(Source: ECI/ABP News/ABP Majha)
Alluri Movie Trailer : ఐదేళ్లకు ప్రభుత్వాలే మారతాయి, రాజకీయ నాయకులు మారారా? - శ్రీ విష్ణు మాస్, 'అల్లూరి' ట్రైలర్
శ్రీవిష్ణు హీరోగాగా నటించిన 'అల్లూరి' సినిమా ట్రైలర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.
శ్రీ విష్ణు (Sree Vishnu) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అల్లూరి' (Alluri Telugu Movie 2022). నిజాయితీకి మారు పేరు... అనేది ఉపశీర్షిక. ఇదొక ఫిక్షనల్ పోలీస్ ఆఫీసర్ బయోపిక్. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేడు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
'అల్లూరి' ట్రైలర్ (Alluri Movie Trailer) విషయానికి వస్తే... 'జీవితంలో ఏదైనా సాధించదలుచుకున్న వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకుంటారు. లక్ష్యం పెట్టుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు. లక్ష్యం సాధించడం కూడా పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. కానీ, ఆ లక్ష్యం కోసం జరిపే పోరాటం ఉంది చూశావా? అది అద్భుతం'' అని తనికెళ్ళ భరణి చెప్పే మాటలతో ట్రైలర్ ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా హీరో శ్రీ విష్ణు కనిపించారు.
పోలీస్ అధికారులకు గూండాల నుంచి బెదిరింపులు, కొంత మంది రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు వంటి అంశాలను ట్రైలర్‌లో చూపించారు. 'ఇది రియల్ లైఫ్. ఇక్కడ ఎవరూ విలన్స్ ఉండరు. కానీ, ఇక్కడ హీరో మాత్రం పోలీస్' అని శ్రీ విష్ణు చెప్పే డైలాగ్ బావుంది. ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ లైఫ్... అన్నిటినీ చూపించారు.
'ప్రభుత్వాలే ఐదేళ్లకు ఒక్కసారి మారతాయి. ఆ ప్రభుత్వంలో పనిచేసే మీరు (ఒక రాజకీయ నేతను ఉద్దేశించి) మారారా? మారతారు. మారానని మొండికేస్తే... మేం (పోలీసులు) మార్చాల్సి వస్తుంది', 'పోలీస్ అంటే ఒక వ్యక్తి కాదు సార్... పోలీస్ అంటే ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే ఇంకొక పోలీస్ ఆఫీసర్ వస్తాడు సార్. అతనూ చనిపోతే మళ్ళీ పోలీస్ ఆఫీసరే వస్తాడు సార్' అని హీరో చెప్పే డైలాగులు హీరోయిజాన్ని ఎలివేట్ చేశారు. రాజకీయ నాయకుడికి ఎదురు వెళ్లడం వల్ల హీరోకు సమస్యలకు ఎదురైనట్లు కూడా చూపించారు.
'అల్లూరి' ట్రైలర్ చూడండి :
Also Read : 'శాకిని డాకిని' రివ్యూ : రెజీనా, నివేదా థామస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకుడు. ఈ సినిమాలో నిజాయతీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజు పాత్రలో శ్రీ విష్ణు కనిపించనున్నారు.
శ్రీ విష్ణు సరసన కయ్యదు లోహర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సుమన్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృథ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, 'వెన్నెల' రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రాజ్ తోట, కూర్పు : ధర్మేంద్ర కాకరాల, కళ : విఠల్, ఫైట్స్ : రామ్ క్రిషన్, సాహిత్యం : రాంబాబు గోసాల, సమర్పణ : బెక్కెం బబిత, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : నాగార్జున వడ్డే, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ ('ఫిదా' ఫేమ్).