(Source: ECI/ABP News/ABP Majha)
Jagan No Reviews : నియోజకవర్గ సమీక్షలు జగన్ ఎందుకు ఆపేశారు ? పార్టీలో సమస్యలు ఎక్కువయ్యాయా ?
కుప్పంతో ప్రారంభించిన నియోజకవర్గాల సమీక్షలను వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ రాజాంతో ఆపేశారు. ఇక నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని వైఎస్ఆర్‌సీపీ నేతలు చెప్పడం లేదు. ఆపేయడానికి కారణం ఏమిటి ?
Jagan No Reviews : ముఖ్యమంత్రి బిజీగా ఉన్న జగన్ మూడేళ్ల కాలంలో పార్టీపై పెద్దగా దృష్టి సారించలేకపోయారు. పార్టీ క్యాడర్‌తో ఆయనకు సంబంధాలు తగ్గిపోయాయి. పాదయాత్రలో ఉన్నప్పుడు.. విపక్షంలో ఉన్నప్పుడు నేరుగా కార్యకర్తలతో.. ద్వితీయ శ్రేణి నేతలతో సంబంధాలు ఉండేవి. కానీ సీఎం అయిన తర్వాత అధికార బాధ్యతల వల్ల ఎమ్మెల్యేలకే సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే ఇటీవల నియోజకవర్గాల సమీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. కుప్పంతో ప్రారంభించారు కూడా. కానీ తర్వాత రాజాం నియోజకవర్గానికి మాత్రం నిర్వహించి ఆపేశారు. మరో నియోజకవర్గ సమీక్ష ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెప్పడం లేదు.
ప్రతి నయోజకవర్గం నుంచి 50 మందితో సమావేశం కావాలనుకున్న జగన్ !
ప్రతి నియోజకవర్గం నుంచి యాభై మంది ముఖ్య నేతల్ని పిలిపించి జగన్ సమీక్ష నిర్వహించాలనుకున్నారు. కుప్పం నుంచి ప్రారంభించారు. తొలి సమీక్షలో కుప్పం నుంచి అభ్యర్థిగా భరత్‌ను ఖరారు చేశారు. గెలిపించుకుని తీసుకు వస్తే మంత్రిని చేస్తామన్నారు. తర్వాత రాజాం నియోజకవర్గంలోనూ సమీక్ష చేసి అక్కడి ఎమ్మెల్యే కంబాల జోగులును మంత్రిని చేస్తానంటూ సీఎం హామీ ఇచ్చారు. అంటే ఈసారి కూడా అభ్యర్థి కంబాల జోగులేనని దీంతో తేలిపోయిందని ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత సమీక్షలు నిలిచిపోయాయి. నెల దాటిపోయినా మరో నియోజకవర్గం సమీక్, చేయలేదు. నిజానికి అన్ని నియోజకవర్గాల నేతలతోనూ ఇలా సమావేశం కావడం సాధ్యం కాదు. ప్రతీ రోజూ ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి సమీక్ష పెట్టినా ఆరు నెలల పాటు నిర్విరామంగా నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నెలకు రెండే చేయడంతో ఇక చేయరేమో అన్న సందేహాలు వైఎస్ఆర్‌సీపీలో వినిపిస్తున్నాయి.
పార్టీలో సమస్యలు హైలెట్ అవుతున్నాయని వెనుకడుగు వేస్తున్నారా ?
కుప్పం, రాజాం నియోజకవర్గల నుంచి ఎంపిక చేసిన యాభై మంది కార్యకర్తలతో జగన్ సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో ఆయా నియోజకవర్గాల పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమయింది. నియోజకవర్గ సమీక్షలకు కూడా తమకు పిలుపునివ్వలేదని చాలా మంది నేతలు ఫీలయ్యారు. గ్రామానికి ఒక్కరికి కూడా పిలువలేని పరిస్థితుల్లో.. తమకు ప్రాధానయం దక్కడం లేదని పార్టీ కోసం కష్టపడిన వారు ఎక్కువ మంది ఫీలయ్యారు. ఈ కారణంగా సమీక్షల వల్ల అసలు ఉద్దేశం పక్కకు పోయి ... పార్టీ నేతల్లో హైకమాండ్ తమను నిర్లక్ష్యం చేస్తోందన్న అభిప్రాయం ఏర్పడటానికి కారణం అవుతోందని భావిస్తున్నారు. అందుకే సమీక్షల విషయంలో పునరాలోచన చేసినట్లుగా చెబుతున్నారు.
స్థానిక సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం!
ప్రస్తుతం సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు పెద్దగా జరగడం లేదు. అదే సమయంలో బిల్లులూ పెండింగ్‌లో ఉన్నాయి. పలు కార్యక్రమాల్లో మంత్రులు కిందిస్థాయి నేతలకు రావాల్సిన బిల్లుల గురించి బహిరంగంగానే మాట్లాడారు. రోడ్లు, ఇతర సమస్యల గురించి ప్రస్తావించారు. ఇవన్నీ మీడియాలో హైలెట్ అయ్యాయి. ఇలాంటి సమస్యలను గడప గడపకూ కార్యక్రమం ద్వారా పరిష్కరించిన తర్వాత .. సమీక్షలు నిర్వహిస్తే బెటరని ప్రభుత్వ పెద్దలు ఆలోచించినట్లుగా తెలుస్తోంది. కారణం ఏదైనా రెంండు నియోజకవర్గాలతోనే ప్రస్తుతానికి నియోజకవర్గ సమీక్షలు నిలిచిపోయాయి.