
ఈ చిత్రంతో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ‘బాహుబలి’ మేనియా ప్రపంచ నలుమూలలను తాకింది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని లండన్ లోని ప్రసిద్ధ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ‘బాహుబలి’ మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన వ్యక్తుల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేసే మ్యూజియంలో ‘బాహుబలి’ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రభాస్ అభిమానులతో పాటు సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేశారు. చిత్రబృందం కూడా చాలా గర్వంగా ఫీలయ్యింది.
తాజాగా మైసూర్ లో ‘బాహుబలి’ విగ్రహం
రీసెంట్ గా మైసూరులోని ఓ మ్యూజియంలో ‘బాహుబలి’ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ బొమ్మకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్నాయి. అయితే, ఈ ‘బాహుబలి’ విగ్రహం అస్సలు ప్రభాస్ లుక్ లో లేకపోవడంతో నెటిజన్లు, ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మైనపు విగ్రహం అస్సలు ప్రభాస్ లా లేదని మండిపడుతున్నారు. ‘బాహుబలి’ గెటపు ఉన్నా, ‘బాహుబలి’ కాదంటున్నారు. మరికొంత మంది ఈ విగ్రహం అచ్చం ‘బాహుబలి’ స్పూప్ చేసిన డేవిడ్ వార్నర్ లా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. మొత్తంగా ఈ మైనపు విగ్రహం సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు కారణం అయ్యింది.
మైసూర్ ‘బాహుబలి’ విగ్రహంపై శోభు యార్లగడ్డ సీరియస్
అటు ఇటు తిరిగి ఈ ‘బాహుబలి’ మైనపు విగ్రహం వ్యవహారం ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ దగ్గరికి చేరింది. తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈ ఫోటోను షేర్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇది అధికారికంగా లైసెన్స్ తీసుకుని చేసిన పని కాదు. ఎలాంటి పర్మీషన్ తీసుకోలేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ బొమ్మను తొలిగించడానికి వెంటనే చర్యలు తీసుకుంటాం” అని పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ మైసూర్ మ్యూజియం వాళ్లు ఈ విగ్రహాన్ని తొలగిస్తారా? లేదంటే, నిర్మాతకు క్షమాపణ చెప్పి, అలాగే ఉండేలా చూస్తారా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
This not an officially licensed work and was done without our permission or knowledge. We will be taking immediate steps to get this removed. https://t.co/1SDRXdgdpi
— Shobu Yarlagadda (@Shobu_) September 25, 2023
Read Also: డిసెంబర్‌లో 'సలార్' - షారుఖ్ ఖాన్ 'డంకీ'తో పోటీకి ప్రభాస్ రెడీ!?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial