Aryan Khan-Ananya WhatsApp Chats: ఆర్యన్- అనన్యా మధ్య జరిగిన వాట్సాప్ ఛాట్ లీక్.. ఈ మెసేజ్‌లు చదివారా?
ఆర్యన్ ఖాన్, అనన్యా పాండే మధ్య డ్రగ్స్ విషయంపై జరిగిన వాట్సాప్ ఛాటింగ్ నెట్లో లీకైంది.
ముంబయి డ్రగ్స్ కేసులో కీలక ఆధారాలను సేకరించే పనిలో ఎన్‌సీబీ నిమగ్నమైంది. ఇప్పటికే షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే మధ్య జరిగిన వాట్సాప్ ఛాట్‌ను ఎన్‌సీబీ సంపాదించింది. అయితే ఇందులో ఇరువురి మధ్య డ్రగ్స్ గురించి చర్చ జరిగినట్లు ఇప్పటికే ఎన్‌సీబీ తెలిపింది. తాజాగా ఈ వాట్సాప్ ఛాట్ నెట్లో చక్కర్లు కొడుతోంది.
లీకైన ఛాట్..
ఈ ఛాట్ ప్రకారం ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ అందేందుకు అనన్యా పాండే సహాయం చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్ డీలర్ నంబర్లను అనన్యా.. ఆర్యన్ ఖాన్‌కు పంపినట్లు ఉంది. ఈ విషయంపైనే అనన్యా పాండేకు ఎన్‌సీబీ అధికారులు సమన్లు జారీ చేసి ప్రశ్నించారు. అయితే అనన్యా పాండే సమాధానాలకు ఎన్‌సీబీ అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. ఇందుకోసమే ఎప్పుడు కావాలన్న ఆమెను ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేశారు.
2 ఏళ్ల కిందట జరిగిన ఈ ఛాటింగ్‌పై ఎన్‌సీబీ అధికారులు దృష్టి సారించారు. అయితే తాను ఎప్పుడూ డ్రగ్స్ వినియోగించలేదని, ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ అందేలా సాయం చేయలేదని అనన్యా అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.
అనన్యా పాండేకు చెందిన పాత, కొత్త మొబైల్స్‌ను ఎన్‌సీబీ స్వాధీనం చేసుకుంది. ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ముంబయి ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. షారుక్ ఖాన్ ఇటీవల జైలుకు వచ్చి ఆర్యన్ ఖాన్‌ను కలిశారు. ఆర్యన్ ఖాన్ సోదరి సుహానాకు అనన్యా పాండే మంచి స్నేహితురాలు.
ఇదీ కేసు..
ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు.
విచారణలో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది.
Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?