Saakini Daakini Review - 'శాకిని డాకిని' రివ్యూ : రెజీనా, నివేదా థామస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Saakini Daakini Telugu Movie Review : రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఫిల్మ్ 'శాకిని డాకిని'. కొరియన్ ఫిల్మ్ 'మిడ్‌నైట్ రన్నర్స్'కు ఇండియన్ అడాప్షన్ ఇది.
సుధీర్ వర్మ
రెజీనా, నివేదా థామస్, 30 ఇయర్స్ పృథ్వీ తదితరులు
సినిమా రివ్యూ : శాకిని డాకిని
రేటింగ్ : 2/5
నటీనటులు : రెజీనా, నివేదా థామస్, భానుచందర్, 30 ఇయర్స్ పృథ్వీ, కబీర్ దుహన్ సింగ్, అమిత్, రవి వర్మ, ఆరుషి వర్మ తదితరులు
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే , డైలాగ్స్: అక్షయ్ పూల్లా
సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ప్రసాద్
సంగీతం: మైకీ మెక్‌క్లియరీ, నరేష్ కుమారన్
నిర్మాతలు : డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్‌వూ థామస్ కిమ్
దర్శకత్వం : సుధీర్ వర్మ
విడుదల తేదీ: సెప్టెంబర్ 16, 2022
కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'ను తెలుగులో 'ఓ బేబీ'గా రీమేక్ చేసి నిర్మాతలు డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్‌వూ థామస్ కిమ్ విజయం అందుకున్నారు. మరో కొరియన్ సినిమా 'మిడ్‌నైట్ రన్నర్స్'ను 'శాకిని డాకిని' (Saakini Daakini Movie )గా రీమేక్ చేశారు. కొరియన్‌లో ఇద్దరు హీరోల సినిమాగా తీస్తే... తెలుగులో హీరోయిన్లతో తీశారు. మెయిన్ లీడ్స్ జండర్ స్వైప్ చేశారు. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Saakini Daakini Story) : దామిని (రెజీనా)కు అమెరికా వెళ్లి చదువుకోవాలని కోరిక. అయితే... ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్ ఆఫీసర్లు. దాంతో ఆమెను పోలీస్ చేయాలనుకుంటారు. పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో దామినికి శాలిని (నివేదా థామస్) పరిచయం అవుతుంది. మొదట్లో ఇద్దరి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పు అన్నట్లు ఉంటుంది. ఒకే రూమ్‌లో ఉన్నప్పటికీ... ఏమాత్రం సఖ్యత ఉండదు. ఆ తర్వాత స్నేహం మొదలవుతుంది. ఒక రోజు పబ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా... ఒక అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేయడం చూస్తారు. ఆ అమ్మాయిని కాపాడటం కోసం శాలిని, దామిని ఎటువంటి సాహసాలు చేశారు? అమ్మాయి కిడ్నాప్ వెనుక ఎవరు ఉన్నారు? చివరకు, ఏం తెలుసుకున్నారు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ (Saakini Daakini Review) : కొరియన్ సినిమా కథేంటి? తెలుగు కోసం ఎటువంటి మార్పులు చేశారు? అనేది పక్కన పెడితే... ఈ కథ కోసం కొరియా వరకూ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనేది అర్థం కాదు. 'ఓ బేబీ' తరహాలో కథలో కొత్త పాయింట్ ఏమైనా ఉందా? అని ఆలోచిస్తే ఏమీ కనిపించదు. అమ్మాయిల కిడ్నాప్, అక్రమ రవాణా వంటి కథాంశాలతో భారతీయ తెరపై కొన్ని చిత్రాలు వచ్చాయి. బహుశా... పతాక సన్నివేశాల్లో చూపించిన పాయింట్ (ఫిమేల్ ఎగ్ హార్వెస్టింగ్) పాయింట్ రైట్స్ తీసుకుని ఉండొచ్చు.
