Avatar 2 Mixed Talk Reasons : 'అవతార్ 2'కు మిక్స్డ్ టాక్ రావడానికి ఐదు ముఖ్యమైన కారణాలు
'అవతార్ 2'కు ఆశించిన రీతిలో విమర్శకుల నుంచి రివ్యూలు రాలేదు. కొందరు ప్రేక్షకులు సైతం సినిమా బాలేదని, డిజప్పాయింట్ చేసిందని ట్వీట్లు చేశారు. ఈ మిక్స్డ్ టాక్ రావడానికి గల ఐదు మైఖ్యమైన కారణాలు ఏంటంటే...
ప్రపంచ సినిమా చరిత్రలో 'అవతార్' ఓ అద్భుతం. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన, విమర్శకులు మరీ మరీ మెచ్చిన చిత్రమది. అందుకే, 'అవతార్'కు పన్నెండేళ్ళ తర్వాత సీక్వెల్ వచ్చినా సరే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందరూ ఎంతగానో ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. శుక్రవారం 'అవతార్' (Avatar The Way Of Water) విడుదలైంది. అయితే, ఆశించిన రీతిలో స్పందన రాలేదు.
'అవతార్'కు వచ్చినంత యునానిమస్ హిట్, పాజిటివ్ టాక్ దీనికి రాలేదు. మిక్స్డ్ టాక్ ఎక్కువ వినబడుతోంది. 'అవతార్' రేటింగ్స్‌తో కంపేర్ చేస్తే సీక్వెల్‌కు రేటింగ్స్ తక్కువ వచ్చాయి. 'ది గార్డియన్' వెబ్‌సైట్ అయితే 2 రేటింగ్ ఇచ్చింది. కొన్ని సైట్లు 2.5 రేటింగ్స్ ఇచ్చాయి. తెలుగు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అయితే డాక్యుమెంటరీ అని ట్వీట్ వేశారు. 'అవతార్ 2' బాలేదంటే నావి జాతి ఒప్పుకోరన్నట్టు సెటైరికల్‌గా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు, ఈ మిక్స్డ్ లేదంటే ఫ్లాప్ టాక్ రావడానికి రీజన్స్ ఏంటని చూస్తే...
1) రన్ టైమ్ ఎక్కువ
ప్రేక్షకులు స్పీడుగా, ఫాస్టుగా నడిచే సినిమాలకు అలవాటు పడ్డారు. తక్కువ నిడివిలో ఎక్కువ అనుభూతి కోరుకుంటున్నారు. థియేటర్ మధ్య మధ్యలో వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు కూడా మైండ్ డైవర్ట్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకులను మూడున్నర గంటలు థియేటర్లలో కూర్చోబెట్టడం అంటే సాహసమే. కథనం ఏమాత్రం నెమ్మదించినా, సన్నివేశాల నిడివి పెరిగినా ఇబ్బంది పడుతున్నారు.
'అవతార్ 2' విషయంలో మొదటి మైనస్ మార్కు నిడివి దగ్గర పడింది. జేమ్స్ కామెరూన్ వీరాభిమానులు సైతం సినిమా స్లోగా ఉందని, కొంచెం ట్రిమ్ చేస్తే బావుండేదని చెబుతున్నారు.
2) ప్రేక్షకులకు తెలిసిన పండోరా గ్రహమే!
'అవతార్' విడుదలైనప్పుడు ప్రపంచ ప్రేక్షకులకు పండోరా గ్రహం కొత్త. వింత ఊహా ప్రపంచాన్ని వెండితెరపై చూసి ఆశ్చర్యంతో కళ్ళు అప్పగించి మరీ అలా చూశారు. ఇప్పుడు ప్రేక్షకులకు పండోరా గ్రహం తెలిసిన ప్రపంచమే. అందువల్ల, కొత్తగా ఫీలవడానికి ఏమీ లేదు. తెలిసిన ప్రపంచంలో విజువల్స్ మాత్రమే కొత్తగా ఉండటంతో కొంత నిరాశ చెందారు.
సినిమా స్టార్టింగ్‌లో వచ్చే సన్నివేశాలు స్లోగా ఉన్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. చివరి గంట బావుందని చెబుతున్నారు. ఎందుకంటే... చివరి గంట సముద్రం మధ్యలో పోరాట దృశ్యాలు జరుగుతాయి. కొందరు ఆ సన్నివేశాలు కూడా జేమ్స్ కామెరూన్ తీసిన 'టైటానిక్'ను గుర్తు చేశారని కామెంట్ చేశారు.
