తెలుగులో సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని అడిగారు - స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సిద్ధార్థ్!
సిద్ధార్థ్ 'చిన్నా' సినిమా ఈ వారం విడుదల కాబోతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'ఓయ్' వంటి సినిమాలతో టాలీవుడ్ లో ఒక్కప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు సిద్ధార్థ్. చాలా తక్కువ సమయంలోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని తెలుగులో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి సిద్ధార్థ్ తాజాగా ఓ వేదికపై ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం తెలుగులో తన సినిమా కొనేవారే కరువయ్యారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది. అప్పట్లో అగ్ర హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్ధార్థ్ కి కొంతకాలం తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి.
దాంతో తెలుగు నుంచి తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయాడు. చాలా కాలం వరకు అక్కడే సినిమాలు చేశాడు.దాంతో తెలుగులో సిద్ధార్థ్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ తెలుగులో సహాయ నటుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. రీసెంట్ గానే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తూ వాటిని తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు. అలా ఇటీవల 'టక్కర్' అనే సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే ఈమధ్య తమిళంలో సిద్ధార్థ్ 'చిత్త' అనే సినిమా చేశాడు. ఈ మూవీని తమిళంతో పాటు కన్నడ, మలయాళ రాష్ట్రాల్లో కూడా రిలీజ్ చేశాడు.
Reason why Telugu dubbed version of #Chithha didn’t release on Sep 28 in Telugu states. Sad state 😬
— Haricharan Pudipeddi (@pudiharicharan) October 3, 2023
pic.twitter.com/n0MKlhrhGX
అక్కడ సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రశంసలు అందుకోవడమే కాక ప్రతి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా ఇది అని విమర్శకులు సైతం ఈ చిత్రాన్ని కొనియాడారు. అయితే ఈ సినిమాని తెలుగులో కూడా అప్పుడే రిలీజ్ చేయాలని అనుకున్నా ఎవరు కొనడానికి ముందుకు రాకపోవడంతో కాస్త ఆలస్యంగా ఎట్టకేలకు ఈ వారం రిలీజ్ చేస్తున్నాడు. 'చిన్నా' అనే పేరుతో తెలుగులో విడుదల కాబోతున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యాడు.
"తమిళనాడులో రెడ్ జాయింట్ వాళ్లు సినిమా చూసి.. ఇలాంటి గొప్ప సినిమా చూడలేదని ఉదయనిధి నా సినిమాని కొన్నారు. కేరళలో నంబర్ వన్ నిర్మాతగా గోకులం గోపాలం గారు సినిమా చూసి కొన్నారు. కర్ణాటకలో కేజిఎఫ్ సినిమా నిర్మాతలు నా సినిమా చూసి ఇలాంటి సినిమా మేము చూడలేదని కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. కానీ తెలుగు విషయానికొస్తే ‘‘సిద్ధార్థ సినిమా ఎవరు చూస్తారు?’’ అని అడిగారు.
‘‘సిద్ధార్థ్ సినిమానా ఎవరు చూస్తారండి? ఎందుకు చూస్తారు? అని అడిగారు. నేను ఒక మంచి సినిమా చూస్తే ప్రేక్షకులు నా సినిమా కచ్చితంగా చూస్తారని నేను చెప్పాను. మళ్లీ చెప్తున్నా, ఇది సెప్టెంబర్ 28న రిలీజ్ కావలసిన సినిమా. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎందుకు చూస్తారు? ఎవరు చూడరు? అని చెప్పడంతో నాకు కరెక్ట్ గా థియేటర్లు దొరకలేదు. ఆ టైంలో నా దగ్గరికి వచ్చి నేను నీతో ఉన్నానని చెప్పి నా సినిమా డిస్ట్రిబ్యూట్ చేసింది ఏసియన్ సునీల్ గారు. ఈ సినిమా కంటే మంచి సినిమా నేను తీయలేను. మీకు సినిమాల మీద నమ్మకం ఉంటే, సినిమాలంటే ఇష్టం ఉంటే థియేటర్ కెళ్ళి ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసి సిద్ధార్థ సినిమా మేము తెలుగులో చూడము అని మీకు అనిపిస్తే ఇకనుంచి నేను ఇలాంటి ప్రెస్ మీట్ లో పెట్టను. నేను ఇక్కడికి రాను" అంటూ స్టేజ్ పైనే సిద్ధార్థ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Also Read : 'హాయ్ నాన్న' నుంచి సెకండ్ సింగిల్ - 'గాజు బొమ్మ' సాంగ్ ఎప్పుడంటే?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial