ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బూస్ట్- ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ అభ్యర్థుల విజయం - పశ్చిమలో కొనసాగుతున్న లెక్కింపు
తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయకేతనం ఎగరేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. మూడు పట్టభద్రులు నియోకవర్గాల్లో ఎన్నికలు జరిగితే రెండింటిని కైవశం చేసుకుంది టీడీపీ. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కోటాకు అనుకూలంగా ఓట్ల శాతం రాకపోవడంతో.. ఎలిమినేషన్ ప్రకారం విజేతను ప్రకటించారు. ఎలిమినేషన్ రౌండ్‌లో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తారు. వాళ్లకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్లకు కలుపుతారు. ఇలా రెండో ప్రాధాన్యత ఓట్లతో టీడీపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించారు.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం అంటే ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయకేతనం ఎగరేశారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందదారు. కంచర్ల శ్రీకాంత్ 34,108 ఓట్లతో ఘన విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు తెలుగుదేశం అభ్యరర్థికి 11,511 రాగా... వైసీపీ అభ్యర్థికి 3,900 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్ధికి 50%+1 ఓట్లు రావడంతో విజేతగా ప్రకటించారు.
శుక్రవారం ఉందయం 8 గం.ల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై వేకువజాము వరకు కొనసాగింది. 18వ తేదీ ఉదయం 2 గంటలకు విజేతను అధికారులు ప్రకటించారరు. ఎలిమినేషన్ ఓటింగ్ ప్రక్రియతో తన సమీప అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేర్నాటిపై 34,110 ఓట్ల ఆధిక్యంతో కంచర్ల శ్రీకాంత్ గెలుపొందారు.
ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రాధాన్యతా ప్రక్రియలో మొత్తం 2,48,360 ఓట్లకు కంచర్ల శ్రీకాంత్‌కు 1,24,181 ఓట్లు, శ్యామ్ ప్రసాద్ పెర్నాటికి 90,071 ఓట్లు వచ్చాయి.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు వైసీపీ తరపున పోటీ చేసిన శీతంరాజు సుధాకర్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. 11,551 రెండో ప్రాధాన్యత కోటా ఓట్లను వేపాడ చిరంజీవి సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దాంతో విజయానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను వేపాడ రెండో ప్రాధాన్యత ఓట్లతో సాధించినట్టు అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెండో ప్రాధాన్యత ఓటు కీలకం గా మారింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు లో చెల్లని ఓట్లు తొలగించగా గెలుపు కోసం 94,509 ఓట్లు అవసరం అయ్యాయి. అయితే మొదటి స్థానంలో ఉన్న చిరంజీవి రావు కూడా 83 వేల ఓట్ల పరిధిలోనే ఉండిపోవడం తో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు వెళ్లారు అధికారులు. సీతంరాజు సుధాకర్‌కు 55,749 ఓట్లు రాగా, పిడిఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ 35,148 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అందులో తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. విజయానికి కావాల్సిన కోటా ఓట్లు 11,551 సాధించడంతో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
వేపాడ చిరంజీవిరావు ప్రముఖ విద్యావేత్త, రచయిత, అర్ధశాస్త్ర అధ్యాపకులు. తెలుగుదేశం పార్టీ తరుపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. చిరంజీవిరావు చోడవరం నియోజకవర్గం పరిధిలోగల రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన వ్యక్తి. 2023 ఫిబ్రవరి మొదటి వారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకు రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చం నాయుడు టీడీపీ తరుపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి అభ్యర్ధిగా వేపాడ చిరంజీవిరావు పేరు ప్రకటించారు. వేపాడ చిరంజీవిరావు 20 ఏళ్లకుపైగా ఆర్‌సి రెడ్డి కోచింగ్ సెంటర్, ఇతర కాలేజీలలో ఎకానమీ లెక్చరర్‌గా చేస్తున్నారు.