3) 'అవతార్ 2' కథ ఎక్కడ ఉంది?
'అవతార్ 2'లో బావుందని చెప్పే ప్రతి ఒక్కరూ విజువల్స్ గురించి, చివరి గంట గురించి మాట్లాడుతున్నారు. అంతే తప్ప... కథలో కొత్త పాయింట్ చెప్పారని నొక్కి వక్కాణించి మరీ ఎవరూ చెప్పడం లేదు. దీనికి కారణం... కథ కంటే జేమ్స్ కామెరూన్ విజువల్స్, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయడం! అందువల్లే, మధ్యలో రెండు మాటల్లో చెప్పిన అమృత కాన్సెప్ట్ సరిగా జనాలకు ఎక్కలేదు.
Also Read : ఏందిది నారప్ప... 'అవతార్ 2' కథ వెంకటేష్ 'నారప్ప'లా ఉందని చెబుతున్నారేంటి?
చివరిలో టుల్‌కున్ (భారీ తిమింగలం) చేసే ఫైట్ అంత హై ఇచ్చిందంటే, దానికి ముందు జేక్ చిన్న కుమారుడు, ఆ టుల్‌కున్ మధ్య బాండింగ్ ఎస్టాబ్లిష్ చేయడమే. మైనారిటీ వర్గాలపై మెజారిటీ వర్గం వివక్ష చూపించడం... తండ్రి కుమారుల మధ్య సన్నివేశాలు భారతీయ ప్రేక్షకులకు కొత్త కాదు. విజువల్స్ మినహాయిస్తే తెలుగు ప్రేక్షకులు కొందరు కథ 'నారప్ప'లా ఉందని, తమిళ ప్రేక్షకులు అయితే 'అసురన్' టైపు ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
4) విజువల్ డామినేషన్ ఎక్కువ...
ఎమోషనల్ కనెక్షన్ తక్కువ!
విజువల్స్... విజువల్స్... విజువల్స్... 'అవతార్ 2' స్టార్టింగ్ నుంచి విజువల్స్ స్క్రీన్ మీద ప్రతి అంశాన్ని డామినేట్ చేశాయి. జేమ్స్ కామెరూన్‌కు పండోరా గ్రహం మీద ప్రేమ విపరీతంగా పెరగడంతో సాధారణ ప్రజల కంటే నావి జాతి, మెట్ కాయినా జాతి ప్రజలతో క్యారెక్టర్లు నింపేశారు. కథానుగుణంగా అలా వెళ్లారు. అందులో తప్పు లేదు. కానీ, స్క్రీన్ అంతా నీలి రంగు మనుషులు ఉండటంతో వాళ్ళ ఎమోషన్స్‌తో ఆడియన్స్ పూర్తిగా కనెక్ట్ కాలేకపోయారు.
5) ఐమాక్స్ స్క్రీన్లు ఎన్ని ఉన్నాయ్? ఎక్కడ ఉన్నాయ్?
'అవతార్' లాంటి సినిమాను త్రీడీలో, అదీ లార్జ్ స్క్రీన్స్ మీద చూడాలి. అటువంటి స్క్రీన్లు ఇండియాలో కానీ, ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి? ఐమాక్స్ ఫార్మటులో, త్రీడీలో 'అవతార్ 2'ను చూస్తే వచ్చే కిక్కే వేరు. జేమ్స్ కామెరూన్ టెక్నికల్ పరంగా వండర్ క్రియేట్ చేశారు. సాధారణ స్క్రీన్లలో చూస్తే ఆ అనుభూతి ఎక్కడ ఉంటుంది? అందువల్ల, నిజమైన సినిమా ప్రేమికులు ఎవరైనా సరే ఈ సినిమా చూడాలనుకుంటే... దగ్గరలో మంచి సౌండ్ సిస్టమ్, విజువల్ క్వాలిటీ ఉన్న స్క్రీన్లలో టికెట్స్ బుక్ చేసుకోండి.
Also Read : ఇండియాలో 'అవతార్ 2'ది రెండో స్థానమే - ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?