RIP Sidharth Shukla: బొమ్మరిల్లు సిద్ధార్థ్ చనిపోయాడంటూ ప్రచారం.. కావాలనే చేస్తున్నారంటూ ఆవేదన
హీరో సిద్దార్థ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పదే పదే ఎందుకిలా చేస్తున్నారు, ఎందుకు తనను ద్వేషిస్తున్నారని కన్నీళ్లు పెట్టుకునేంత పని చేశాడు. ఇంతకీ ఏమైందంటే...
రాను రాను సోషల్ మీడియా వల్స సెలబ్రెటీలకు సమస్యలు పెరిగిపోతున్నాయి. అభిమానులకు చేరువలో ఉంచడం అనే మాట పక్కనపెడితే కొన్నిసార్లు తమకు తెలియకుండా తమపై వచ్చిన వార్తలు చూసి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోతున్నారు. కొన్నిసార్లు నెటిజన్లు అవగాహనా లోపంతో తప్పుడు సమాచారాలు పోస్ట్ చేయడం, కొందరు ప్రముఖులను టార్గెట్ చేసి ట్రోల్ చేయడం జరుగుతోంది. హీరో సిద్దార్థ్ విషయంలో మరోసారి ఇదే రిపీట్ అయింది.
Targetted hate and harassment. What have we been reduced to? pic.twitter.com/61rgN88khF
— Siddharth (@Actor_Siddharth) September 2, 2021
తెలుగు, తమిళం ప్రేక్షకులను మెప్పించిన సిద్దార్థ్ చనిపోయాడంటూ గతంలో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఇవి చూసి హీరో అధికారికంగా స్పందించాల్సి వచ్చింది కూడా. ఎందుకు తనపై కావాలనే ద్వేషాన్ని చిమ్ముతున్నారంటూ ఆవేదన చెందాడు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి వచ్చింది.
బాలీవుడ్ నటుడు, ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్ -13’ విజేత సిద్దార్థ్ శుక్లా గురువారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సిద్దార్థ్ శుక్లా మృతికి సంతాపంగా పలువురు సెలబ్రెటీలు, నెటిజన్లు RIP సందేశాన్ని పోస్ట్ చేశారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం సిద్దార్థ్ శుక్లా ఫొటోకి బదులు సిద్దార్థ్ ఫొటోషేర్ చేసి RIP సందేశాలు పెట్టారు. ‘రిప్ సిద్దార్థ్’ అనే ఫొటో నెట్టింట వైరల్ అవడంతో ఇది గమనించిన హీరో సిద్దార్థ్.. ‘నన్ను కావాలనే ఇలా వేధిస్తున్నారు. ద్వేషిస్తున్నారు’ అంటూ భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టాడు.
‘బాయ్స్’, ‘బొమ్మరిల్లు’,‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరనై సిద్దార్థ్ కొన్నాళ్ల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలతో పలకరిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో హిట్టందుకోలేకపోతున్నాడు. ఇక ‘RX 100’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘మహాసముద్రం’ దసరా కానుకగా అక్టోబరు 14న థియేటర్లలో విడుదలకానుంది. శర్వానంద్ -సిద్ధార్థ్ నటిస్తున్న ఈ మూవీలో అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవికి సంబంధించి రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ గ్లిమ్స్ భలే ఆసక్తిగా ఉంది. శర్వానంద్ - సిద్ధార్థ్ ఇద్దరూ ఒకరికొకరు తుపాకులు గురిపెట్టుకొని ఉండగా.. హీరోయిన్ అదితి రావు హైదరి అలల మధ్య ఎంజాయ్ చేస్తోంది.
లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన మహాసముద్రం మూవీకి సంబంధించి ఇప్పటివరకూ విడుదలైన పోస్టర్స్, 'హే రంభా' సాంగ్ బాగానే ఉందనిపించింది. AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమాకి చైతన్య భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్కీ లక పాత్రలు పోషిస్తున్నారు.