Allu Arjun: నేనెందుకూ పనికి రానని ఆయన ఫీలింగ్ - బన్నీ కామెంట్స్ వైరల్!
తనకు 16 ఏళ్లు వచ్చేవరకు తాతయ్య, నానమ్మలతో ఉన్నానని.. తాతయ్య చనిపోయాక రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చిందని తెలిపారు బన్నీ.
దివంగత అల్లు రామలింగయ్య(Allu Ramalingaiah) శత జయంతి ఉత్సవాలు గ్రాండ్ గా నిర్వహించారు. ఆయన గుర్తుగా అల్లు ఫ్యామిలీ ఓ స్టూడియోను నిర్మించింది. అదే అల్లు స్టూడియోస్. అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య 100వ పుట్టినరోజు సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేతుల మీదుగా ఈ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు. అలానే అల్లు రామలింగయ్య పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గెస్ట్ గా వచ్చారు.
ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్(Allu Arjun) తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. తనకు 16 ఏళ్లు వచ్చేవరకు తాతయ్య, నానమ్మలతో ఉన్నానని.. తాతయ్య చనిపోయాక రూ.10 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చిందని తెలిపారు. ఆ డబ్బు తనకు మాత్రమే వచ్చిందని.. అలా ఎందుకు చేశారా..? అని భీమా కట్టిన సంవత్సరం చెక్ చేస్తే.. ఆయన డబ్బు జమ చేయడం మొదలుపెట్టిన సమయానికి తను నాల్గో తరగతి చదువుతున్నట్లు అల్లు అర్జున్ చెప్పారు.
వీడు జీవితంలో ఎందుకూ పనికి రాడు. 18 ఏళ్లు వచ్చాక ఈ పది లక్షలు ఏదొక రూపంలో ఉపయోగపడతాయని ఆయన భావించి ఈ డబ్బు తనకోసమే జమ చేశారని సరదాగా చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. ఆయన దృష్టిలో ఎందుకూ పనికి రాని నేను.. ఈరోజు ఈ స్థానంలో ఉన్నందుకు సంతోషంగా ఉందని.. ఈ ఎదుగుదలను ఆయన కూడా చూసి బాగుండేదని తెలిపారు.
అల్లు స్టూడియోస్ గురించి బన్నీ మాట్లాడుతూ.. 'అల్లు అరవింద్ గారికి ప్రొడక్షన్ హౌస్ ఉంది. చాలా ల్యాండ్ ఉంటుంది. స్టూడియోస్ పెట్టడం విషయం ఏం కాదని మీరు అనుకోవచ్చు. కానీ మాకేదో ఈ స్టూడియో కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందని పెట్టలేదు. ఈ స్టూడియో పెట్టాలనేది మా తాతయ్య గారి కోరిక' అని చెప్పారు అల్లు అర్జున్. మనందరికీ ఓ స్టూడియో ఉంటే బాగుండేదని ఆయన అంటుండేవారని.. అందుకే ఆయన జ్ఞాపకార్థం ఈ స్టూడియోను నిర్మించినట్లు చెప్పారు.
ఇక స్టూడియోస్ విషయానికొస్తే.. గండిపేట్‌లో 10 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో.. అన్ని సధుపాయాలు ఈ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయి. సినిమాకి సంబంధించిన అన్ని పనులు ఇక్కడే చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఇక ఈ స్టూడియోస్ లో ముందుగా 'పుష్ప2' షూటింగ్ ను జరిపించడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా కొన్ని సెట్స్ ను నిర్మించనున్నారు. ఆ తరువాత సినిమాలో ఎక్కువ భాగం అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంటుంది. మరి ఈసారి మారేడుమిల్లి వెళ్తారో లేక ఇతర అడవి లొకేషన్స్ ఏమైనా చూస్తారో తెలియాల్సివుంది. విదేశాల్లో కూడా అటవీ లొకేషన్స్ చూస్తున్నారని టాక్. ఇంకెప్పుడు ఫైనల్ చేస్తారో చూడాలి!