(Source: ECI/ABP News/ABP Majha)
Nani: నిజంగా షాకయ్యా.. హేమ కమిటీ రిపోర్టుపై నాని కీలక వ్యాఖ్యలు
సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యల గురించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై నటుడు నాని స్పందించారు. ఈ నివేదికలోని అంశాలు తనను షాక్ కు గురి చేశాయన్నారు.
Actor Nani On Hema Committee Report: మలయాళీ సినిమా పరిశ్రమలో మహిళా నటులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై నేచురల్ స్టార్ నాని స్పందించారు. నివేదికలోని అంశాలు చూసి తాను షాకైనట్లు వెల్లడించారు. సినిమా పరిశ్రమలో ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయా? అని ఆశ్చర్యం కలిగిందన్నారు. సినీ ఇండస్ట్రీలో మహిళలు రాణించాలంటే వాళ్లకు ఇబ్బందులు ఎదురుకాకూడదన్నారు.
సినిమా పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా?
జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు రిపోర్టు చదివితే తన హార్ట్ బ్రేక్ అయ్యిందని నాని ఆవేదన వ్యక్తం చేశారు. “జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు చదువుతుంటే చాలా బాధ కలిగింది. గుండె పగిలినట్లు అయ్యింది. నేను నటించిన సినిమా సెట్స్ లో ఇలాంటి సంఘటనలు జరగడం ఎక్కడా చూడలేదు. పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి జరగవని భావిస్తున్నాను. పెద్ద సినిమాల మేకర్స్ కు సినిమా ఎంత బాగా తెరకెక్కించాలి అనే విషయంలో తప్ప మిగతా విషయాలపై ఫోకస్ ఉండదు. అందుకే, నా సినిమా లోకేషన్స్ లో ఇలాంటి ఘటనలు జరగలేదు. కమిటీ రిపోర్టు చదివి ఇలా కూడా జరుగుతుందా? అనుకున్నాను. సినిమా పరిశ్రమలో ఎదగాలని చాలా మంది మహిళలు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు ఇండస్ట్రీలో మహిళల సంఖ్య బాగా పెరిగింది. వారు సినీ రంగంలో రాణించాలంటే అనుకూలమైన పరిస్థితులు ఉండాలే తప్ప, ఇబ్బందులు ఉండకూడదు”అని నాని అభిప్రాయపడ్డారు.
దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన హేమ కమిటీ రిపోర్టు
మలయాళీ సినిమా పరిశ్రమలో మహిళా నటులు ఎదుర్కొంటున్న రకరకాల ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ రీసెంట్ గా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో మహిళా నటులు ఎదుర్కొంటున్న సుమారు 17 రకాల ఇబ్బందుల గురించి వివరించారు. ఈ రిపోర్టులోకి కొన్ని అంశాలు రీసెంట్ గా బయటకు రావడంతో దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అవకాశాల పేరుతో చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు మహిళా నటులను ఎలా లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారో ఇందులో వివరించారు. కమిట్మెంట్ కు ఒప్పుకోని వారికి అవకాశాలు రాకుండా ఎలా చేస్తున్నారో? వారి మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటున్నారో వెల్లడించారు. ఈ నివేదికపై పలువురు సినీ ప్రముఖులు షాకయ్యారు. తనుశ్రీ దత్తా లాంటి వాళ్లు ఈ కమిటీ నివేదికతో పెద్దగా ఒరిగేదేమీ లేదన్నారు. బాధితులకు న్యాయం జరగకపోగా, వారి బాధలను మళ్లీ గుర్తు చేయడం ఇబ్బందిపెడతాయన్నారు.
బాధగా ఉందన్న నటుడు టొవినో థామస్
అటు మలయాళీ పరిశ్రమలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా పరిశ్రమలోనూ ఇలాంటి వేధింపులు ఉన్నాయని యువనటుడు టొవినో థామస్ అన్నారు. తమ ఇండస్ట్రీ గురించి ఇలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉందన్నారు. ఇండస్ట్రీలోని ప్రతి మహిళా ఇలాంటి సమస్య ఎదుర్కోవడం లేదన్నారు. అలాగని తాను వేధింపులకు పాల్పడే వారికి వత్తాసు పలుకుతున్నట్లు కాదన్నారు. మహిళలను వేధించే వారు ఎంతటి వారైనా తగిన శిక్షపడాలన్నారు.
Read Also: అదో పనికిరాని నివేదిక, హేమ కమిటీ రిపోర్టుపై బాలీవుడ్ బ్యూటీ తీవ్ర వ్యాఖ్యలు