Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నిల్, కానీ....
Telangana Local Body Elections: స్థానిక సంస్థలు ఎన్నికలపై ఉన్న అనుమానాలను హైకోర్టు క్లియర్ చేసింది. నోటిఫికేషన్ జోలికి వెళ్లలేదని పాత విధానంలో జరుపుకోవచ్చని స్పష్టం చేసింది.

Telangana Local Body Elections: బీసీ రిజర్వేషన్ పెంపుతో బ్రేక్ పడిన స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు కీలక విషయాలు వెల్లడించింది. రెండు రోజుల క్రితం ఇచ్చిన తీర్పు కాపీ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ తీర్పు కాపీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలను పాత రిజర్వేషన్ ప్రకారం నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. రిజర్వేషన్లు యాభై శాతానికి మించకుండా ఎన్నికలు జరపడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించింది. కేవలం తాజాగా విడుదల చేసిన జీవో నెంబర్ 9 దాన్ని నోటిఫై చేస్తూ ఎన్నికల ప్రక్రియను జరిపేందుకు జారీ చేసిన జీవో నెంబర్ 41,42ను మాత్రమే నిలుపుదల చేస్తున్నట్టు తీర్పు కాపీలో పేర్కొంది.
స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహణ బంతిని హైకోర్టు ప్రభుత్వం కోర్టులోనే పడేసింది. పాత విధానంలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. గడవు తీరినందుకు పాత విధానంలో ఎన్నికలు నిర్వహించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది. సుప్రీం కోర్టులోని వికాస్ కిషన్‌రావు గవాలి కేసును ఉదాహరణగా చూపించింది. దీని ప్రకారం మూడు జీవోలు నిలిపేస్తున్నట్టు స్పష్టం చేసింది. పాత విధానంలో ఎన్నికలు జరపొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుతాయి. పాత కేసులు పరిశీలించిన తర్వాత ప్రభుత్వం 50 శాతం పరిమితిని అమలు చేయడంలో విఫలమైందని అభిప్రాయపడింది. అంతే తప్ప ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రక్రియలో జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. వాటిని నిలిపేస్తున్నట్టు పేర్కొనలేదు. ఈ కేసు విచారణ పూర్తి అయ్యే వరకు పాత విధానంలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తేల్చి చెప్పింది.





















