Sunny Deol: ఆ సీన్లు నచ్చలేదు - ‘యానిమల్’ మూవీపై బాబీడియోల్ అన్న సన్నీ డియోల్ షాకింగ్ కామెంట్స్
Sunny Deol: ‘యానిమల్‘ సినిమాపై బాబీ డియోల్ సోదరుడు సన్నీ డియోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో బాబీ నటన అద్భుతంగా ఉన్నా, కొన్ని సన్నివేశాలు మాత్రం తనకు నచ్చలేదని చెప్పారు.
Sunny Deol About Animal Movie: దేశ వ్యాప్తంగా ‘యానిమల్‘ సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఎవరి నోట విన్నా ఇప్పుడు ఇదే సినిమా గురించి చర్చ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించారు. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పలువురు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే ‘యానిమల్’ సినిమాపై బాబీ డియోల్ సోదరుడు సన్నీ డియోల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘యానిమల్’ చిత్రంలో బాబీ నటనపై సన్నీ ప్రశంసలు
‘యానిమల్’ సినిమాలో బాబీ డియోల్ అబ్రార్ అనే నెగెటివ్ పాత్రలో కనిపించారు. ఆయన పాత్ర నిడివి తక్కువే అయినా, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. తాజాగా ఈ సినిమాలో బాబీ డియోల్ నటన అద్భుతంగా ఉందని ఆయన సోదరుడు సన్నీ డియోల్ ప్రశంసించారు. అదే సమయంలో ఈ చిత్రంలో తనకు నచ్చని సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయని వెల్లడించారు. “’యానిమల్’ సినిమాలో బాబీ నటన పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమాను తాజాగా చూశాను. చాలా బాగా నచ్చింది. ఇదో అద్భుతమైన సినిమా. నా సొంత సినిమాలతో సహా చాలా సినిమాల్లో నాకు నచ్చని కొన్ని సన్నివేశాలు, అంశాలు ఉంటాయి. అలాగే ఈ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు. ఒక వ్యక్తిగా తనకు నచ్చిన, నచ్చని విషయాలను వెల్లడించే స్వేచ్ఛనాకు ఉంది. సంగీతం చాలా బాగుంది. అన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేస్తుంది. బాబీ ఇప్పటి వరకు బాబీగా ఉన్నాడు. ఇకపై బాబీ.. లార్డ్ బాబీగా మారిపోయాడు” అని సన్నీ డియోల్ వెల్లడించారు.
సందీప్ రెడ్డిపై బాబీ ప్రశంసలు
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ డియోల్ ‘యానిమల్’ సినిమాతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై ప్రశంసలు కురిపించారు. ''సందీప్ రెడ్డి వంగా చాలా టాలెంట్ ఉన్న దర్శకుడు. ఆయనకు చేసే పని పట్ల చాలా విశ్వాసం ఉంటుంది. ఆయన నా సినిమాలు చూశారు. నా బలం, బలహీనతలు తనకు తెలుసు. నటీనటులను ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు మంచి కమాండింగ్ ఉంది. ఈ సినిమాతో తను నా కెరీర్ ను మార్చాడు. ఈ మూవీ నా కెరీర్ లో మైల్ స్టోన్” అని తెలిపారు.
రూ. 500 కోట్ల క్లబ్బులో అన్నదమ్ముల సినిమాలు
సన్నీ డియోల్, బాబీ డియోల్ అన్నదమ్ములు. ఈ ఏడాది వీరిద్దరు నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. సన్నీ డియోల్ ‘గదర్ 2’ రూ.500 కోట్లు వసూళు చేసింది. బాబీ డియోల్ నటించిన ‘యానిమల్’ కూడా తాజా రూ.500 కోట్లు సాధించింది. సందీప్ రెడ్డి, రణబీర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల అయ్యింది. ఇందులో త్రిప్తి దిమ్రీ, శక్తి కపూర్, సౌరభ్ సచ్‌దేవా ఇతర పాత్రలు పోషించారు.
Read Also: హ్యాపీ బర్త్ డే అడివి శేష్ - ‘సినిమా’ అతడి గుండె చప్పుడు, అమెరికా వదిలేసి అందరివాడయ్యాడు!