డిసెంబర్ 2 న 'హిట్ 2', హీరో నాని గురించి అలా చెప్పిన అడివి శేష్ ?
ప్రస్తుతం హిట్ 2 సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మేకర్స్. అందులో భాగంగా ఆదివారం వైజాగ్ లో సందడి చేసింది మూవీ టీమ్.
తెలుగు ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో పైకొచ్చిన హీరోల్లో అడివి శేష్ ఒకరు. కెరీర్ మొదట్లో కాస్త తడబడినా తర్వాత విభిన్న కథలతో వరుసగా హిట్లు సాధిస్తూ ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నారు. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటించిన సినిమా 'హిట్ కేస్ 2'. ఈ సినిమా లో శేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మేకర్స్. అందులో భాగంగా ఆదివారం వైజాగ్ లో సందడి చేసింది మూవీ టీమ్.
వైజాగ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి :
ఇటీవల వైజాగ్ లో జరిగిన ప్రమోషన్స్ కార్యక్రమంలో హీరో అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిట్ 2 సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందన్నారు. ఎప్పుడూ సరదాగా ఉండే పోలీస్ అధికారికి సవాల్ గా నిలిచిన హత్య కేసు ను ఎలా ఛేదించాడు అనేది హిట్ 2 సినిమా కథ అని అన్నారు. సినిమా మొత్తం వైజాగ్ నేపథ్యంలో జరుగుతుందని చెప్పిన ఆయన వైజాగ్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. తాను చిన్నప్పటి నుంచీ వైజాగ్ లో పెరిగానని, ఈ నగరంతో మంచి అనుభూతి ఏర్పడిందన్నారు. సినిమాలో కూడా వైజాగ్ యాసతోనే హీరో మాట్లాడతాడని తెలిపారు. హీరో నాని తనకు మంచి మిత్రుడని, తన ప్రతీ సినిమాకు నాని సపోర్ట్ చేస్తూ వస్తున్నాడని అన్నారు. ఈ సినిమాకు నాని నిర్మాతగా చేయడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు శేష్.
అన్ స్టాపబుల్ మంచి అనుభూతినిచ్చింది :
హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తోన్న 'అన్ స్టాపబుల్' షో లో హీరో శర్వానంద్ తో కలసి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు అడివి శేష్. నిజానికి బాలయ్య కోపంగా ఉంటారేమో అని అనుకున్నానని కానీ ఆయన తమతో చాలా సరదాగా మాట్లాడారని అన్నారు. షో లో బాలయ్య ఎంతో ఫన్ క్రియేట్ చేశారని, ఆ కార్యక్రమం లో పాల్గొనటం గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పారు.
ఇదే కార్యక్రమంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం తనకు ఆనందంగా ఉందని చెప్పింది. వైజాగ్ వాతావరణం తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది. డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. సినిమాను వైజాగ్ లో 70 శాతం షూటింగ్ మూడు నెలలు పాటు తీసామని, ఇక్కడ ప్రజలు ఆత్మీయంగా చూసుకున్నారని పేర్కొన్నారు. సినిమాలో హీరో వైజాగ్ యాస మాట్లాడాలి కాబట్టి స్థానిక యాస పై పరిశీలన చేశామని అన్నారు. హిట్ 2 సినిమా డిసెంబర్ 2 న విడుదల కాబోతోందని, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
గతంలో వచ్చిన 'హిట్' సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే ఇదే కోవలో వస్తోన్న హిట్ 2 సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ అడివి శేష్ హీరో కాబట్టి మరింత ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందా లేదో చూడాలి అంటే డిసెంబర్ 2 వరకూ ఆగాల్సిందే.