పరిచయమైన కొత్తలో ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు, ఆ తర్వాత ఒక్కటి కావడం వంటివి రొటీన్ అయినప్పటికీ... మధ్య మధ్యలో '30 ఇయర్స్' పృథ్వీ చిన్నగా నవ్వించడంతో పర్వాలేదనిపిస్తుంది. అయితే... ఏదో మిస్ అయిన ఫీలింగ్. చివరకు, ఇంటర్వెల్ ముందు అసలు కథలోకి వెళ్ళమనుకుంటే... ఆ తర్వాత కూడా ఎటువంటి థ్రిల్ కలిగించకుండా ముందుకు సాగుతుంది. పతాక సన్నివేశాలకు ముందు కథలో కాస్త వేగం పెరుగుతుంది.
'శాకిని డాకిని' విడుదలకు ముందు దర్శకుడు సుధీర్ వర్మకు, చిత్ర నిర్మాతల్లో ఒకరైన సునితా తాటికి మధ్య మనస్పర్థలు వచ్చాయని... మరో దర్శకుడు ఆనంద్ రంగా కొన్ని సన్నివేశాలు తీశారని వార్తలు వచ్చాయి. అయితే, రవితేజ 'రావణాసుర' సినిమాతో బిజీగా ఉండటంతో ఆయన అనుమతి తీసుకుని వేరొకరితో సన్నివేశాలు తీశామని నిర్మాత తెలిపారు. సినిమా అంతా చూశాక... క్లైమాక్స్ తప్ప మిగతా సినిమా మరొకరు తీశారా? అనే సందేహం కలుగుతుంది. సుధీర్ వర్మ మార్క్ చాలా తక్కువ సన్నివేశాల్లో కనిపించింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కూడా సోసోగా ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారు? : రెజీనా, నివేదా థామస్... ఇద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. రెగ్యులర్ టిపికల్ హీరోయిన్ తరహా రోల్స్ కాదు కనుక... కొంచెం కొత్తగా కనిపిస్తారు. పతాక సన్నివేశాల్లో, ప్రీ క్లైమాక్స్‌లో యాక్షన్ ఎపిసోడ్‌లో ఫైట్స్ బాగా చేశారు. నివేదా థామస్ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడానికి కష్టపడ్డారు. కానీ, కుదరలేదు. భానుచందర్‌ది సీరియస్ రోల్. పాత్ర పరిధి మేరకు ఆయన చక్కగా చేశారు. హాస్య నటుల్లో '30 ఇయర్స్' పృథ్వీ సీన్స్ కొంత నవ్వించాయి. రఘుబాబు, 'చమ్మక్' చంద్ర, సుదర్శన్, ఆర్జే హేమంత్ తదితరులకు నవ్వించే అవకాశం లభించలేదు. వాళ్లకు సరైన వినోదాత్మక సన్నివేశాలు పడలేదు. విలన్‌గా కబీర్ దుహాన్ సింగ్, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అమిత్ కనిపించారు. రవివర్మ రెండు సీన్స్ చేశారు.
ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'శాకిని డాకిని' కథాంశం బావుంది. కానీ, కథను తీసిన విధానం ఆకట్టుకునేలా లేదు. కామెడీ ఓకే. కానీ, అది కథను ఆసక్తిగా కూర్చుని చూసేలా లేదు. స్క్రీన్ ముందున్న ప్రేక్షకుడు ఎమోషనల్‌గా ఫీలయ్యేలా చేయడంలో 'శాకిని డాకిని' టీమ్ ఫెయిల్ అయ్యింది. అక్కడక్కడా కాస్త నవ్వించే కామెడీ, చివర్లో ఆసక్తి కలిగించే క్లైమాక్స్ మినహా సినిమాలో పెద్దగా ఏమీ లేదు. ఒక టైమ్‌లో ప్రేక్షకుడి సహనాన్ని కూడా పరీక్షిస్తుంది. సినిమాలో నో థ్రిల్స్... జస్ట్ అక్కడక్కడా కామెడీ ఉందంతే!
Also Read : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రివ్యూ: ఆ అమ్మాయి కథ ఆకట్టుకుందా?