Narappa Release : నారప్ప - వసూళ్ళలో వాటా వద్దప్పా అంటోన్న అమెజాన్
'నారప్ప' సినిమాను వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 13న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) పుట్టిన రోజు. ఆ రోజు వెంకీ, దగ్గుబాటి అభిమానులకు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ బహుమతి రెడీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో 'నారప్ప' సినిమాను థియేటర్లలో (Narappa Theatrical Release) విడుదల చేయనుంది. ఈ విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే...
ఓటీటీ నుంచి థియేటర్లకు...
'నారప్ప' సరికొత్త రికార్డు!
తెలుగునాట ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. 'పోకిరి', 'జల్సా', 'చెన్నకేశవ రెడ్డి' తదితర సినిమాలు రీ రిలీజులోనూ రికార్డ్ వసూళ్లు సాధించాయి. అయితే... ఆ సినిమాలకు, 'నారప్ప' సినిమాకు ఓ డిఫరెన్స్ ఉంది.
ఇంతకు ముందు థియేటర్లలో విడుదలైన సినిమాలను మళ్ళీ విడుదల చేశారు. ఈ 'నారప్ప' అలా కాదు... దీనిని నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. కరోనా మహమ్మారి కారణంగా కొన్ని రోజులు థియేటర్లు మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వెంకటేష్ బర్త్ డే కానుకగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. బహుశా... ఓటీటీలో విడుదలైన తర్వాత థియేటర్లలోకి వస్తున్న తొలి సినిమా ఇదే. డిసెంబర్ 13న... ఒక్కటంటే ఒక్క రోజే 'నారప్ప'ను థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
వసూళ్ళలో మాకు వాటా వద్దు!
'నారప్ప' వసూళ్ళను ఛారిటీకి ఇచ్చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి నిర్మాతలకు మద్దతు లభించింది. సినిమా ఎక్స్‌క్లూజివ్ రైట్స్‌ను ప్రైమ్ వీడియోకి ఇచ్చేశారు. రీ రిలీజ్ విషయం చెప్పగా... వసూళ్ళలో తమకు షేర్ అవసరం లేదని చెప్పారని వెంకటేష్ సోదరుడు, చిత్ర నిర్మాతలలో ఒకరైన డి. సురేష్ బాబు తెలిపారు. 'నారప్ప'తో పాటు వెంకటేష్ హిట్ సినిమాల్లో సాంగ్స్ కొన్ని యాడ్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. సో... వెంకటేష్ అభిమానులకు నోస్టాల్జియా మూమెంట్స్ అందించడానికి రెడీ అయ్యారు.
Also Read : 'పఠాన్'లో బేషరమ్ రంగ్ - బికినీలో దీపిక గ్లామర్ పసంద్
ఇంతకు ముందు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో వెంకటేష్‌ను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల 'నారప్ప'కు దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియమణి కథానాయికగా నటించారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ పతాకాలపై డి. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను, అమెజాన్ ప్రైమ్ వీడియో సినిమాను నిర్మించాయి. మణిశర్మ సంగీతం అందించారు.
కొత్త సినిమాలు ప్రకటించడం లేదు!
సాధారణంగా హీరోల పుట్టినరోజు వస్తే... త్వరలో వాళ్ళు నటించబోయే సినిమా వివరాలు వెల్లడించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే... ఈసారి వెంకటేష్ బర్త్ డే సందర్భంగా అటువంటి ప్రకటనలు ఏవీ ఉండవని సురేష్ బాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో వెంకటేష్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నామని, త్వరలో దాని వివరాలు వెల్లడిస్తామని... ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ సినిమా చేస్తామని చెప్పారు. ఈ ఏడాది వేసవిలో 'ఎఫ్ 3'తో సందడి చేసిన వెంకటేష్... ఆ తర్వాత 'ఓరి దేవుడా'లో అతిథి పాత్రలో సందడి చేశారు.
Also Read : జనవరి నుంచి నాన్ స్టాప్‌గా - మహేష్ ఫ్యాన్స్ ఇది విన్నారా?