Andhra Pradesh News: "జగన్ కోసం సిద్ధం" కార్యక్రమం ప్రారంభం- ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్న వైసీపీ
Telugu News: ఇంటింటికీ వెళ్లిన వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు వైసీపీ మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్‌పై చర్చిస్తారు. జగన్‌ను గెలిపించాలని ప్రచారం చేయనున్నారు.
Jagan Kosam Siddham : జగన్ కోసం సిద్దం" పేరుతో వైసీపీ చేపట్టిన కొత్త ప్రచారం ఇవాళ ప్రారంభమైంది. పోలింగ్ బూత్‌లో ఉన్న లబ్ధిదారులను నేరుగా వెళ్లి కలిసి వారికి ప్రభుత్వం నుంచి అందిన సాయం వివరిస్తూ మరోసారి జగన్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేయడమే దీని కార్యక్రమం ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా దీన్ని వైసీపీ కార్యకర్తలే ముందుకు తీసుకెళ్లబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మొదటి రోజు సుమారు 9 లక్షల మంది కార్యకర్తలు, క్యాంపెయినర్లు ప్రతి ఇంటికీ వెళ్లి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారని పార్టీ ప్రకటించింది. వివిధ పథకాల్లో లబ్ధి పొంది పార్టీకి సేవ చేస్తున్న వారిని స్టార్ కంపెయినర్లగా నియమించుకుంది వైసీపీ. వారి ద్వారా పార్టీ విధానాలు బూత్ స్థాయి ఓటర్ల వద్దకు తీసుకెళ్తోంది.
ఓ వైపు జగన్ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పుడు కార్యకర్తలను ఇంటింటికీ పంపిస్తున్నారు. ఇలా మూడు పద్దతుల్లో ఓటర్లను ఆకర్షించే పనిలో ఉంది వైసీపీ. జగన్ కోసం సిద్ధం అంటూ వీళ్లు 47వేల బూత్‌లలోని ఇంటింటికీ తిరుగుతారు. ప్రతి కుటుంబాన్ని కలుసుకుంటారు.
ఇలా ఇంటింటికీ వెళ్తూ గత ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆ కుటుంబానికి జరిగిన లబ్ధి, మళ్లీ గెలిపించుకుంటే చేకూరే ప్రయోజనాలను వారికి వివరిస్తారు. ఇంత లబ్ధిని ఇంటికే పంపిస్తున్న జగన్‌ను మరోసారి గెలిపించుకుందామని వారితో చెప్పిస్తారు. అందుకే ఇలా లబ్ధి పొందిన వారంతా వైసీపీ తరఫున ప్రచారం చేయించాలని ఆ పార్టీ వ్యూహం.
పార్టీ తరుఫన ప్రచారం చేసేందుకు లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని వైసీపీ చెబుతోంది. వారే ఇప్పుడు తమ పార్టీ విధానాలను వారికి జరిగిన లబ్ధిని వివరిస్తూ ఓట్లు అడబోతున్నారని ఇది దేశ రాజకీయ చరిత్రలోనే తొలిసారి అన్నట్టు వైసీపీ ప్రచారం చేసుకుంటోంది.
ఇంటింటికీ వెళ్లిన వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు వైసీపీ మేనిఫెస్టో నవరత్నాలు ప్లస్‌పై చర్చిస్తారు. అదే టైంలో ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కావనే ప్రచారాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా 2014 చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను, 2019లో జగన్ ఇచ్చిన మేనిఫెస్టోను కూడా పక్క పక్కనే పెట్టి తేడాను గుర్తించాలని చెప్పనున్నారు. ఇంత లబ్ధి చేసిన జగన్‌ను గెలిపించాలని వారికి రిక్వస్ట్ చేయనున్నారు.