PM Modi News: వచ్చే ఐదేళ్లలో దేశం రూపు రేఖలు మారుస్తాం: ప్రధాని మోడీ ఆత్మవిశ్వాసం
Narendra Modi: పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. వచ్చేది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
PM Narendra Modi news: పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన తర్వాత.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ((Prime Minister Narendra Modi) గతానికి భిన్నమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. జూన్ 4వ తేదీ తర్వాత తామే అధికారంలోకి వస్తామని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దేశాన్ని వచ్చే ఐదేళ్లలో పరుగులు పెట్టిస్తామని, మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దుతామని ప్రధాని ఉద్ఘాటించారు. శనివారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం.. న్యూఢిల్లీలో ఓ ఆంగ్ల మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులోప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గతానికి భిన్నంగా చాలా ఆత్మ విశ్వాసంతో ప్రసంగంచారు. గుక్క తిప్పుకోకుండా.. తన ప్రసంగాన్ని కొనసాగించారు. ముఖ్యంగా రానున్న ఐదేళ్లలో తాము ఏం చేయాలని అనుకుంటున్నామో నిరాఘాటంగా ప్రధాని వివరించారు.
గుక్క తిప్పుకోకుండా..
వచ్చే ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఏం చేయాలని భావిస్తోంది... ఎలాంటి అభివృద్ధిని కాంక్షిస్తోంది? అనే విషయాలను ప్రధాన మంత్రి(PM) గుక్కతిప్పుకోకుండా వివరించారు. ``వచ్చే ఐదేళ్లలో దేశాన్ని ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దతాం. వచ్చే ఐదేళ్లలో సమర్థ, స్వశక్త భారత్ ను రూపొందిస్తాం. వచ్చే ఐదేళ్లలో బుల్లెట్ ట్రైన్‌లు దేశవ్యాప్తంగా పరుగులు పెట్టి స్తాం. వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. రానున్న ఐదేళ్లలో రైల్వేలను మరింత విస్తరిస్తాం. వందే భారత్ రైళ్లను అభివృద్ధిచేస్తాం. వచ్చే ఐదేళ్లలో ఎగుమతుల రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తాం.
వచ్చే ఐదేళ్లలో అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తాం. గగన్‌యాన్‌ను విజయవంతంగా నిర్వహిస్తాం. వచ్చే ఐదేళ్లలో యువతకు అన్ని రంగాల్లోనూ విస్తృతమైన అవకాశాలు కల్పిస్తాం. వచ్చే ఐదేళ్లలో దేశంలోని ప్రతి ఇంటికీ.. సౌరశక్తిని అందిస్తాం. వచ్చే ఐదేళ్లలో టీవీల తయారీ పరిశ్రమను అభివృద్ధి చేస్తాం. వచ్చే ఐదేళ్లలో సెమీకండక్టర్ పరిశ్రమను కొత్త పుంతలు తొక్కిస్తాం`` అని ప్రధాని నరేంద్ర మోడీ(Narendra modi) వినూత్న విశ్వాసంతో నొక్కి చెప్పడం గమనార్హం.
ప్రపంచం మొత్తం మనవైపే
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ వైపు ప్రపంచం నిశ్చయాత్మకంగా చూస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశం ముఖ్యం అనే భావన తనను ముందుకు నడిపిస్తుందని అన్నారు. మరో అయిదేళ్లలో ప్రజలు పలు నిర్ణయాత్మక విధానాలు, నిర్ణయాలు చూస్తారని.. ఆ దిశగా తాను ఇప్పటికే పని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రగతిని కొత్త పుంతలు తొక్కిస్తామని.. ప్రపంచం సుస్థిరమైన, సమర్థమైన, దృఢమైన భారత్‌ను చూస్తుందని చెప్పడానికి వచ్చే అయిదేళ్లు గ్యారంటీ అని తెలిపారు. తమ ప్రభుత్వం అవినీతిని ఎంతమాత్రం సహించలేదని, దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని ప్రధాని చెప్పారు. దర్యాప్తు సంస్థలను తమ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను ప్రధాని తిప్పికొట్టారు. 2014 దాకా 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే సీజ్ చేసిన ఈడీ.. గత పదేళ్లలో లక్ష కోట్ల రూపాయలకుపైగా ఆస్తులను అటాచ్ చేసి ఆయా నేరాల్లో ప్రమేయం ఉన్నవారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. తనను బద్నాం చేయాలని కొందరు ప్రచారం చేస్తున్నారని.. వారి ఉద్దేశాలు, నిబద్ధత చివరకు ప్రశ్నార్థకాలుగా మిగిలిపోతాయని ప్రధానమంత్రి అన్నారు.