UK Election Results 2024: ఓటమిని అంగీకరించిన రిషి సునాక్, అధికారం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ
Uk Election Results : బ్రిటన్ లో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో లేబర్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమి దిశగా పయనిస్తోంది.
Uk Election Results 2024: బ్రిటన్ లో ప్రభుత్వ మార్పు దాదాపు ఖాయమైంది. ప్రధానిగా ఉన్న రిషి సునాక్ పదవి నుంచి దిగిపోయే సమయం ఆసన్నమైంది. బ్రిటన్ లో జులై 4న సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం ఫలితాలు విడుదలవుతున్నాయి. ఎన్నికల్లో లేబర్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో అధికారం దిశగా ముందుకు సాగుతోంది. అధికారంలో ఉన్న ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమి దిశగా పయనిస్తోంది. గడచిన 14 ఏళ్ల నుంచి అప్రతిహతంగా బ్రిటన్‌ని ఏలుతున్న కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురవుతోంది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని అంచనా వేశాయి. లేబర్ పార్టీ 410 స్థానాల్లో గెలుస్తుందని, కన్జర్వేటివ్ పార్టీ 131 సీట్లకు పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అధికారాన్ని చేపట్టాలంటే ఏ పార్టీకైనా 326 సీట్లు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అనుగుణంగానే లేబర్ పార్టీ భారీ స్థానాల్లో విజయం సాధిస్తూ ముందుకు సాగుతోంది.
రిషి సునాక్ భవితవ్యాన్ని తేల్చే ఎన్నికలు
భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ రాజకీయ భవితవ్యాన్ని తేల్చే ఎన్నికలుగా వీటిని నిపుణులు విశ్లేషించారు. లేబర్ పార్టీ తరఫున కీర్ స్మార్టర్ ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయని సంకేతాలు వెలువడిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. లేబర్ పార్టీపై నమ్మకం ఉంచిన కార్యకర్తలు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడిన వెంటనే సునాక్ కూడా ఓటర్లకు, పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
650 స్థానాలకు జరిగిన ఎన్నికలు
బ్రిటన్ లోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తన్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీ అయినా 326 స్థానాల్లో విజయం సాధిస్తే అధికారాన్ని దక్కించుకుంటుంది. రెండు ప్రధాన పార్టీలతోపాటు లిబరల్ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, ఎస్డిఎల్పీ, డెమోక్రటిక్ యూనియన్ పార్టీ, షిన్ ఫీన్, ప్లయిడ్ కమ్రి, వర్కర్స్ పార్టీ, యాంటీ ఇమిగ్రేషన్ రిఫార్మ్ పార్టీతోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో నిలిచారు. లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని సునాక్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరోవైపు తరచూ ప్రధానులు మారే అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని స్టార్మర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
విజయం దిశగా దూసుకుపోతున్న లేబర్ పార్టీ..
బ్రిటన్ లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి లేబర్ పార్టీ 298 స్థానాల్లో విజయం సాధించగా, కన్జర్వేటివ్ పార్టీ 61 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇతరులు మరో 54 స్థానాల్లో గెలుపొందారు. మిగిలిన స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాలను లేబర్ పార్టీ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో తో పోలిస్తే తాజా ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదయింది. దాదాపు 4.6 కోట్ల మంది ఉండగా, 67% కంటే తక్కువగానే ఓటింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది.
Also Read: UK Election Results 2024: రాజకీయాల్లో స్టార్మర్ స్టైలే వేరు, ప్రధానిగానూ అదే మార్క్ చూపిస్తారా?