Bharat Jodo Yatra 2nd Phase : కర్ణాటక గెలుపు జోష్ - భారత్ జోడో యాత్ర రెండో విడతకు రాహుల్ రెడీ ?
భారత్ జోడో యాత్ర రెండో విడతను రాహుల్ ప్రారంభిస్తారా ? కర్ణాటక విజయంతో రాహుల్ మళ్లీ నడక ప్రారంభిస్తారా?
Bharat Jodo Yatra 2nd Phase : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో విడత ప్రారంభించేందుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు మంచి బూస్ట్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. భారత్ జోడో యాత్ర రెండో విడత ఉంటుందని ఇంతకు ముందే కాంగ్రెస్ సంకేతాలిచ్చింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు రాహుల్ గాంధీ, ఇతర నాయకులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన దాదాపు 4,000 కిలోమీటర్ల ప్రయాణం తరువాత.. మరో యాత్ర కోసం పార్టీ శ్రేణుల్లో చాలా ఉత్సాహం, శక్తి ఉందని చత్తీస్ ఘడ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశాల సమయంలో చెప్పారు.
ఈ సారి ఈస్ట్-టు-వెస్ట్ యాత్ర ఉంటుందని.. బహుశా అరుణాచల్ ప్రదేశ్ లోని పసిఘాట్ నుంచి గుజరాత్ లోని పోర్‌బందర్ వరకు సాగే అవకాశం ఉందని ఫిబ్రవరిలో కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ తెలిపారు. రెండో విడత యాత్ర ఆకృతి భారత్ జోడో యాత్ర తొలి విడతతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఈ మార్గంలో నదులు, ఆరణ్యాలు ఎక్కువగా ఉన్నందున సవాళ్లతో కూడి ఉంటుందని ఆలోచిస్తున్నారు. జూన్ నుండి వర్షాలు, నవంబర్‌లో మళ్ళీ రాష్ట్ర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. యాత్ర జూన్ కంటే ముందు గానీ, నవంబర్ కంటే ముందు గానీ చేపట్టాలన్న ప్రణాళికలు వేశారు. ఈ యాత్ర.. తొలి విడత కన్నా తక్కువ సమయంలోనే పూర్తయ్యే అవకాశం ుంది.
రాహుల్ గాంధీ నేతృత్వంలో నెలల పాటు సాగిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నంచి కశ్మీర్ వరకూ చేశారు. అక్కడ సభ నిర్వహించి ఆ యాత్రకు ముగింపు పలికింది కాంగ్రెస్. ఈ జర్నీలో తాను ఎన్నో నేర్చుకున్నట్టు చెప్పారు రాహుల్ గాంధీ చాలా సార్లు చెప్పారు. అంతే కాదు. ఇది గ్రాండ్ సక్సెస్ అయిందనీ వెల్లడించారు. పాదయాత్ర పార్టీ కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం వచ్చిందని.. . అందుకే మరోసారి ఇలాంటి యాత్ర కొనసాగించాలని భావిస్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది. భారత్ జోడో యాత్రను తపస్సుతో పోలుస్తున్నారు రాహుల్ గాంధీ.
భారత్ జోడో యాత్రలో కర్ణాటకలో తిరిగిన నియోజకవర్గాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో భారత్ జోడో యాత్ర ఫలితాలు ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు నమ్ముతున్నారు. అందుకే అనుకున్న విధంగా రెండో విడత జోడోయాత్ర నిర్వహించాలన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు. విజయం ఉత్సాహం ...మరోసారి రాహుల్ ను పాదయాత్ర వైపు మళ్లించే అవకాశం ఉంది.