Actor Jayaram: గొప్ప మనసు చాటుకున్న నటుడు జయరాం, 13 ఆవులను కోల్పోయిన యువ రైతుకు చేయూత
Actor Jayaram: నటుడు జయరాం యువకుల కన్నీళ్లు చూసి చలించిపోయారు. ఇంటికెళ్లి మరీ రూ. 5 లక్షలు ఆర్థికసాయం అందించారు.
Actor Jayaram Donates Money To Teen Farmer: కేరళ ఇడుక్కి జిల్లా వెల్లియామామట్ కు చెందిన యువకులు జార్జ్, మాథ్యూ గురించి అక్కడి వారికి పెద్దగా పరిచయం అవసరం లేదు. తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి గత మూడు సంవత్సరాలుగా 20 ఆవులు పెంచుతున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు డైయిరీ రంగంలో రాణిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న మంచి డెయిరీ ఫామ్ లలో వీరి ఫామ్ చాలా పాపులర్. పాలరంగంలో వీరు చేస్తున్న సేవకు గుర్తింపుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ బాల పాడిరైతు అవార్డును ప్రదానం చేసింది.
కలుషిత ఆహారం తిని 13 ఆవులు మృతి
తాజాగా కలుషిత ఆహారం తిని ఆవులు చనిపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 13 ఆవులు మృత్యువాత పడ్డాయి. కంటికి రెప్పలా పెంచుకున్న ఆవులు చనిపోవడంతో తల్లి, ఇద్దరు పిల్లలు దుఖంలో మునిగిపోయారు. వాటి గురించే ఆలోచిస్తూ, హాస్పిటల్ పాలయ్యారు. కుటుంబం రోడ్డున పడింది. వీరి గురించి సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ వార్తలు ప్రసారం అయ్యాయి. వారి దీనస్థితి గురించి కథనాలు ప్రచురించాయి.
యువ రైతులకు నటుడు జయరాం ఆర్థికసాయం
జార్జ్, మాథ్యూ కష్టాలకు పలువురు చలించిపోయారు. వారి ఇబ్బందులను తెలుసుకుని పలువురు మలయాళీ సినీ నటులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ప్రముఖ నటుడు జయరామ్ వారికి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేశారు. ఆయన స్వయంగా జార్జ్, మాథ్యూ ఇంటికి వెళ్లి రూ. 5 లక్షలు అందించారు. కష్టాల్లో ఉన్న తమను ఆదుకున్న జయరామ్ కు యువరైతులు ధన్యవాదాలు చెప్పారు. జయరామ్ తెలుగు సినిమా ప్రేక్షకులకు సైతం పరిచయమే. ‘అలవైకుంఠపురములో’ అల్లు అర్జున్ తండ్రిగా నటించారు. రీసెంట్ గా రవితేజ మూవీలోనూ నెగెటివ్ రోల్ పోషించారు.
ట్రైలర్ లాంచ్ కోసం పెట్టుకున్న డబ్బు సాయంగా అందజేత
జయరామ్ తో పాటు ‘సలార్’ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ రూ. 2 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించారు. మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి మరో లక్ష ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా జయరామ్ వెల్లడించారు. ఈ యువకులకు తాను అందించిన డబ్బు తన తర్వాత సినిమా ట్రైలర్ రిలీజ్ లాంఛ్ కోసం ఉపయోగించాలని భావించినట్లు చెప్పారు. కానీ, దానికంటే ఈ యువరైతులకు అందించడమే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అంతేకాదు, తాను కూడా గతంలో ఆవులు పెంచుకున్నట్లు చెప్పారు. అప్పట్లో కొన్ని కారణాలతో అవి చనిపోయాయన్నారు. అప్పుడు తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డారని చెప్పారు. ఇప్పుడు 13 ఆవులు చనిపోవడంతో జార్జ్, మాథ్యూ కుటుంబం ఎంతలా బాధపడుతుందో తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. అటు కేరళ ప్రభుత్వం కూడా ఈ యువ రైతులకు అండగా నిలిచింది. పశు సంవర్థకశాఖ, జలవనరుల శాఖ మంత్రులు సదరు యువకులు ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీమాతో కూడిన 5 ఆవులను వారికి అందిస్తామని చెప్పారు. అటు వారికి తక్షణసాయం కింద రూ. 50 వేలు అందించారు.
Read Also: దేవర ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‘ను మించి ఉంటుంది, కల్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు